రాజస్థాన్‌లోని చూరూ జిల్లా సుజాన్‌గఢ్ ప్రాంతానికి చెందిన చురియాన్ అనే చిన్న గ్రామానికి చెందిన 14 ఏళ్ల మోతీ (మోతీలాల్) అనే కుర్రాడు ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘ఏలియన్ స్టార్’ (Alien Star) పేరుతో సంచలనం సృష్టిస్తున్నాడు. స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15) సందర్భంగా పాఠశాలలో పిల్లలకు పంచే 'లడ్డూల' ప్రాముఖ్యతపై మోతీ చేసిన ఒక కామిక్ రీల్ రికార్డు స్థాయిలో 18.3 కోట్లకు (183 Million) పైగా వ్యూస్ సాధించింది. అంతేకాదు ఇంత చిన్న వయసులోనే అతనుసాధించిన పరిణతి, యాటిట్యూడ్, స్కిల్స్ చూసి అంతా మురిసిపోతున్నారు. అసలేంటీ ఏలియన్ స్టార్ కథ తెలుసుకుందాం.
2012 మార్చి 10న సాధారణ రైతు దంపతులు నెమరాం, మునిదేవిలకు దంపతులకు జన్మించారు మోతీ. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. మోతీలాల్ మేఘవాల్ జీవితం, ఆత్మవిశ్వాసానికి, విజయానికి అద్భుత నిదర్శనం. ఎందుకంటే తన విభిన్నమైన శారీరక రూపం, ముఖ కవళికల (కనుబొమ్మల మీద కొద్దిగా వెంట్రుకలు లేకుండా విచిత్రమైన అమరిక, కొంచెం ముందుకొచ్చిన పళ్లు,మూతి, చూడ్డానికి అవతార్ మూవీలోని క్యారెక్టర్‌లా) కారణంగా చిన్నప్పటి నుంచీ మోతీలాల్ ఎన్నో హేళనలు, ఎకసెక్కాలు ఎదుర్కొన్నాడు. తోటి పిల్లలు, చుట్టుపక్కల వారు అతనిని గేలి చేస్తూ ‘ఏలియన్’ అని పిలిచేవారు. ఆ మాటలు అతడిని మానసికంగా ఎంతో బాధపెట్టినప్పటికీ, మోతీ అధైర్యపడ లేదు.
తనలోని విలక్షణ లక్షణాలనే, బలంగా మలుచుకోవాలని నిర్ణయించుకున్నాడు. తనకెదురైన అవమాననాలనే ఒక్కో మెట్టుగా పేర్చుకున్నాడు. ఒకపుడు ఎగతాళి చేయడానికి వాడిన 'ఏలియన్' అనే పదాన్నే తన సోషల్ మీడియా ఐడెంటిటీగా మార్చుకుని, దాదాపు ఏడాది క్రితం, 'Alien Star'అనే పేరుతో కామెడీ రీల్స్, ఎక్స్‌ప్రెసివ్ డ్యాన్స్ వీడియోలు చేయడం ప్రారంభించాడు తనలోని నటన, అమాయకత్వంతో కూడిన హాస్యం (Desi Comedy), ఆకర్షణీయమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో రీల్స్ చేస్తూ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకున్నాడు.
>
ప్రతి వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్, లైక్స్ వర్షం కురిపిస్తోంది. దీంతో సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిపోయాడు. ఇన్‌స్టా, యూట్యూబ్‌లలో లక్షలాది మంది ఫాలోవర్లతో రాజస్థాన్‌లోనే అత్యంత ప్రజాదరణ పొందిన చైల్డ్ డిజిటల్ క్రియేటర్లలో ఒకరిగా నిలిచాడు. ఒక పెర్ల్ రీల్ 18.3 కోట్లకు పైగా వీక్షణలను సంపాదించడం విశేషం.
ఒకప్పుడు ఏ రూపం ఆధారంగా ఐతే సమాజం అతడిని ఎగతాళి చేసిందో, అదే రూపం , తనలోని ప్రతిభతో కోట్ల మంది అభిమానాన్ని గెలుచుకుని నిజమైన "స్టార్"గా మారాడు మోతీలాల్ మేఘవాల్.మరీ ముఖ్యంగా మోతీ చెప్పే "కొందరు నువ్వు ఏమీ చేయలేవు అంటారు, మరికొందరు చాలా ఎత్తుకు ఎదుగుతావు అంటారు.. మరి నేను ముందుకెళ్లనా?" అనే డైలాగ్ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది.

అంతేకాదు విదేశాల నుండి కూడా మోతీకి అభిమానులు ఏర్పడ్డారు. బడా బడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మోతీని ఇంటర్వ్యూ చేసేందుకు క్యూ కడుతున్నారు. చదువుతో పాటు నటన, కామెడీ, క్రికెట్ పట్ల ఆసక్తి ఉన్న మోతీ, భవిష్యత్తులో పూర్తిస్థాయి నటుడిగా స్థిరపడాలని కోరుకుంటున్నాడు. ఫాలోయర్ల ప్రేమ, మద్దతు తనకు కొండంత బలమని అదే తనన ముందుకు సాగడానికి తనను ప్రేరేపిస్తుందని భవిష్యత్తులో అదే విధంగా అలరించాలని కోరుకుంటున్నట్లు మోటి చెప్పారు.
ఇదీ చదవండి: ఇన్‌స్టామార్ట్‌లో బొద్దింక : ఎఫ్‌డీఏ తుకారాంకు హీరోయిన్ విజ్ఞప్తి
గ్రామస్తుల సంతోషం
మోతీకి లభించిన ప్రజాదరణతో చరియాన్ గ్రామం కూడా 'ఎలియన్ స్టార్ కి విలేజ్' గా పేరొందింది అంటూ కొలాసర్ రిటైర్డ్ నైబ్ సుబేదార్ రామ్ నివాస్ టెటార్వాల్ సంతోషం ప్రకటించారు.ఇది గ్రామానికి గర్వకారణం అని అన్నారు. గ్రామంలో చాలా మంది ప్రతిభ ఉందని, సరైన వేదికను పొందాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ఇదీ చదవండి: 14 ఏళ్ల ఐటీ జాబ్ వదిలి వ్యాపారం : ఇపుడు కోట్లలో ఆదాయం


