బిహార్‌లో స్వతంత్ర సేనాని సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో పాము కనిపించడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. జయనగర్ నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న 12561 నంబర్ రైలులోని ఏ2 ఏసీ 2-టైర్ కోచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎగువ బెర్త్‌కు పైన ఉన్న మూసివేసిన ప్యానెల్‌లోకి పాము జారుకుంటూ వెళ్లడాన్ని ఓ ప్రయాణికుడు గమనించాడు.
శనివారం సాయంత్రం సుమారు 5.30 గంటలకు జయనగర్ నుంచి రైలు బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అదే కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణిస్తున్న అరుణ్ ఠాకూర్ పాము ప్యానెల్‌లోకి జారుకుంటూ వెళ్తున్న దృశ్యాలను వీడియో తీశారు. ప్రయాణికులు వెంటనే కోచ్ అటెండెంట్, టికెట్ తనిఖీ అధికారి, రైల్వే కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇచ్చారు.
రైలు దర్భంగా చేరుకునే సమయానికి పాము ప్యానెల్‌లో కనిపించకుండా పోయింది. రైల్వే సిబ్బంది ప్యానెల్ తెరిచి గాలించినా దాని ఆచూకీ లభించలేదు. అనంతరం రైలు సమస్తిపూర్ మీదుగా ముజఫర్‌పూర్‌కు చేరుకుంది. రాత్రి సుమారు 9.38 గంటలకు ముజఫర్‌పూర్ జంక్షన్‌కు రైలు చేరుకున్న తర్వాత రైల్వే రెస్క్యూ బృందాలు, క్యారేజ్ అండ్ వాగన్ విభాగం సిబ్బంది కోచ్‌లోకి వెళ్లి దాదాపు గంటపాటు తనిఖీలు చేశారు. అయినా పాము కనిపించలేదు.
ప్రయాణికుల భద్రత దృష్ట్యా అనుమానిత కోచ్‌ను ముజఫర్‌పూర్‌లోనే రైలుకు తొలగించి, దాని స్థానంలో మరో కోచ్‌ను ఏర్పాటు చేసినట్లు ఈస్ట్ సెంట్రల్ రైల్వే ప్రధాన ప్రజా సంబంధాల అధికారి సరస్వతి చంద్ర తెలిపారు. సీటు నంబర్ 34 సమీపంలోని ప్యానెల్‌లను సిబ్బంది పరిశీలించినా పాము కనిపించలేదని ఆమె వెల్లడించారు. కొత్త కోచ్‌లోకి ప్రయాణికులను సురక్షితంగా తరలించినట్లు తెలిపారు.


