ఉదయ్ ఒప్పందంపై ఒక్క అడుగు కూడా ముందుకెళ్లం
విద్యుత్ వ్యవస్థ ఆధునీకరణ కోసమే ఆర్‌డీఎస్‌ఎస్
తక్కువ ధరకు విద్యుత్ అందించడమే సర్కారు లక్ష్యం
శాసనమండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: భూమి ఆకాశం ఏకమైనా వ్యవసాయ మోటార్లు, పంప్‌సెట్లకు మీటర్లు ఏర్పాటు చేయబోమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. వ్యవసాయ పంప్‌సెట్ల విషయంలో ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని తేల్చిచెప్పారు. రాష్ట్ర రైతాంగానికి, వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఈ మేరకు 100 శాతం హామీ ఇస్తున్నానని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని, రైతులకు ఉచిత విద్యుత్ అందించే విధానాన్ని కొనసాగిస్తామని తెలిపారు. శుక్రవారం శాసనమండలిలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ లెవనెత్తిన అంశంపై భట్టి మాట్లాడారు.
బీఆర్‌ఎస్ హయాంలోనే ఉదయ్ ఒప్పందం
‘వ్యవసాయ పంప్‌సెట్లకు మీటర్లు పెట్టాలన్న నిబంధన ఆర్‌డీఎస్‌ఎస్ పథకంలో లేదు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రంతో ఉదయ్ పథకం కింద త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం, డిస్కమ్‌లు, కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కలిసి ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. 2017 జూన్ 30 నాటికి 100 శాతం డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ (డీటీ) మీటరింగ్ పూర్తి చేయాలని, 2018 డిసెంబర్ 31 నాటికి వ్యవసాయ వినియోగదారులను మినహాయించి నెలకు 500 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగించే వినియోగదారులకు మీటర్లు ఏర్పాటు చేయాలని, 2019 డిసెంబర్ 31 నాటికి నెలకు 200 యూనిట్లకు పైగా వినియోగించే వినియోగదారులకు ఏర్పాటు చేయాలని ఆ ఒప్పందంలో పేర్కొన్నారు. అయితే ఈ ఒప్పందం విషయంలో మేం ఒక్క అడుగు కూడా ముందుకు వేయం.
విద్యుత్ వ్యవస్థ ఆధునీకరణ కోసమే ఆర్‌డీఎస్‌ఎస్
తాజా పంపిణీ రంగ పథకం (ఆర్‌డీఎస్‌ఎస్)లో వ్యవసాయ పంప్‌సెట్లకు తప్పనిసరిగా మీటర్లు ఏర్పాటు చేయాలనే నిబంధన ఎక్కడా లేదు. విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడం, నెట్‌వర్క్ విస్తరణ, ట్రాన్స్‌ఫార్మర్ల అప్‌గ్రేడేషన్, ఎస్‌సీఏడీఏ, ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్లు, సెక్షనలైజర్లు, ఆటో రీ–క్లోజర్లు వంటి ఆధునిక సాంకేతిక వ్యవస్థలను ఏర్పాటు చేయడమే ఆర్‌డీఎస్‌ఎస్ లక్ష్యం..’అని భట్టి స్పష్టం చేశారు.
సెప్టెంబర్ 9న రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్
‘తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సెపె్టంబర్ 9న 19,543 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఇంత భారీ డిమాండ్‌ను కూడా ప్రస్తుత వ్యవస్థతోనే తట్టుకుని నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయగలుగుతున్నాం. గతంలో 9 వేల నుంచి 10 వేల మెగావాట్లుగా ఉన్న రాష్ట్ర విద్యుత్ డిమాండ్ ప్రస్తుతం 19 వేల నుంచి 20 వేల మెగావాట్లకు పెరిగింది. ప్రస్తుతం 15 వేల మెగావాట్ల సామర్థ్యానికి అనుగుణంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్‌మిషన్ వ్యవస్థ, సబ్‌స్టేషన్లు, విద్యుత్ లైన్లపై 19 వేల నుంచి 20 వేల మెగావాట్ల వరకు డిమాండ్‌ను తట్టుకునే పరిస్థితి ఏర్పడింది.
కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ అంచనాల ప్రకారం 2029–30 నాటికి తెలంగాణ గరిష్ట విద్యుత్ డిమాండ్ 24,624 మెగావాట్లకు, 2034–35 నాటికి 34,137 మెగావాట్లకు చేరే అవకాశం ఉంది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరగడానికి వర్షాభావ పరిస్థితులే ప్రధాన కారణం. అయితే ఎంత పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చయినా విద్యుత్‌ను కొనుగోలు చేసి రాష్ట్ర ప్రజలకు, రైతులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
సోలరైజేషన్ ద్వారా రైతులకు మెరుగైన విద్యుత్
వ్యవసాయ పంప్‌సెట్లను సోలరైజేషన్ చేయడం ద్వారా విద్యుత్ వ్యయాన్ని తగ్గించడంతో పాటు రైతులకు మెరుగైన విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. సోలరైజేషన్ కార్యక్రమాన్ని ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అయ్యే ప్రతి పైసాను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. విద్యుత్ ఉత్పత్తి వ్యయాన్ని ఎంత తగ్గించగలిగితే వినియోగదారులకు అంత తక్కువ ధరకే విద్యుత్ అందించవచ్చు. అందువల్ల తక్కువ ధరకు లభించే సోలార్ విద్యుత్‌ను వినియోగించుకోవడంతో పాటు గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్లాల్సిన అవసరం ఉంది..’అని భట్టి తెలిపారు.


