వారి భవిష్యత్తు కోసమే విద్యా విధానంలో సంస్కరణలు: శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి
ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేయడంతో అద్భుత ఫలితాలు వచ్చాయి
పాలిటెక్నిక్ కోర్సులో సంస్కరణలతో కూడా మెరుగైన ఫలితాలు వస్తాయి
ఇందులో భాగంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో అనుసంధానం
టాటా సంస్థతో అత్యాధునిక మౌలిక వసతులతో బోధన.. బోధన, బోధనేతర సిబ్బందికి ఏమాత్రం నష్టం కలగదు
విద్యార్థులపై కొత్తగా ఫీజుల భారం ఉండదు
కాలేజీల ప్రైవేటీకరణ ప్రసక్తే లేదన్న సీఎం
విద్యార్థులు నేతల ఉచ్చులో పడొద్దని హితవు
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించేందుకే విద్యావిధానంలో సంస్కరణలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేయడంతో అద్భుతమైన ఫలితాలు వచ్చాయని, అంతర్జాతీయ స్థాయి కంపెనీల్లో వారికి ఉపాధి అవకాశాలు అందుతున్నాయని తెలిపారు. అదేవిధంగా ప్రస్తుతం చేపట్టిన పాలిటెక్నిక్ కోర్సులో సంస్కరణలతో కూడా మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ సంస్కరణలు చూస్తే 2029లో విద్యార్థులంతా తనకు మళ్లీ మద్దతు ఇస్తారని అన్నారు. శుక్రవారం శాసనసభలో విద్యపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు.
కాగితంపై రాసిస్తా..
‘కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్)లో భాగంగా టాటా సంస్థతో ప్రత్యేకంగా చర్చించి ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీలు)గా అప్‌గ్రేడ్ చేయించాం. రాష్ట్రంలోని 70 ఏటీసీల్లో అత్యాధునిక సాంకేతిక విధానంతో శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. శిక్షణ పూర్తి చేసుకున్నవారికి టాటా సంస్థలో ఉపాధి దొరుకుతుంది. కానీ ఈ ఏటీసీ ప్రైవేటీకరణ జరగలేదు. అన్నీ ప్రభుత్వ అధీనంలోనే నడుస్తున్నాయి. అదే విధంగా పాలిటెక్నిక్ కోర్సును యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ(వైఐఎస్‌యూ)తో అనుసంధానం చేస్తున్నాం. దీంతో బోధన, బోధనేతర సిబ్బందికి ఏమాత్రం నష్టం ఉండదు. వారి సర్వీసు నిబంధనలకు ఆటంకం కలగదని కాగితంపై రాసిస్తా. విద్యార్థులపై కొత్తగా ఫీజుల భారం కూడా ఉండదు. ఆ తర్వాత ఇంజనీరింగ్‌లో చేరే విధానం (లాటరల్ ఎంట్రీ) కూడా కొనసాగుతుంది.
విద్యార్థులకు నష్టం చేస్తే నాకు ఒరిగేదేం లేదు..
డిప్లొమా పూర్తి చేసిన వెంటనే ఉపాధి అందేలా స్కిల్స్ యూనివర్సిటీలో భాగస్వామ్యంగా ఉన్న కంపెనీలు చర్యలు తీసుకుంటాయి. పాలిటెక్నిక్ అప్‌గ్రెడేషన్‌లో భాగంగా టాటా సంస్థతో రూ.4 వేల కోట్ల విలువైన అత్యాధునిక మౌలిక వసతులతో బోధన చేపట్టనున్నాం. ఎంతో ప్రయాసపడి ఈ నిధిని తీసుకొస్తున్నాం, ఇప్పుడు వద్దంటే ఆ మొత్తాన్ని ప్రభుత్వం పదేళ్లయినా ఖర్చు చేయలేదు. విద్యార్థులకు నష్టం చేస్తే నాకు ఒరిగేదేం లేదు. కానీ కొందరు రాజకీయ నాయకులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. పాలిటెక్నిక్ కాలేజీలను ప్రైవేటీకరిస్తారని అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు. అలాంటి రాజకీయ నాయకుల ఉచ్చులో విద్యార్థులు పడొద్దు. ఒక్క కాలేజీని కూడా ప్రైవేటుకు అప్పగించే ప్రసక్తే లేదు..’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
బడ్జెట్ మూడేళ్లలో రూ.7,554 కోట్లు పెరిగింది..
‘రాష్ట్రంలో విద్యకు కేటాయింపులు క్రమంగా పెంతున్నాం. 2023–24 వార్షిక బడ్జెట్‌లో గత ప్రభుత్వం విద్యాశాఖకు రూ.19,093 కోట్లు కేటాయిస్తే.. మా ప్రభుత్వం 2024–25లో రూ.21,292 కోట్లు, 2025–26లో రూ.23,108 కోట్లు, 2026–27లో రూ.26,647 కోట్లు కేటాయించింది. కేవలం మూడేళ్లలో విద్యా బడ్జెట్‌ను రూ.7,554 కోట్లు పెంచాం. అధికారంలోకి వచి్చన తొలి ఏడాదిలోనే 55 రోజుల్లో 10,006 మంది టీచర్ల నియామకాలు ఎలాంటి ఆరోపణలకు తావులేకుండా పూర్తి చేశాం. గత ప్రభుత్వం పదేళ్లలో 7,857 మంది టీచర్లను మాత్రమే నియమించింది.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 86 వేలకు పైగా పెరిగింది. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీలను ప్రవేశపెట్టాం. ఇంగ్లిష్ విద్య కారణంగా తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల వైపు వస్తున్నారు. ఈ ఏడాది 64 వేల మంది విద్యార్థులు ప్రీ ప్రైమరీ విద్య పొందుతున్నారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు అల్పాహారంతో పాటు ఉపాధ్యాయులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. సెంట్రలైజ్డ్ కిచెన్ల ద్వారా నాణ్యమైన అల్పాహారం, భోజనం అందిస్తున్నాం..’ అని సీఎం చెప్పారు.
వాస్తవ కాలేజీలకే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్
‘ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద గత ప్రభుత్వం రూ.5,430 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లింది. అందులో రూ.1,410 కోట్లు మేము చెల్లించాం. ఆ తర్వాత మరో రూ.1,475 కోట్లు చెల్లించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో రూ.612 కోట్లు విడుదల చేశాం. మొత్తం 32 నెలల్లో మొత్తం రూ.3,488 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు ఇచ్చాం. విజిలెన్స్ తనిఖీల్లో కొన్ని కాలేజీల్లో అవకతవకలు గుర్తించారు.
అదేవిధంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గత ప్రభుత్వంలోని ఓ మంత్రికి చెందిన కాలేజీల్లో బ్యాంకు ఖాతాలు పరిశీలిస్తే రూ.400 కోట్లు సర్‌ప్లస్ నిధి ఉంది. దోపిడీ చేస్తే వచ్చిందా? లేక విద్యార్థుల నుంచి దండుకుంటే వచ్చిందా? అనేది అర్థం కాలేదు. గత ప్రభుత్వం చెల్లించని ఫీజులను విడతల వారీగా చెల్లిస్తాం. కానీ కేవలం నిజమైన కాలేజీలకు మాత్రమే ఇస్తాం. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు విద్యార్థి ఖాతాల్లోనే ఫీజు నిధులు జమ చేస్తున్నాం..’ అని రేవంత్ వివరించారు.
పదేళ్లు ఫీజులు ఇవ్వకపోయినా బీజేపీ మాట్లాడలేదు..
‘ప్రజా ప్రభుత్వం కేవలం పేద కుటుంబాలు, ప్రజల అభ్యున్నతి కోసమే పనిచేస్తుంది. గత ప్రభుత్వంలోని పెద్దలు కేవలం వారి కుటుంబం కోసమే పనిచేశారు. ఇప్పుడు వాళ్లు కడుపులో కుళ్లు, పేద పిల్లలపై ద్వేషంతో ఉన్నారు. పేద విద్యార్థుల కోసం చేసే ప్రయత్నాలను ఎప్పటికప్పుడు అడ్డుకునే కుట్ర చేస్తున్నారు. పేద పిల్లలకు మేం అన్యాయం జరగనివ్వం. వారి భవిష్యత్ బాగుండాలనే మా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పదేళ్లు అధికారంలో ఉండి దోచుకున్నారు. ఇప్పుడు అధికారం లేకపోవడంతో అహంకారంతో ప్రభుత్వాన్ని అడ్డుకుంటున్నారు.
దుర్మార్గం వైపు, అహంకారం వైపు ఉన్నందునే పది తలల రావణుడు కూడా రాముడి చేతిలో మరణించాడు. పదేళ్లు ఫీజులు ఇవ్వకపోయినా ఒక్కరోజు కూడా బీజేపీ నేతలు మాట్లాడలేదు. ఒక్కరోజు కూడా ధర్నా చేయలేదు. నేను వచ్చాక మాత్రం నాపై ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అలా? కేసీఆర్‌లా నేను అణచివేస్తలేననా? లేక కేసీఆరే వారిని ఉసిగొల్పుతున్నారా? గత ప్రభుత్వం కేంద్రం నిధులను వద్దని చెప్పి, ఇక్కడ ఫీజులు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బంది పెట్టింది. మేం కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులను పూర్తిగా వినియోగించుకుంటాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు.


