దేశంలో ఓబీసీల లెక్కలపై అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి
సభలో తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్
సాక్షి, హైదరాబాద్: జనగణనలో కులగణన కూడా చేర్చాలని.. దేశవ్యాప్తంగా ఓబీసీల జనాభా గణాంకాలు కచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరారు. శాసనసభలో శుక్రవారం జరిగిన లఘు చర్చలో దీనిపై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బలహీనవర్గాల సామాజిక న్యాయం, విద్యావకాశాలు, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం కోసం కచ్చితమైన గణాంకాలు ఉండాలని మంత్రి పొన్నం అభిప్రాయపడ్డారు. అన్ని పార్టీలూ దీనికి మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే ద్వారా రాష్ట్రంలోని బీసీల వాస్తవ పరిస్థితిని గుర్తించే ప్రయత్నం జరిగిందన్నారు. ఆ సర్వే ఆధారంగా బీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చట్టపరమైన చర్యలు చేపట్టిందని పొన్నం చెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వం గతంలో నిర్వహించిన జనగణనలో ఓబీసీలకు స్పష్టమైన ప్రత్యేక గుర్తింపు ఇవ్వకుండా ఓపెన్ కాలమ్ విధానం పెట్టడం వల్ల కచ్చితమైన ఓబీసీ గణాంకాలు సేకరించడం కష్టమైందన్నారు. కేంద్ర జనగణనలో ఓబీసీలకు ఎస్సీ, ఎస్టీల మాదిరిగా ప్రత్యేక గుర్తింపు కల్పించాలని, ఓబీసీల కోసం ప్రత్యేక కాలమ్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
బీజేపీ నైజాన్ని ప్రజలు గమనించాలి: మంత్రి సీతక్క
కులగణనపై చర్చ సందర్భంగా బీజేపీ సభ్యుల వాకౌట్‌ను మంత్రి సీతక్క తీవ్రంగా ఆక్షేపించారు. ప్రధాని మోదీ పేరుకే బీసీ అని, కులగణనకు మాత్రం ఆయన వ్యతిరేకమని విమర్శించారు. బీజేపీ నైజాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. జనగణనలో కులగణన చేపట్టాలన్న మంత్రి పొన్నం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కాంగ్రెస్ పక్ష సభ్యులు నవీన్‌యాదవ్, బీర్ల ఐలయ్య, సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు, తదితరులు బలపరిచారు. కాగా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయని కారణంగా బీసీ కులగణనపై జరిగిన చర్చ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు బీజేపీ సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారు. బీసీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగానూ సహకరించట్లేదని బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్ విమర్శించారు.


