రూ.2 లక్షల జీతం.. అయినా కష్టాలే! | Woman Says Rs 2 Lakh Monthly Salary Can Still Feel Like A Trap In Tier 1 Cities | Sakshi
Sakshi News home page

రూ.2 లక్షల జీతం.. అయినా కష్టాలే!

Aug 23 2026 9:17 PM | Updated on Aug 23 2026 9:20 PM

Woman Says Rs 2 Lakh Monthly Salary Can Still Feel Like A Trap In Tier 1 Cities

సాధారణంగా నెలకు రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల జీతం అంటే చాలామందికి మంచి ఆదాయమే. ఇలాంటి జీతం వస్తే హాయిగా జీవించొచ్చని అనుకుంటారు. కానీ.. పెద్ద నగరాల్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుందని ఓ మహిళ చెబుతోంది. నెలకు రూ.1-2 లక్షలు సంపాదిస్తున్నా.. ఖర్చులు పోగా చేతిలో పెద్దగా డబ్బు మిగలడం లేదని పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఏమిటీ 'శాలరీ ట్రాప్'
ఇన్‌స్టాగ్రామ్‌లో నిధి కుష్వాహా అనే మహిళ ఈ విషయంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. టైర్-1 నగరాల్లో నెలకు రూ.1-2 లక్షలు సంపాదించే వాళ్లు కూడా ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని వివరించారు.

ఆమె చెప్పిన లాజిక్ కూడా చాలామందికి కనెక్ట్ అవుతోంది. ఈ జీతం తక్కువ ఆదాయంతో జీవించే స్థాయి నుంచి బయటపడటానికి సరిపోతుంది. కానీ.. ఖరీదైన జీవనశైలిని ఎలాంటి ఆలోచన లేకుండా కొనసాగించడానికి మాత్రం సరిపోదు. అంటే.. జీతం బాగానే ఉంటుంది, కానీ నెలాఖరుకు బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే మాత్రం నిరాశే మిగులుతుంది.

పెద్ద నగరాల్లో ఖర్చులు
ఇక్కడ ప్రధాన సమస్య జీవన వ్యయం. టైర్-1 నగరాల్లో ఇంటి అద్దె ఒక్కటే జీతంలో పెద్ద భాగాన్ని తీసుకుపోతుంది. దానికి తోడు కరెంట్, ఇంటి ఖర్చులు, కారు లేదా బైక్ ఈఎంఐ, పెట్రోల్, పిల్లల స్కూల్ ఫీజులు, వైద్యం, బయట తినడం, షాపింగ్ ఇలా ఒక్కో ఖర్చు కలుస్తూ పోతుంది.

ఉదాహరణకు నెలకు రూ.1.5 లక్షలు జీతం వస్తే.. అందులో రూ.30-40 వేలు ఇంటి అద్దెకే వెళ్లొచ్చు. పిల్లలున్న కుటుంబాల్లో స్కూల్ ఫీజులు, వైద్య ఖర్చులు అదనంగా ఉంటాయి. కారు ఈఎంఐ లేదా హోమ్ లోన్ ఉంటే మరో పెద్ద మొత్తం అక్కడే పోతుంది. చివరికి పొదుపు చేయడానికి అనుకున్న డబ్బు చాలా తక్కువగా మిగలొచ్చు.

జీతం పెరిగితే ఖర్చులు కూడా
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం లైఫ్‌స్టైల్ ఇన్‌ఫ్లేషన్. జీతం పెరిగినప్పుడు మన అవసరాలు మాత్రమే కాదు.. మన కోరికలు కూడా పెరుగుతాయి.

మంచి జీతం రావడంతో ఖరీదైన ఇల్లు, కొత్త కారు, ఎక్కువ ట్రావెల్స్, రెస్టారెంట్లు, బ్రాండెడ్ వస్తువులు ఇలా ఖర్చులు పెరగొచ్చు. మొదట్లో ఇవన్నీ చిన్న ఖర్చుల్లానే అనిపిస్తాయి. కానీ నెలాఖరుకు చూస్తే మొత్తం పెద్దదైపోతుంది. అందుకే కొంతమందికి జీతం రూ.80 వేల నుంచి రూ.1.5 లక్షలకు పెరిగినా.. పొదుపు మాత్రం పెద్దగా పెరగదు.

ఇతరులతో పోల్చుకోవడం మరో సమస్య
సోషల్ మీడియా వల్ల ఈ సమస్య మరింత పెరుగుతోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మన చుట్టూ ఉన్నవాళ్లు కొత్త కారు కొంటున్నారు, విదేశాలకు వెళ్తున్నారు, ఖరీదైన రెస్టారెంట్లకు వెళ్తున్నారు అని చూసి మనం కూడా అదే స్థాయిలో జీవించాలనుకుంటాం. కానీ వాళ్ల ఆదాయం ఎంత?, వాళ్ల అప్పులు ఎంత?, వాళ్లు ఎంత పొదుపు చేస్తున్నారు?, అనేది మనకు తెలియదు. అయినా వాళ్ల జీవనశైలిని చూసి మన ఆర్థిక పరిస్థితికి సరిపోని ఖర్చులు చేస్తే సమస్యలు మొదలవుతాయి.

నెటిజన్ల స్పందన
నిధి కుష్వాహా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వచ్చాయి. కొందరు ఆమె చెప్పింది నిజమేనని అన్నారు. తమ స్నేహితులు కూడా ఇలాంటి ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని కొందరు చెప్పారు. అయితే.. మరికొందరు మాత్రం సమస్య జీతంలో కంటే మన ఖర్చు చేసే విధానంలో ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. మనకు నిజంగా ఏం అవసరమో తెలుసుకోకుండా ఇతరుల జీవనశైలిని అనుసరించడం ఆర్థికంగా ఇబ్బందులకు దారితీయొచ్చని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement