దేశంలోనే అతితక్కువగా ఈ రంగానికి రాష్ట్ర ప్రభుత్వ కేటాయింపులు
విద్యారంగంలో చొరవలపై లఘు చర్చలో బీజేఎల్పీ నేత ఏలేటి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్యావ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. దేశంలోనే విద్యారంగానికి అత్యల్పంగా 8.2 శాతం బడ్జెట్ కేటాయిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని విమర్శించారు. శుక్రవారం అసెంబ్లీలో విద్యారంగంలో చొరవలు అంశంపై జరిగిన లఘు చర్చలో ఏలేటి మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులకు రూ. 15 వేల కోట్ల పాత ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రయోజనాలను దెబ్బతీసేలా తెచ్చిన వివాదాస్పద జీవో 97ను తక్షణమే రద్దు చేయాలన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 886 ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగి 42 మంది విద్యార్థులు మరణించారని సభ దృష్టికి తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వ యూడీఐఎస్‌ఈ నివేదిక ఆధారంగా రాష్ట్రంలోని 1,859 స్కూళ్లలో కనీసం తాగునీటి సదుపాయం లేదని, 1,752 పాఠశాలల్లో బాలికలకు మరుగుదొడ్లు లేవని, 30 వేలకు పైగా పాఠశాలల్లో 21 వేలకు పైగా బడులు శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు.
‘నీట్’రాష్ట్రాలకే వదిలేసేలా తీర్మానం చేయాలి: కూనంనేని
విద్యారంగంపై కేంద్ర ప్రభుత్వ వైఖరి సరికాదని.. విద్యా రంగ హక్కులను కూడా కేంద్రం లాక్కుంటోందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీలపై ఆందోళన వ్యక్తం చేశారు. నీట్ పరీక్షా విధానాన్ని రాష్ట్రాలకే వదిలేసేలా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని సూచించారు. గ్రామాల్లో ఆంగ్ల మాధ్యమ చదువును తప్పనిసరి చేయాలన్నారు. ఇంటర్ బోర్డును ఎత్తేయకుండా గ్రామీణ స్కూళ్లలోనే సీబీఎస్‌ఈ సిలబస్ తేవాలని కోరారు.
ఎంఐఎం మిత్రులూ.. కొంచెమైనా పొగడరూ..: సీఎం సరదా వ్యాఖ్యలు
‘ఎంఐఎం ఎమ్మెల్యేలను మంచి మిత్రులుగా పరిగణిస్తాం. అయితే వారు ఎప్పుడూ వినతిపత్రాలు ఇవ్వడంలో ముందుంటారు తప్ప నేను చేసిన మంచి పనులకు, అడిగిన వెంటనే అభివృద్ధి పనులు చేసినందుకు కొంచెమైనా పొగిడితే బావుంటుంది’అని సీఎం రేవంత్‌రెడ్డి సరదాగా వ్యాఖ్యానించారు. నాలుగు ఏటీసీ సెంటర్లు, బ్రిడ్జీల ఫౌండేషన్, రోడ్లు, పాఠశాలల ప్రారంభోత్సవం వంటివి చేపట్టినా ఎంఐఎం సభ్యులు ఒక్కసారీ పొగడలేదన్నారు. తనను పొగిడేందుకు అసదుద్దీన్, అక్బరుద్దీన్ అనుమతి ఇచ్చారో లేదో తెలియదని.. ఎమ్మెల్యేలకు పొగిడే అవకాశం ఇవ్వాలని ఈసారి కలిసినపుడు వారికి చెబుతానని చమత్కరించారు. చర్చలో కాంగ్రెస్ సభ్యులు యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి, ఆదినారాయణ, ఎంఐఎం ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ పాల్గొన్నారు.


