నాగపూర్‌లోని నరేంద్ర నగర్ పరిధిలో ఉన్న సుందర్‌బన్ ప్రాంతంలో దారుణ హత్య చోటుచేసుకుంది. రెండు వారాల క్రితమే బెయిల్‌పై బయటకు వచ్చిన రౌడీషీటర్ గౌరవ్ పంకజ్ రాగ్డే (27) హత్య స్థానికంగా కలకలం రేపింది. స్నేహితుడు, తోటి గ్యాంగ్‌స్టర్ గౌరవ్ రాంభావో రౌత్ చేతిలోనే అతను దారుణంగా హత్యకు గురయ్యాడు. ఒకమహిళతో వీరిద్దరికీ ఉన్న సన్నిహిత సంబంధిత వివాదమే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రకటించారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. మృతుడు గౌరవ్ రాగ్డే ప్రముఖ గ్యాంగస్టర్ గమ్‌ఛు హత్య కేసుతో పాటు పలు దోపిడీ, హత్య, హత్యాయత్నం కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. ఇతనిపై అజ్నీ పోలీస్ స్టేషన్‌లో దాదాపు 9 కేసులు నమోదు కాగా, ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయితే రాగ్డే జైలులో ఉన్న సమయంలో అతడి ప్రేమికురాలు 'రాణి' (పేరు మార్పు)తో గౌరవ్ రౌత్‌కు పరిచయం ఏర్పడి, అది సాన్నిహిత్యానికి దారితీసింది. నేర ప్రపంచానికి దూరంగా ఉండాలనుకున్న రాణి, రౌత్‌తో కలిసి నరేంద్ర నగర్‌లో క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని ప్రారంభించి, సమీపంలోనే ఒక అద్దె ఇంట్లో నివాసముంటోంది.
గురువారం మధ్యాహ్నం, రాణి గౌరవ్ రౌత్ ఇంటికి వెళ్లింది. అక్కడ రౌత్ ఇతర స్నేహితులు కూడా ఆమెతో కలిసి పార్టీ చేసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాగ్డే తీవ్ర ఆగ్రహంతో అక్కడికి చేరుకున్నాడు. తలుపులు మూసి ఉండటంతో మద్యం మత్తులో ఉన్న రాగ్డే, రాళ్లతో దాడి చేసి, ఇంట్లోని అద్దాలను ధ్వంసం చేస్తూ గొడవకు దిగాడు.
దీంతో రౌత్ తన అనుచరులతో కలిసి ఇంటి వెనుక తలుపు గుండా తప్పించుకునేందుకు యత్నించగా, రాగ్డే వారిని వెంటాడాడు. సుందర్‌బన్ నాలా వద్ద ఉన్న ఒక వంతెన సమీపంలో వీరి మధ్య తీవ్రమైన ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో రాగ్డే కిందపడిపోగా, రౌత్ తన అనుచరుడు అభిషేక్ వాస్నిక్‌తో కలిసి రాగ్డే చేతిలో ఉన్న కత్తిని లాక్కుని అతడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన రాగ్డే అక్కడికక్కడే కూలిపోగా, నిందితులు పరారయ్యారు.నిందితులైన రౌత్, వాస్నిక్ కూడా వేర్వేరు హత్య కేసుల్లో నిందితులుగా ఉన్నారు.
ఇదీ చదవండి: పెల్లెట్ గన్ వివాదం: సాహిల్‌తో కలిసి రాహుల్‌గాంధీ ధర్నా
సినిమా ఫక్కీలో పోలీసుల ఛేజింగ్
పెట్రోలింగ్‌లో ఉన్న అజ్నీ పోలీస్ స్టేషన్ సిబ్బంది మనీష్ భాల్మే, నరేష్ సావన్కర్ తక్షణమే స్పందించారు. కానిస్టేబుల్ మనీష్ భాల్మే సుమారు 1.5 కిలోమీటర్ల మేర ఛేజ్ చేసి నిందితుడు గౌరవ్ రౌత్‌ను పట్టుకున్నాడు. అతడి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: 14 ఏళ్లకే సోషల్ మీడియాలో సంచలనం ఎవరీ ‘ఏలియన్ స్టార్’
గొడవ అజ్నీ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రారంభమై, హత్య బెల్తరోడీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరగడంతో కేసును బెల్తరోడీ పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.


