కొత్త ఇంటికి.. కార్పొరేట్లు | indian top corporate companies entry in real estate sector, sakshi special | Sakshi
Sakshi News home page

కొత్త ఇంటికి.. కార్పొరేట్లు

Sep 7 2026 5:23 AM | Updated on Sep 7 2026 5:23 AM

indian top corporate companies entry in real estate sector, sakshi special

హౌసింగ్‌ ఎకానమీలో వాటా కోసం అడుగులు

అంతకంతకూ పెరుగుతున్న బడా గ్రూపుల ప్రాజెక్టులు

డెవలప్‌మెంట్‌తో పాటు అనుబంధ రంగాల్లోకీ ప్రవేశం

ఇప్పటికే సిమెంట్, హౌసింగ్‌ ఫైనాన్స్‌లో ఆదిత్యబిర్లా

ఇటీవల పెయింట్స్‌లోకి... తాజాగా వైర్లు, కేబుల్స్‌లోకి

జేఎస్‌డబ్ల్యూ చేతిలోనూ స్టీల్‌. పెయింట్లు, డెవలప్‌మెంట్‌

ఫార్మా సంస్థలు అరబిందో, ఎంఎస్‌ఎన్‌తో పాటు ఇపుడు జువారీ

ఇప్పటికే బరిలో అదానీ, టాటా, ప్రెస్టీజ్, గోద్రెజ్, మహీంద్రా సహా పలు గ్రూపులు

భారీ మూలధనం, వేచిచూడగల సామర్థ్యం ఈ దిగ్గజాల సొంతం

కొనుగోలుదార్లకేమో బ్రాండ్, మెరుగైన వసతులు, పారదర్శక లావాదేవీలు

భవిష్యత్‌ విజేతలను గుర్తించడానికి ఇన్వెస్టర్లు చూడాల్సింది వాటి సామర్థ్యమే

భారీ ల్యాండ్‌బ్యాంకు లేకున్నా అనుకున్న సమయంలో పూర్తిచేయటమే ముఖ్యం

డెవలప్‌మెంట్‌ ఒక్కటే కాదు... అనుబంధ రంగాల్లోనూ సిసలైన విన్నర్లు

హౌసింగ్‌ ఎకానమీపై ‘సాక్షి’ వెల్త్‌ విశ్లేషణాత్మక కథనం  

ఫార్మా కంపెనీ ఎంఎస్‌ఎన్‌... హైదరాబాద్‌లో ప్రీమియం హౌసింగ్‌ను నిర్మిస్తోంది. కెమికల్స్‌ రంగంలోని జువారీ ఇండస్ట్రీస్‌ సైతం హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌లోకి అడుగు పెట్టింది. సిమెంట్‌ రంగంలోని జువారీ గ్రూప్‌ ఆటోమొబైల్స్‌ రంగంలోని హీరో, టీవీఎస్‌... ఢిల్లీ రెసిడెన్షియల్‌ హౌసింగ్‌ మార్కెట్లో వేగంగా అడుగులేస్తున్నాయి. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ అయితే తమ ‘జేఎస్‌డబ్ల్యూ ఒన్‌ హోమ్స్‌’తో పూర్తిగా టెక్‌ ఇళ్లను నిర్మిస్తామంటోంది. 

ఇక టెక్స్‌టైల్‌ రంగంలోని అర్వింద్‌తో పాటు రేమండ్, మ్యాక్స్, అదానీ, ఆదిత్య బిర్లా, మహీంద్రా, టాటా, గోద్రెజ్, ప్రెస్టీజ్, జువారీ వంటిగ్రూపులన్నీ రియల్‌ ఎస్టేట్లో తమ సత్తా చూపిస్తూనే ఉన్నాయి. అసలు రకరకాల ఇతర వ్యాపారాలు చేసే గ్రూపులన్నీ రియల్‌ ఎస్టేట్‌లోకి ఎందుకొస్తున్నాయి? నేరుగా నిర్మాణంలోకే కాకుండా హౌసింగ్‌తో ముడిపడ్డ పెయింట్స్, వైర్లు, కేబుళ్ల వంటి ఇతర రంగాలపైనా ఎందుకు దృష్టిపెట్టాయి? భారతీయ హౌసింగ్‌ మార్కెట్‌ ఏ రకంగా మారుతోంది? ఈ ‘హౌసింగ్‌ ఎకానమీ’లో లాభపడే కంపెనీలేంటి? భవిష్యత్‌ విజేతలను గుర్తించటం ఎలా? ఇన్వెస్టర్లు చూడాల్సిందేంటి? ఇదే ఈ వారం సాక్షి వెల్త్‌ ప్రత్యేక కథనం.. 


మీరు కోటి రూపాయల ఇంటిని బుక్‌ చేశారనుకోండి. ప్రధానంగా బయటకొచ్చేది ఆ రియల్టీ సంస్థ పేరే. కానీ మీరు ఆ ఇంట్లోకి వెళ్లకముందే... అదే ఇంటికోసం రకరకాల కంపెనీలు సిమెంట్, స్టీల్, పైపులు, వైరింగ్‌ స్విచ్‌లు, పెయింట్లు, టైల్స్, గమ్‌లు, శానిటరీవేర్, అద్దాలు, ఫ్యాన్లు, ఏసీలు, వంటింటి ఉపకరణాలు, ఫర్నిచర్, ఇన్సూరెన్స్‌ 
వంటివి విక్రయిస్తాయి. అంతేకాదు! ఇల్లంటే ఒకసారి కొనేస్తే అయిపోయేది కాదు. కొన్ని సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా నిర్వహణ కావాలి. ఇది... అత్యంత భారీ ఆర్థిక వ్యవస్థ. అందుకే.. గృహ యజమానుల ఖర్చుల్లో వాటా కోసం కార్పొరేట్‌ గ్రూప్‌ల పోటీ అంతకంతకూ పెరుగుతోంది. భారీ కార్పొరేట్‌ గ్రూప్‌లన్నీ ఈ హౌసింగ్‌ ఎకానమీలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. మరి పునాది నుంచి హ్యాండోవర్‌ వరకూ ప్రతి దశలోనూ లాభపడే కంపెనీలేంటి? వచ్చే రెండు దశాబ్దాల్లో విజేతలుగా నిలిచేదెవరు? 

కార్పొరేట్ల ఎంట్రీ ఎందుకంటే... 
రియల్‌ ఎస్టేట్‌ మంచి సంబంధాలు అవసరమైన స్థానిక వ్యాపారం. కానీ ఇపుడు నగరాల్లో ఇళ్లు అప్‌గ్రేడ్‌ అవుతున్నాయి. కొనుగోలుదార్లు తాము ఇళ్లు కొన్నాక తమను వదిలేకుండా మెరుగైన సౌకర్యాలందించే బ్రాండెడ్‌ ప్రాజెక్టుల్ని చూస్తున్నారు. పెద్దపెద్ద కార్పొరేట్‌ గ్రూపులు ఇందులోకి వస్తున్నది కూడా ఈ కారణంతోనే. పైపెచ్చు చిన్న చిన్న బిల్డర్ల మాదిరి కాకుండా వీళ్లకు మూలధనం ఎక్కువ. దీర్ఘకాలం ప్రాజెక్టు పూర్తయ్యేదాకా వేచిచూడగల సామర్థ్యమూ ఎక్కువే. వీటన్నిటితోపాటు డెవలపర్లు నిర్మాణ సామగ్రి, హోమ్‌ ఫైనాన్స్, ఇంటీరియర్లు, మెయింటెనెన్స్‌ వంటి మొత్తం నిర్మాణ వ్యవస్థలో భాగమవుతున్నారు. ఇది వారికి మరిన్ని అవకాశాలనిస్తోంది. 

ఫార్మా నుంచి ప్రీమియం రియల్టీకి... 
ఫార్మాలో రాణిస్తున్న అరబిందో, ఎంఎస్‌ఎన్‌ సంస్థలు ఆరో రియల్టీ, ఎంఎస్‌ఎన్‌ రియల్టీ ద్వారా ప్రీమియం రెసిడెన్షియల్, కమర్షియల్‌ ప్రాపర్టీ మార్కెట్లోకి ప్రవేశించాయి. ఆరో రియల్టీ ఇప్పటికే పలు ప్రాజెక్టుల్ని పూర్తిచేసి వివిధ ప్రాంతాల్లోకి భారీగా విస్తరించగా... ఎంఎస్‌ఎన్‌ సంస్థ నియోపోలిస్, తెల్లాపూర్, మంచిరేవుల, పటాన్‌చెరులో ప్రాజెక్టులు చేస్తోంది. ఫార్మాలో విజయవంతం కావటంతో ఈ సంస్థలకు మూలధనం కొరత లేదు. పైపెచ్చు స్థానిక విశ్వసనీయత తోడవుతుంది. అందుకే వీటికి రియల్టీ అనేది మరో గ్రోత్‌ ఇంజిన్‌గా మారుతోంది. కాకపోతే ఈ రియల్టీ విభాగాలు అన్‌లిస్టెడ్‌ కనక ఇన్వెస్టర్లు వీటి షేర్లు కొనటం కుదరదు. గోవాలో ప్రీమియం ప్రాజెక్టుతో రసాయనాల కంపెనీ జువారీ ఇండస్ట్రీస్‌ కూడా ఈ రంగంలోకి ఎంట్రీ ఇచి్చంది. హైదరాబాద్, కోల్‌కతాల్లో ప్రాజెక్టులు ఆరంభిస్తోంది. దీన్నిబట్టి చూసినపుడు రియల్టీలో భవిష్యత్‌ విజేతలకు భారీ ల్యాండ్‌ బ్యాంక్‌లు అక్కర్లేదు. అనుకున్న ప్రాజెక్టుల్ని వేగంగా పూర్తిచేసే నైపుణ్యం ఉంటే చాలు.  

కొత్తకోణం... ఆదిత్య బిర్లా 
ఆదిత్య బిర్లా గ్రూపు సంస్థ అ్రల్టాటెక్‌ తాజాగా వైర్లు, కేబుళ్ల రంగంలోకి ప్రవేశించింది. సిమెంట్‌ రంగంలో లీడర్‌గా ఉన్న అ్రల్టాటెక్‌తో పాటు పెయింట్ల కంపెనీ బిర్లా ఓపస్‌ కూడా ఈ గ్రూపుదే. ఇపుడు వైర్లు, కేబుళ్లలోకి ఎంట్రీ. అంటే... నిర్మాణంలో అవసరమైన సిమెంట్, చివర్లో అవసరమయ్యే పెయింట్లు, వాల్‌పుట్టీ, మధ్యలో అవసరమయ్యే వైర్లు కేబుళ్లు, కొనుగోలుకు అవసరమయ్యే ఫైనాన్స్‌. ఇవన్నీ ఇపుడు గ్రూపు వ్యాపారాల్లోకి చేరిపోయాయి. పైపె చ్చు సిమెంటు కోసం బలమైన డి్రస్టిబ్యూషన్‌ నెట్‌ వర్క్‌ ఉంది. అది మిగతా ఉత్పత్తులకూ పనికొస్తుంది. కాబట్టి పోటీ మామూలుగా ఉండదు. 

పాలీకేబ్‌... అదిరిపోయే కథ 
2020లో పాలీకేబ్‌ లిస్టయినపుడు దీన్ని కూడా మరో కేబుల్స్‌ కంపెనీగానే చూశారు ఇన్వెస్టర్లు. ఓ ఏడాదిపాటు రూ.600–700 రేంజిలో తిరిగిన ఈ షేరు... ఇటీవలే రూ.10 వేలు దాటింది. ఇపుడు రూ.8వేల పైనే ఉంది. అంటే ఐదేళ్లలో పది రెట్లు!!. నిజానికి 2020 తరువాత హౌసింగ్‌ బూమ్‌ మొదలైంది. ఇన్‌ఫ్రా బాగా పెరిగింది. డీలర్‌ నెట్‌వర్క్‌ బలోపేతం చేసుకుంటూ పరిశ్రమలకు అవసరమైన కేబుళ్లు కూడా అందిస్తూ పాలికేబ్‌ బాగా ఎదిగింది. పైపెచ్చు ఫ్యాన్లు, స్విచ్‌లు, లైట్లు, ఎలక్ట్రిక్‌ ఉపకరణాల తయారీలోకీ అడుగుపెట్టింది. లాభార్జనకు దీర్ఘకాలం అవసరమయ్యే ఈ రంగంలో గతేడాదే లాభం కళ్ల చూసింది. అందుకే ఇన్వెస్టర్లకు సంపద సృష్టించింది. దీంతో పాటు కీఇండస్ట్రీస్, ఆర్‌ఆర్‌ కాబెల్, హావెల్స్, ఫినోలెక్స్‌ కేబుల్స్‌ కూడా ఇన్వెస్టర్లకు మంచి లాభాలిచ్చాయి. అందుకే బలమైన నెట్‌వర్క్‌ను ఆసరా చేసుకుని ఆదిత్యబిర్లా గ్రూపు సవాలుకు దిగింది.  

మరమ్మతులను మరిచిపోవద్దు 
ఇంటిని కొనుగోలుదారు స్వా«దీనం చేసుకోవటంతోనే హౌసింగ్‌ స్టోరీ ముగిసిపోదు. గృహప్రవేశం చేసిన తరువాత ఆయా కుటుంబాలు గోడలు రిపేరు చేయించుకుంటాయి. కొందరు టైల్స్‌ను మారుస్తారు. ఏసీలు బిగిస్తారు. మాడ్యులర్‌ కిచెన్‌ పెడతారు. ఫ్యాన్లు అప్‌గ్రేడ్‌ చేయటమే కాదు... బాత్రూమ్‌లలో శానిటరీ వేర్‌ మారుస్తారు. సోలార్‌ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటారు. ఇది కొనసాగుతూనే ఉంటుంది. అందుకే మరమ్మతుల సైకిల్‌ చాలా పెద్దది. కాబట్టి ఇందులో ముడిపడి ఉన్న కంపెలన్నీ దీర్ఘకాలిక లబి్ధదారులే.

చూడాల్సిందేంటి? 
ఫార్మా గ్రూపులు, రసాయనాల కంపెనీలు, సిమెంటు కంపెనీల వంటివన్నీ హౌసింగ్‌ గొలుసులోకి ప్రవేశిస్తున్నాయంటే... మన హౌసింగ్‌ బూమ్‌ రియల్‌ ఎస్టేట్‌కే పరిమితం కావటం లేదని అర్థం. పాలికేబ్‌ లాంటి వెల్త్‌ క్రియేటర్లకు చాలా చోటుందని అర్థం. అందుకే ఇకపై ఒక కొత్త ప్రాజెక్టు వస్తోందంటే చూడాల్సింది దాన్నెవరు ఆరంభించారని మాత్రమే కాదు. ఎవరు ఫైనాన్స్‌ చేస్తున్నారు? సిమెంట్‌ ఎవరిది? వైరింగ్‌ ఎవరిది? పెయింట్లు ఎవరివి? ఫర్నిíÙంగ్‌ ఎవరిది? ఇవన్నీ చూడాలి. ఎందుకంటే ఇవే ‘రియల్‌’ ఎకానమీ విజేతలు మరి.  


ఇదీ... హౌసింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మ్యాప్‌ 
డెవలపర్లు 
ఇళ్లను విక్రయించేది వీరే కనక ఇది నేరుగా లబి్ధపొందే శ్రేణి. 
→ డీఎల్‌ఎఫ్‌  
→ గోద్రెజ్‌ ప్రాపరీ్టస్‌ 
→ ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌  
→ ఒబెరాయ్‌ రియల్టీ  
→ మాక్రోటెక్‌ డెవలపర్స్‌  
→ బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ 
→ శోభా డెవలపర్స్‌ 
గమనించాల్సిన అంశాలు: ఈ కంపెనీల కొత్త ప్రాజెక్టుల లాంచ్‌లు. ప్రీ–సేల్స్, క్యాష్‌ కలెక్షన్స్, రుణాలు, భూ సమీకరణ, విక్రయం కాకుండా మిగిలిపోయిన ఇళ్ల సంఖ్య, డెలివరీ వివరాలు.  

సిమెంట్, నిర్మాణ సామగ్రి 
నిర్మాణం సిమెంటు, స్టీలు, కాంక్రీట్‌తో మొదలవుతుంది. కాబట్టి తొలి లబి్ధదారులు ఈ కంపెనీలేనని చెప్పొచ్చు. లీడర్ల విషయానికొస్తే... 
→ అ్రల్టాటెక్‌ సిమెంట్‌  
→ అంబుజా సిమెంట్‌ 
→ శ్రీ సిమెంట్‌  
→ దాల్మియా భారత్‌ 
→ రామ్‌కో సిమెంట్స్‌  
→ జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌  
→ టాటా స్టీల్‌  
→ సెయిల్‌ 
→ జిందాల్‌ స్టీల్‌  
→ జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 
→ జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ 
గమనించాల్సిన అంశాలు: ప్రాంతీయ డిమాండ్, సిమెంటు ధరలు, రవాణా ఖర్చులు, సామర్థ్య విస్తరణ, ఇన్‌పుట్‌ వ్యయం పెరుగుదల.

పెయింట్లు, టైల్స్, శానిటరీవేర్‌ 
ఇంటిని స్వా«దీనం చేసుకునే సమయంలో విజేతలయ్యే కంపెనీలివి. ఈ దశలోనే కాంక్రీటు నిర్మాణమనేది నివాసయోగ్యమైన ఇల్లుగా మారుతుంది. గమనించాల్సిన కంపెనీలు... 
→ ఏసియన్‌ పెయింట్స్‌ 
→ బెర్జర్‌ పెయింట్స్‌ 
→ కాన్సాయ్‌ నెరోల్యాక్‌ 
→ ఇండిగో పెయింట్స్‌  
→ కజారియా సిరామిక్స్‌ 
→  సోమానీ సిరామిక్స్‌ 
→ సెరా శానిటరీవేర్‌ 
→ ఏజీఎల్‌ 
చిరకాలంగా ఆకర్షణీయంగా ఉన్న ఈ రంగంలోకి బలమైన నెట్‌వర్క్‌ ఆసరాతో బిర్లా ఓపస్‌ ద్వారా ఆదిత్యబిర్లా గ్రూపు... జేఎస్‌డబ్ల్యూ పెయింట్స్‌ ద్వారా జిందాల్‌ గ్రూపు ప్రవేశించటంతో పోటీ మరింత ఆసక్తికంగా మారింది.  

హౌసింగ్‌ ఫైనాన్స్‌ 
దీర్ఘకాల ప్లేయర్లు ఈ కంపెనీలు. ఎందుకంటే ఇల్లు ఒకసారి కొన్నా ఇంటి రుణం మాత్రం 15 నుంచి 25 ఏళ్లు కంటిన్యూ అవుతుంది. కాబట్టి అప్పటిదాకా ఈ కంపెనీలు లబ్ధి పొందుతూనే ఉంటాయి. డిసెంబరు 2024 నాటికి భారత హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల లోన్‌బుక్‌ ఏకంగా 38.3 లక్షల కోట్లు. 
→  ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 
→  పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 
→ కెన్‌ ఫిన్‌ హోమ్స్‌  
→  హోమ్‌ ఫస్ట ఫైనాన్స్‌ 
→  ఆవాస్‌ ఫైనాన్షియర్స్‌ 
→  పిరమల్‌ ఫైనాన్స్‌ 
→  ఆప్టస్‌ వాల్యూ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 
గమనించాల్సిన అంశాలు: ఈ కంపెనీలిచ్చే రుణం ఎంతమేరకు పెరుగుతోందనేది ప్రధానమైమే. కానీ అదొక్కటే సరిపోదు. ఇచి్చన రుణాల వసూళ్లెలా ఉన్నాయి? అంటే రుణ నాణ్యత ఎంత? దీనికవుతున్న ఖర్చెంత? అంటే కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ అన్నమాట. క్రెడిట్‌ లాస్‌ ఏ మేర ఉంది? ఇవన్నీ ప్రధానమే.  

వైర్లు, ఎలక్ట్రికల్స్, ఉపకరణాలు 
పూర్తయిన ఇంటికి వైర్లు, స్విచ్‌లు, లైటింగ్, ఫ్యాన్లు, ఉపకరణాలు కావాలి. ఆదాయం పెరుగుతున్న కొద్దీ హౌసింగ్‌ ఎలక్ట్రికల్స్‌లో ప్రీమియం ఉత్పత్తులు పెరుగుతున్నాయి.  డిమాండ్‌ఈ రంగంలో గమనించాల్సిన కంపెనీలను చూస్తే... 
→  పాలికేబ్‌  
→  కీ ఇండస్ట్రీస్‌ 
→  వీ–గార్డ్‌ 
→  ఆర్‌ఆర్‌ కబెల్‌ 
→  హావెల్స్‌ 
→  ఫినోలెక్స్‌ కేబుల్స్‌ 
→  క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ కన్సూమర్‌ 
ఎలక్ట్రికల్స్‌  
→  వోల్టాస్‌ 
→  బ్లూస్టార్‌

పైపులు, గమ్‌లు, వాటర్‌ప్రూఫింగ్‌ 
కనిపించని లబ్ధిదారులు ఈ కంపెనీలు. ఎందుకంటే వీ టి ఉత్పత్తులకు అందమైన హెడ్‌లైన్లుండవు. కానీ ప్రతి ఇంటికీ ఇవి తప్పనిసరి. గమనించాల్సిన కంపెనీలు... 
→ ఆస్ట్రల్‌  
→ సుప్రీం ఇండస్ట్రీస్‌ 
→ ప్రిన్స్‌ పైప్స్‌ 
→ పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌  
→  ఫినోలెక్స్‌ ఇండస్ట్రీస్‌  


రమణమూర్తి మంథా 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement