మూలధన ఆస్తులు.. వాటి క్రయ విక్రయాలు.. వాటి వెనుక పన్నుభారం తెలుసుకోవాలంటే ఆషామాషీ కాదండోయ్. కొంచెం ఓపిక, శ్రద్ధ, గ్రహించగలిగే శక్తి కావాలి. పాత చట్టం .. కొత్త చట్టంగా మారినా .. ప్రాథమిక అంశాలు మారలేదు. సెక్షన్లు ప్రస్తావించకుండా సారాంశం తెలుసుకుందాం.
‘ఒక మూలధన ఆస్తి అమ్మినా, బదిలీ చేసినా ఏర్పడ్డ లాభాలు (చట్టంలో ప్రాఫిట్ / గెయిన్స్ అని ఆంగ్లంలో చెప్పారు) ఆదాయంగా భావించి ‘క్యాపిటల్ గెయిన్స్’ కింద వర్గీకరించి పన్ను విధిస్తారు. ఈ వాక్యం మర్రిచెట్టు విత్తనంలాగా చిన్నగా ఉంది. కానీ ఆ విత్తనం మొక్కగా మారి, శాఖోపశాఖలుగా విస్తరించి, చెట్టుగా మారడం ఎలా జరుగుతుందో ఈ వాక్యం వెనుక వందల సెక్షన్లు, రూల్స్, వివరణలు, జడ్జిమెంట్లు ఉన్నాయి. ఏది క్యాపిటల్ ఆస్తి? ఆస్తి కానిదేమిటి? బదిలీ అంటే ఏమిటి.. ఏది బదిలీ కాదు? ఎన్నో రకాల క్యాపిటల్ ఆస్తులు ఉన్నాయి. తెలుసుకోండి.
ఏది క్యాపిటల్ ఆస్తి?
ఒక అసెస్సీ చేతిలో ఉన్న ఆస్తి.. వ్యాపారానికి సంబంధించినదైనా.. సొంతానికి సంబంధించినదైనా
సెబీ రూల్స్ ప్రకారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఉన్న సెక్యూరిటీలు
సెబీ వారు పేర్కొన్న ఇన్వెస్టుమెంటు నిధుల్లో ఉన్న సెక్యూరిటీలు
షెడ్యూల్ ఐఐలో ఉన్న మినహాయింపులకు అర్హత లేని యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీలు
ఈ నాలుగూ క్యాపిటల్ ఆస్తులు. ఇలాగే ఉంటాయి, చట్టాల్లో నిర్వచనాలు. చెప్పదల్చుకున్నది చెప్పలేరు. వారు అనుకున్నది చెప్పడానికి చెప్పాలి కాబట్టి ఎన్నో మార్గాలు వెతుక్కుంటారు. నత్తనడక ముచ్చట్లు లేదా లిటిగేషన్ రాకుండా జాగ్రత్త పడటం.. లేదా ముక్కు ఎక్కడంటే తలచుట్టూ చేతిని తిప్పి చూపించినట్లుగా ఉంటుంది.
ఏది క్యాపిటల్ ఆస్తి కాదు?
పైన చెప్పి, అలా వదిలి పెట్టారా అంటే అలా చేయలేదు. పైవన్నీ క్యాపిటల్ ఆస్తులు. కాని వాటివీ జాబితా ఇచ్చారు. మినహాయింపులన్న మాట.
వ్యాపారంలో ఉంటే స్టాక్‌లు, స్టోర్స్, ముడిపదార్థాలు (కానీ, సెబీ పేర్కొన్న సెక్యూరిటీలు మినహా)
పర్సనల్ అసెట్స్, వ్యక్తిగత చరాస్తులు, దుస్తులు, ఇంటి ఫర్నిచర్, వంట పాత్రలు, వ్యక్తిగత వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు.
వీటి అమ్మకాల మీద పన్నుండదు. కానీ అశ్వత్థామ హతః కుంజరః లాగా నగలు, బంగారం, వెండి, ప్లాటినం ఆభరణాలు, రత్నాలు, మాణిక్యాలు, కెంపులు, పురాతన వస్తువులు, చిత్ర లేఖనాలు, డ్రాయింగ్‌లు, శిల్పాలు, ఏవైనా కళాఖండాలు.. ఇవన్నీ పర్సనల్ అసెట్స్ కావు. ఇవి అమ్మితే క్యాపిటల్ గెయిన్స్ ఉంటుంది.
వ్యవసాయ భూములు
గోల్డ్ డిపాజిట్ బాండ్లు (గవర్నమెంటు నోటిఫై) ఇంతవరకు అర్థం చేసుకుందాం. కానీ, కొసమెరుపులాగా, వ్యవసాయ భూముల విషయంలో వ్యవసాయమెంత కష్టమో.. అంత కష్టపడేలా వివరణ ఇచ్చారు. లేటెస్ట్ జనాభా లెక్కల ప్రకారం జనాభా సంఖ్య, మున్సిపాలిటీ సరిహద్దుల నుంచి వైమానిక దూరం ప్రాతిపదికల మీద ఆలోచించారు.
మున్సిపాలిటీలో జనాభా సంఖ్య 10,000 కన్నా తక్కువ ఉంటే, భూములన్నీ సాగు జరిగితే వ్యవసాయ భూమి.
జనాభా 10,000–1,00,000 ఉంటే వైమానిక దూరం 2 కి.మీ. దాటిన తర్వాత భూమినే వ్యవసాయ భూమి అంటారు.
జనాభా 1,00,000–10,00,000 ఉంటే ఈ దూరం 6 కి.మీ. 10,00,000 దాటితే 8 కి.మీ.
ఇదీ చదవండి: మీ వీధిలోనే ఉన్నారు ఫైనాన్స్ గురువులు
ఇవన్నీ సరిగ్గా అర్థం చేసుకుంటే సరి. ఇవే కాకుండా ఆ భూమి సాగు చేయాలి. వ్యవసాయ శిస్తు చెల్లిస్తుండాలి. ఆదాయాన్ని ఇన్‌కం ట్యాక్స్ లెక్కల్లో చూపించాలి.


