సెబీ ఎంత హెచ్చరించినా మారని ‘స్పెక్యులేషన్’
ఎఫ్ అండ్ ఓ అసలు ఉద్దేశం షేర్లకు హెడ్జింగ్‌లా వాడటానికే
కానీ... బెట్టింగ్ మాదిరి తలపడుతున్న యువ ట్రేడర్లు
ఎఫ్ అండ్ ఓలో గతేడాది నష్టపోయింది రూ.91,685 కోట్లు
మొత్తం ట్రేడర్లలో 87.7 శాతం మంది నష్టపోయిన వారే
ఇలా పోగొట్టుకున్నవారిలో 43 శాతం 30 ఏళ్లలోపు వారే
30 ఏళ్లలోపు వారిలో 90 శాతం మంది నష్టపోతున్నవారే
మెట్రో నగరాలను దాటి గ్రామాలకూ విస్తరిస్తున్న ట్రేడింగ్ ధోరణి
తొలిసారిగా 2026 ఆర్థిక సంవత్సరంలో తగ్గిన ట్రేడర్లు
ఏకంగా 98 లక్షల నుంచి 78 లక్షలకు పడిపోయిన ట్రేడర్లు
నష్టపోయిన వారు దూరమవుతున్నారంటున్న నిపుణులు
‘స్పెక్యులేషన్’ను నియంత్రించడానికి 2024లో సెబీ చర్యలు
దీంతో కొంతవరకూ తగ్గినా... పోగొట్టుకుంటున్న మొత్తం అంతే
క్వాలిటీ ట్రేడర్లను పెంచటమే ఇపుడు సెబీ ముందున్న సవాలు
స్మోకింగ్ కిల్స్... అని హెచ్చరించినా సిగరెట్లు తాగుతూనే ఉంటారు. మద్యపానం హానికరం అన్నా... తాగేవారు మానరు. స్టాక్ మార్కెట్ డే ట్రేడింగ్ కూడా అలాంటిదే. ప్రతి 10 మందిలో 9 మంది నష్టపోతున్నారనే సెబీ వార్నింగ్ డే ట్రేడర్లకు పట్టదు. ఎందుకంటే ఇదో వ్యసనం. గతేడాది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో జనం పోగొట్టుకున్నది ఏకంగా 91,685 కోట్లు. దీన్లో రూ.20వేల కోట్లు పన్నులు, ఎక్సే్ఛంజీల చార్జీలు, బ్రోకరేజీ సంస్థల ఫీజలుకు పోతే... మరో 72 వేల కోట్లు నికరంగా పోగొట్టుకున్నవి.
విచిత్రమేంటంటే చరిత్రలో తొలిసారిగా మన మార్కెట్లలో డే–ట్రేడర్ల సంఖ్య గతేడాది తగ్గిపోయింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 20 లక్షల మంది తగ్గిపోయారు. అంటే.. పోగొట్టుకున్నవారంతా మౌనంగా మార్కెట్ల నుంచి నిష్క్రమిస్తున్నారన్న మాట. మార్కెట్లలో ఎందరు నష్టపోతున్నారు? ఎందరు లాభపడుతున్నారు? అసలు ట్రేడింగ్ ధోరణి ఎలా ఉంది? ఏ వయసు వారు ట్రేడింగ్‌లోకి వస్తున్నారు? మూలధనం ఎంత పెడుతున్నారు? అసలు షేర్లు కొంటున్నారా? ట్రేడింగ్ మాత్రమే చేస్తున్నారా? అనే అంశాలపై ‘సెబీ’ రెండు అధ్యయనాల్ని విడుదల చేసింది. డే–ట్రేడర్లకు కనువిప్పు కలిగించే ఈ అధ్యయనాల సమాహారమే ఈ ‘సాక్షి వెల్త్’ స్టోరీ..
నెలకోసారి ఎక్స్‌పైరీ ఉండే ఆప్షన్లు వారానికోసారి ఎక్స్‌పైరీతో ఫ్రెష్‌గా ముస్తాబవుతున్నాయి. నిఫ్టీ, సెన్సెక్స్‌లే కాకుండా క్రూడ్ ఆయిల్, గోల్డ్, సిల్వర్‌లో సైతం ఆప్షన్లు జోరందుకున్నాయి. ఖాతాలో పదివేలున్నా సరే ట్రేడింగ్ చేయొచ్చునంటూ కొన్ని బ్రోకరేజీ సంస్థలు యువతను ఆకర్షిస్తున్నాయి. డీమ్యాట్ ఖాతాల్లో గనక షేర్లుంటే... డబ్బులు లేకపోయినా మార్జిన్‌తో ట్రేడింగ్ చేసుకోవచ్చని ఊరిస్తున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ వాల్యూమ్ విపరీతంగా పెరిగింది. కానీ ఫలితమైతే మారలేదు. నష్టాలు తప్పటంలేదు. డే ట్రేడింగ్ చేసిన ప్రతి 10 మందిలో 9 మంది నష్టపోతున్నారనే సత్యాన్ని సెబీ తాజా అధ్యయనం ద్వారా మరోసారి చెప్పింది. కాకపోతే కొన్నేళ్లుగా ప్రతి ఏటా విపరీతంగా పెరుగుతూ వచ్చిన ట్రేడర్ల సంఖ్య... గతేడాది మాత్రం తొలిసారిగా తగ్గింది. అదికూడా మామూలు తగ్గుదల కాదు. ఏకంగా 20 శాతం.
ఈ అధ్యయనం ప్రకారం...
→ 2026 ఆర్థిక సంవత్సరంలో 87.7% మంది ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్‌లో ఏకంగా రూ.72,000 కోట్లు పోగొట్టుకున్నారు. అదికూడా ఎక్సే్ఛంజీలకు, బ్రోకరేజీలకు చెల్లించిన ఛార్జీలు కాకుండా. ఈ ఛార్జీలు రూ.20వేల కోట్లు కలిపితే మొత్తంగా వీరు నష్టపోయింది రూ.92 వేల కోట్లు పైనే.
→ ఎక్సే్ఛంజీ చార్జీలు, బ్రోకరేజీలు కాకుండానే 2025లో పోగొట్టుకున్న రూ.1.11 లక్షల కోట్లతో పోలిస్తే ఇది తక్కువే. కాకపోతే ట్రేడర్ల సంఖ్య కూడా 98 లక్షల నుంచి 78 లక్షలకు పడిపోయింది.
→ సగటు ట్రేడరు పోగొట్టుకున్న మొత్తం మాత్రం రూ.1.13 లక్షల నుంచి రూ.1.16 లక్షలకు పెరిగింది.
→ గడిచిన ఐదేళ్లతో పోలిస్తే ట్రేడర్ల సంఖ్య తగ్గిపోవడమన్నది ఇదే తొలిసారి.
మార్కెట్లకు దూరమవుతున్నదెవరు?
తొలిసారి 20% మంది మార్కెట్లను వదిలేశాక.. మనం సమాధానం వెతకాల్సిన ప్రశ్న ఎందరు నష్టపోతున్నారన్నది కాదు. ఇంకా ఎవరు ట్రేడింగ్ చేస్తున్నారన్నది. సెబీ అధ్యయనంలో దీనిక్కొంత సమాధానం దొరికింది. అదేంటంటే ఇపుడు రిటైల్ ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్‌లో యువత సంఖ్యే ఎక్కువని. చిన్న ఇన్వెస్టర్లు, ఆర్థిక సంస్థలతో సంబంధంలేని మామూలు ట్రేడర్లు వీరికి తోడవుతున్నారు. ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ చేసే రిటైలర్లలో 43% మంది 30 ఏళ్ల లోపు వారే. వీరిలో 90% మంది గతేడాది నష్టపోయిన వారే. ఈ యువ ట్రేడర్లు వారి ఖాతాల్లోని షేర్లకన్నా 93 రెట్లు ఎక్కువ మొత్తాన్ని ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్‌లో పెడుతున్నారు. అంటే... రూ. 1,000 షేర్లలో ఉంటే 93 వేలు ఎఫ్ అండ్ ఓలో ట్రేడింగ్‌కు వాడుతున్నారన్న మాట. అంటే వీళ్లెవరూ తమ షేర్లలో రిస్క్ తగ్గించుకోవటానికి ఎఫ్ అండ్ ఓను ఉపయోగించుకోవట్లేదు. జస్ట్ దాన్నో బెట్టింగ్ సాధనంగా చూస్తున్నారు. అంతే! వాస్తవమేంటంటే ఓ ఇన్వెస్టరుకు తన ఖాతాలో రూ.లక్ష విలువైన షేర్లున్నాయనుకోండి. వాటిపై వచ్చే మార్జిన్‌తో కోట్ల రూపాయల ఎఫ్ అండ్‌ఓ ట్రేడింగ్ చేయగలడు. అది చాలా ఎక్కువ మొత్తం కనక నష్టం వస్తే ఈ లక్షలో రూపాయి కూడా మిగలకపోవచ్చు.
తక్కువ ట్రేడింగ్... ఎక్కువ లాభం
లాభాలు ఆర్జించిన వారి విషయంలోనూ అదే సూత్రం వర్తిస్తోంది. ఏడాదికి రూ.5 లక్షల లోపు ఆదాయాన్ని సంపాదిస్తున్న ట్రేడర్లు వారి ఖాతాల్లోని షేర్ల విలువకన్నా ఏకంగా 73 రెట్లు ఎక్కువ ఎఫ్ అండ్ ఓ టర్నోవర్ చేస్తున్నారన్నది సెబీ తేలి్చన వాస్తవం. కానీ ఏడాదికి రూ.కోటికన్నా ఎక్కువ సంపాదించేవారు మాత్రం తమ పోర్టుఫోలియోకన్నా 14 రెట్లు మాత్రమే అధికంగా ఎఫ్ అండ్ ఓ టర్నోవర్ చేస్తున్నారు. అంటే ఎక్కువ సంపాదించేవారు తక్కువ ట్రేడింగ్ చేస్తున్నారు. తక్కువ సంపాదించేవారు, నష్టపోతున్న వారు మాత్రమే అత్యధికంగా ట్రేడింగ్ చేస్తున్నారు.
ముగ్గురిలో ఒకరు.. అలాంటివారే!
కొంతమంది ట్రేడర్లకు ఇన్వెస్ట్‌మెంట్లతో ఏమాత్రం సంబంధం ఉండటం లేదు. వారి ఖాతాల్లో జీరో షేర్లున్నా సరే... ఎఫ్ అండ్ ఓ మాత్రం జోరుగా చేస్తున్నారు. ప్రతి ముగ్గురిలో ఒకరు ఇలా పూర్తి స్పెక్యులేషన్ ట్రేడింగ్‌నే చేస్తున్నారట. వాస్తవానికి ఎఫ్ అండ్ ఓ ట్రేడర్లలో 78 శాతం మంది తమ ఖాతాల్లో రూ.లక్ష కన్నా తక్కువ షేర్లున్నవారే. కానీ ట్రేడర్లు పోగొట్టుకుంటున్న మొత్తంలో 70 శాతం వీళ్లదే. అంటే.. వీళ్లు తమ షేర్లతో సంబంధం లేకుండా ఎఫ్ అండ్ ఓ చేస్తున్నారు. భారీగా పోగొట్టుకుంటున్నారు.
ఆప్షన్స్... అదే ఆకర్షణ
ఎఫ్ అండ్ ఓ అంటే... ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. కానీ ఫ్యూచర్స్‌లో ట్రేడ్ చెయ్యాలంటే భారీగా డబ్బులుండాలి. నష్టమైనా, లాభమైనా సమ పాళ్లలోనే ఉంటుంది. కానీ ఆప్షన్స్‌లో అలాకాదు. రూ.100, వెయ్యితో కూడా ఆప్షన్స్ చేయొచ్చు. అప్పటికప్పుడే వెయ్యి డబుల్ అయిపోవచ్చు. సున్నా కూడా అయిపోవచ్చు. ఇదే అసలైన ఆకర్షణ. ఈ ఆకర్షణ ఎంతలా పెరిగిందంటే... 2020లో ఎఫ్ అండ్ ఓలో రూ.100 టర్నోవర్ జరిగితే అందులో రూ.5 మాత్రమే ఆప్షన్స్‌ది. మిగతా మొత్తం ఫ్యూచర్స్‌దే. కానీ 2025 వచ్చేసరికి ఈ 5 ఏకంగా రూ.41కి చేరింది. నిజానికి ఆప్షన్ కొనటమంటే షేరు కొన్నట్లు కాదు. ఎందుకంటే షేర్లకు ఎక్స్‌పైరీ ఉండ దు. పడినా మళ్లీ కోలుకుంటాయి. కానీ ఆప్షన్లకు ఎక్స్‌పైరీ ఉంటుంది. ఎక్స్‌పైరీ గడు వు దగ్గరకొస్తున్నకొద్దీ ఆప్షన్ ప్రీమియం కరిగిపోతుంది. చివరికి సున్నా అయిపోతుంది.
అలాగని ఆప్షన్లు కొనటం మాత్రమే రిస్కనుకుంటే అదీ పొరపాటే. ఆప్షన్లు కొనేవారి కన్నా అమ్మే వారిలో నష్టపోయేవారు తక్కువే. కానీ వారి నష్టాలు మాత్రం బీభత్సం. అప్షన్లు కొనేవారి సగటు నష్టాలు రూ.4.6 లక్షలు ఉంటే... అమ్మేవారి సగటు నష్టాలు రూ.51.7 లక్షలు. దీన్నిబట్టే రిస్క్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
సెబీ ప్రయోగం ఫలించిందా?
నిజానికి ఎఫ్ అండ్ ఓ నిబంధనల్ని కఠినం చేయటాన్ని సెబీ 2024లోనే మొదలుపెట్టింది.
→ వీక్లీ ఆప్షన్ల సంఖ్యను తగ్గించింది. కొన్ని మాత్రమే అందుబాటులో ఉంటే ట్రేడింగ్‌ను నియంత్రించవచ్చనేది సెబీ వ్యూహం.
→ కాంట్రాక్టు సైజుల్ని పెంచింది. అంటే కొనటానికి అవసరమయ్యే మొత్తాన్ని బాగా పెంచింది. ఇలా చేయటం వల్ల లాభమైనా, నష్టమైనా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి చాలామంది దూరంగా ఉంటారన్నది సెబీ ఆలోచన.
→ ఆప్షన్ ప్రీమియంలను కొనటానికైనా, అమ్మటానికైనా కావలసిన మొత్తాన్ని పూర్తిగా ముందే చెల్లించటమనే నిబంధన తెచ్చింది.
→ పొజిషన్ల పరిమితుల్ని ఇంట్రాడేలో పర్యవేక్షించటం... ఎక్సే్ఛంజీలన్నింటినీ ఒక తాటిమీదికి తెస్తూ ఎక్స్‌పైరీ తేదీల్ని హేతుబద్ధం చేయటం వంటివి చేసింది.
కాకపోతే తాజా అధ్యయనాన్ని పరిశీలిస్తే కొన్ని కోణాల్లో సెబీ చర్యలు ఫలితాలనిచ్చాయి. రిటైలర్ల టర్నోవర్ తగ్గింది. వాళ్ల సంఖ్య తగ్గింది. నష్టాలు తగ్గాయి. కానీ దీనివల్ల.. నష్టపోయే ట్రేడర్లేమైనా తగ్గారా అంటే అలాంటిదేమీ జరగలేదు. నష్టపోయేవారి సంఖ్య అసాధారణంగానే ఉంది. పైపెచ్చు వారి నష్టాలు పెరిగాయి. కాబట్టి నాణ్యమైన ట్రేడర్లు పెరగటమన్నదే ఇపుడు సెబీ ముందున్న అతిపెద్ద సవాలు.
ఆ 23 శాతం మందే...
సెబీ వివరాల ప్రకారం... ట్రేడింగ్‌లో నష్టాల్లో 90 శాతం వరకూ కేవలం 23 శాతం మంది నుంచే వస్తున్నాయి. అంటే... మొత్తంగా 78 లక్షల మంది రూ.91వేల కోట్లు పోగొట్టుకుంటే... అందులో రూ.82 వేల కోట్లు పోగొట్టుకున్నది 18 లక్షల మందే. దీన్నిబట్టి కొందరు ఈ ట్రాప్‌లో ఇరుక్కుని అత్యధికంగా పోగొట్టుకుంటున్నారని అర్థమవుతుంది. వీళ్ల ధోరణిని విశ్లేషిస్తే బయటపడ్డ అంశాలు నివ్వెరపరిచేలా ఉన్నాయి. అవి...
→ వీళ్లు తమ ఆదాయానికి మించి అత్యధికంగా టర్నోవర్ నమోదు చేస్తున్నారు.
→ పదేపదే నష్టాలొచ్చినా డబ్బులు తెచ్చి పెడుతున్నారు.
→ ఎక్స్‌పైరీ డేనాడు అత్యధికంగా ట్రేడ్ చేస్తున్నారు.
→ వీరి టర్నోవర్‌కు–పోర్టుఫోలియోకు పొంతన లేదు.
→ పదేపదే ఆప్షన్లు కొనటం... లాట్ సైజు పెంచుకుంటూ పోయి పోగొట్టుకోవటం.
మెట్రోలకే పరిమితం కాదిప్పుడు...
మొబైల్ యాప్‌లు, టెక్నాలజీ షేర్ల ట్రేడింగ్‌ను సమూలంగా మార్చేశాయి. పలితం... ఈ ఎఫ్ అండ్ ఓ ఆకర్షణ ఇప్పుడు మెట్రో నగరాలకే పరిమితం కావటం లేదు. దేశంలో ప్రధానంగా గుర్తించిన 30 మెట్రో నగరాలను మినహాయిస్తే... వాటి వెలుపలున్న ప్రాంతంలోనే ట్రేడింగ్ ఎక్కువగా జరుగుతోంది. 2024 ఆర్థిక సంవత్సరంలోనే ఏకంగా 72 శాతం ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ మెట్రోలకు వెలుపల జరుగుతున్నట్లు వెల్లడయింది. అంటే నష్టపోతున్నవారిలో ఎక్కువ మంది టైర్–2, టైర్–3 పట్టణాలు, గ్రామాలకు చెందినవారన్న మాట. అది ఆందోళనకరమన్నది నిపుణుల మాట.
అసలు లాభపడ్డది ఎవరు?
సెబీ అధ్యయనం ప్రకారం చూస్తే రిటైల్ ట్రేడర్లు రూ.72వేల కోట్లు పోగొట్టుకుంటే... సంస్థాగత ఇన్వెస్టర్లు, సంస్థలు రూ.72వేల కోట్లు లాభాలను ఆర్జించాయి. ప్రొప్రయిటరీ ట్రేడర్లు అత్యధికంగా రూ.44వేల కోట్లు లాభపడగా, ఎఫ్‌పీఐలు రూ.14వేల కోట్లు, కార్పొరేట్లు రూ.8వేల కోట్లు, మ్యూచువల్ ఫండ్లు రూ.3వేల కోట్లు, ఎల్‌ఎల్‌పీ/పార్ట్‌నర్‌షిప్ సంస్థలు రూ.3వేల కోట్లు ఆర్జించాయి. ఇది రిటైలర్లు పోగొట్టుకున్న రూ.72వేల కోట్లకు సమానం. ఇక మిగిలిన మొత్తంలో ఎన్‌ఎస్‌ఈ రూ.11,366 కోట్లు, బీఎస్‌ఈ రూ.3,134 కోట్లు చార్జీల రూపంలో వసూలు చేశాయి. కొంత మొత్తం ప్రభుత్వానికి సెక్యూరిటీ లావాదేవీల పన్ను రూపంలో చేరింది. కొంత సెబీకి ఛార్జీల రూపంలో చేరగా... మిగిలింది బ్రోకరేజీ రూపంలో బ్రోకరేజీ సంస్థలకు దక్కింది. అయితే ఇదంతా ట్రేడర్లు పోగొట్టుకున్న లెక్క మాత్రమే. లాభాలను ఆర్జించినట్లు చెబుతున్న సంస్థలు కూడా బ్రోకరేజీ, కొంత ఎస్‌టీటీ, కొంత ఎక్సే్ఛంజీలకు చార్జీలుగా చెల్లిస్తాయి. అంటే ఈ ట్రేడింగ్ వ్యవస్థపై ఫీజులు, పన్నులు, బ్రోకరేజీల రూపంలో పోతున్నదే ఎక్కువ భాగమన్నమాట!
రమణమూర్తి మంథా


