భారత ప్యాసింజర్ వాహన మార్కెట్‌లో చారిత్రక మలుపు చోటుచేసుకుంది. ఇన్నాళ్లూ కొంటే పెట్రోల్ కారే కొనాలనే తీరుకు భిన్నంగా సీఎన్‌జీ, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు) ముందువరుసలోకి వస్తున్నాయి. ఈక్విరస్ సెక్యూరిటీస్ నివేదిక ప్రకారం, ఆగస్టు 2026లో సీఎన్‌జీ, హైబ్రిడ్, ఈవీలు కలిపి రిటైల్ అమ్మకాల్లో 42 శాతం వాటాను దక్కించుకోగా, పెట్రోల్ వాహనాల వాటా 41 శాతానికి పడిపోయింది. ఒకప్పుడు ఏకచ్ఛత్రాధిపత్యం వహించిన పెట్రోల్ కార్లకుకు ఇది కొత్త సవాలే.
సీఎన్‌జీ వాహనాలు ఇలా..
గత ఏడాది ఇదే నెలలో 46 శాతంగా ఉన్న పెట్రోల్ వాటా ఇప్పుడు రికార్డు కనిష్ఠానికి చేరడం గమనార్హం. మరోవైపు సీఎన్‌జీ వాహనాలు ఏకంగా 21 శాతం నుంచి 25 శాతానికి ఎగబాకుతూ సరికొత్త రికార్డు నెలకొల్పాయి. మారుతీ సుజుకీ ఈ విభాగంలో 71 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉండగా, టాటా మోటార్స్, హ్యుందాయ్ వరుసగా 17, 9 శాతాలతో పోటీపడుతున్నాయి. జీఎస్‌టీ రేట్ల తగ్గింపుతో కొనుగోలు శక్తి పెరగడం, మొత్తం వాహన అమ్మకాలు 16 శాతం వృద్ధితో సుమారు 4.01 లక్షల యూనిట్లకు చేరడానికి కారణమైంది.
ఈవీలదే హవా
ఇక ఈవీల సంగతికొస్తే, ఏడాది కిందటితో పోలిస్తే అమ్మకాలు 52 శాతం దూసుకెళ్లి 30,700 యూనిట్లకు చేరాయి. దీంతో ఈవీల వ్యాప్తి 5.9 శాతం నుంచి 7.7 శాతానికి పెరిగింది. అయితే జులైలో నమోదైన 8.1 శాతం రికార్డు కంటే స్వల్పంగా తక్కువే. టాటా మోటార్స్ తన ఈవీ పోర్ట్‌ఫోలియోతో 43 శాతం వాటాతో దూసుకుపోగా, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ వాటా మాత్రం 28 శాతం నుంచి 15 శాతానికి పడిపోయింది.
ఇంధన ధరల మంటలు, ఈ20 ఇథనాల్ మిశ్రమంపై కొనుగోలుదారుల సంశయమే ఈ మార్పుకు కారణమైందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి కాలం మారింది, కారు రూపమూ మారింది అన్నట్టుగా, భారత రహదారులపై ఇక పెట్రోల్ కాకుండా ప్రత్యామ్నాయ ఇంధనాలదే భవిష్యత్తు అని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధరలు!


