ప్రజా సమస్యలపై ప్రజావాణిలో స్పందన
సీఎం ప్రజావాణికి 101 దరఖాస్తులు.. అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన గద్వాల్ విజయలక్ష్మి
రెవెన్యూ, మున్సిపల్, బీసీ సంక్షేమ శాఖలకు అధికంగా ఫిర్యాదులు
పది మందికి సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ
సాక్షి, తెలంగాణ: తమ సమస్యలు పరిష్కరించాలంటూ ప్రజలు సీఎం ప్రజావాణిని ఆశ్రయించారు. మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌లో శుక్రవారం నిర్వహించిన 254వ సీఎం ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 101 దరఖాస్తులు వచ్చాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ప్రజావాణి ఇన్‌చార్జ్, రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్ చైర్‌పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి దృష్టికి తీసుకెళ్లారు.
రెవెన్యూ శాఖకే 24 దరఖాస్తులు..
అందిన దరఖాస్తుల్లో రెవెన్యూ శాఖకు సంబంధించి అత్యధికంగా 24 వచ్చాయి. మున్సిపల్ శాఖకు 16, బీసీ సంక్షేమ శాఖకు 13 దరఖాస్తులు అందగా.. ఇతర శాఖలకు సంబంధించి 48 దరఖాస్తులు వచ్చాయి. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన గద్వాల్ విజయలక్ష్మి వాటిని సంబంధిత అధికారులకు ఎండార్స్‌మెంట్ చేశారు. సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలని అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు.
ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా నేరుగా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేలా ప్రజావాణి కార్యక్రమం ఉపయోగపడుతోంది.
పది మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు..
అనారోగ్యంతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పది మందికి సీఎం సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) కింద ఆర్థిక సాయం అందింది. ప్రజా భవన్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో గద్వాల్ విజయలక్ష్మి లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. వైద్య చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఈ సాయం కొంత ఊరటనిచ్చింది.
ఈ కార్యక్రమంలో స్టేట్ నోడల్ అధికారి కే. విద్యాసాగర్, డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఏసీపీ ఉమేందర్, ఎన్‌ఆర్‌ఐ సలహా మండలి వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి: ‘అందుకే విద్యాశాఖను నా వద్ద ఉంచుకున్నా’


