బీసీల జనాభా లెక్కలు తేల్చాలి.. కులగణన తప్పనిసరి: మంత్రి శ్రీహరి | Telangana BC Caste Census Vakiti Srihari | Sakshi
Sakshi News home page

బీసీల జనాభా లెక్కలు తేల్చాలి.. కులగణన తప్పనిసరి: మంత్రి శ్రీహరి

Sep 11 2026 10:51 PM | Updated on Sep 11 2026 10:51 PM

Telangana BC Caste Census Vakiti Srihari

బీసీల జనాభా లెక్కలు తేల్చాలి.. కులగణన చేపట్టాలి

బీసీ రిజర్వేషన్లు దానం కాదు.. హక్కు: మంత్రి వాకిటి శ్రీహరి

కేంద్ర జనగణనలో బీసీల కులగణన తప్పనిసరిగా చేపట్టాలని డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా బీసీల జనాభా ఎంత ఉందో కచ్చితంగా తేల్చడంతోపాటు.. వారి సామాజిక, విద్యా, ఆర్థిక పరిస్థితులపై స్పష్టమైన గణాంకాలు సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో బీసీల కులగణనను తప్పనిసరిగా చేపట్టాలని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి డిమాండ్‌ చేశారు. శుక్రవారం అసెంబ్లీలో కులగణనపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. బీసీలకు రిజర్వేషన్లు ఎవరో ఇచ్చిన దానం కాదని, సామాజిక న్యాయం కోసం దశాబ్దాలుగా సాగిన పోరాటం ఫలితంగా లభించిన హక్కు అని స్పష్టం చేశారు.

బీసీలకు న్యాయం చేయాలంటే ముందుగా వారి జనాభా ఎంత ఉందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. వారి జనాభాతోపాటు విద్య, ఉద్యోగాలు, ఆర్థిక పరిస్థితి, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలపై కచ్చితమైన సమాచారం ఉంటేనే ప్రభుత్వాలు సరైన విధానాలను రూపొందించగలవని తెలిపారు. డేటా లేకుండా బీసీలకు ఎంత వాటా కల్పించాలో ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు.

మండల్‌ కమిషన్‌ నుంచి రిజర్వేషన్ల వరకు..
బీసీల హక్కుల కోసం దేశంలో జరిగిన పరిణామాలను మంత్రి ప్రస్తావించారు. 1953లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం కాకా కాలేల్కర్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు. అనంతరం 1979లో బి.పి. మండల్‌ కమిషన్‌ ఏర్పడి దేశవ్యాప్తంగా బీసీల సామాజిక, విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇతర వెనుకబడిన తరగతులకు (ఓబీసీ) 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మండల్‌ కమిషన్‌ సిఫారసు చేసిందని, 1990లో ఆ సిఫారసుల అమలుకు కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసిందని గుర్తుచేశారు.

1992లో ఇంద్రా సాహ్నీ కేసులో సుప్రీంకోర్టు ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి కీలక మార్గదర్శకాలు ఇచ్చిందని మంత్రి తెలిపారు. 1993లో జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌ (ఎన్‌సీబీసీ) ఏర్పడిందని, 2018లో 102వ రాజ్యాంగ సవరణ ద్వారా దానికి రాజ్యాంగ హోదా లభించిందన్నారు. ఓబీసీ రిజర్వేషన్ల ప్రయోజనాలు అన్ని వర్గాలకు సమానంగా అందుతున్నాయా అనే అంశాన్ని పరిశీలించేందుకు జస్టిస్‌ రోహిణి కమిషన్‌ను కూడా కేంద్రం ఏర్పాటు చేసిందని తెలిపారు.

తెలంగాణ కుల సర్వే చారిత్రక నిర్ణయం
తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుల సర్వే సామాజిక న్యాయానికి పునాది వేసిందని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ వర్గానికి ఎంత జనాభా ఉంది? వారి సామాజిక, విద్యా, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రభుత్వ ఉద్యోగాల్లో వారి ప్రాతినిధ్యం ఎంత? రాజకీయంగా వారి వాటా ఎంత? వంటి అంశాలపై స్పష్టత రావడానికి ఈ సర్వే ఉపయోగపడుతుందని చెప్పారు.

ఇది కేవలం జనాభా లెక్కలు సేకరించే కార్యక్రమం కాదని.. సామాజిక న్యాయానికి బలమైన పునాది అని మంత్రి పేర్కొన్నారు. బీసీల హక్కులను సాధించేందుకు అవసరమైన గణాంక ఆధారాలను ఈ సర్వే అందిస్తుందని తెలిపారు.

‘జిత్నీ ఆబాదీ.. ఉత్నా హక్‌’
రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ కలలుగన్న సామాజిక సమానత్వం దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి అన్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఇచ్చిన ‘జిత్నీ ఆబాదీ.. ఉత్నా హక్‌’ నినాదం సామాజిక న్యాయానికి దిశానిర్దేశం చేస్తోందన్నారు. జనాభాలో ఏ వర్గానికి ఎంత వాటా ఉంటే.. అవకాశాలు, అధికారంలోనూ అంతే వాటా ఉండాలనే స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సుదీర్ఘకాలంగా అధికారంలో ఉన్నప్పటికీ బీసీల జనాభా లెక్కలు తేల్చేందుకు ఎందుకు వెనుకడుగు వేస్తోందని మంత్రి ప్రశ్నించారు. బీసీలు ఎంతమంది ఉన్నారో తెలియకుండా వారికి ఎంత వాటా ఇవ్వాలో ఎలా నిర్ణయిస్తారని అన్నారు. బీసీలకు సామాజిక న్యాయం అందించాలంటే వారి జనాభా, సామాజిక, విద్యా, ఆర్థిక పరిస్థితులపై ఖచ్చితమైన గణాంకాలు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.

కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఎందుకు లేదు?
బీసీల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఎందుకు ఏర్పాటు చేయలేదని మంత్రి ప్రశ్నించారు. బీసీల సమస్యలు, వారి అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రత్యేకంగా పర్యవేక్షించే వ్యవస్థ అవసరమని పేర్కొన్నారు. బీసీల జనాభా లెక్కలు తేల్చడంతోపాటు వారి హక్కులకు అనుగుణంగా సామాజిక న్యాయం అందించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణనలో బీసీల కులగణనను స్పష్టంగా చేర్చాలని మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. బీసీలను లెక్కించడం ద్వారా వారి జనాభాకు అనుగుణంగా హక్కులు, అవకాశాలు కల్పించేందుకు మార్గం సుగమం అవుతుందని తెలిపారు. ‘కులగణన చేపట్టండి.. సామాజిక న్యాయాన్ని బలోపేతం చేయండి’ అని కేంద్ర ప్రభుత్వానికి పిలుపునిచ్చారు.

ఇవీ చదవండి: సీఎం ప్రజావాణికి 101 దరఖాస్తులు.. అత్యధికంగా రెవెన్యూ సమస్యలే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement