టోల్‌ ప్లాజాల వద్ద గోశాలలు నిర్మించండి | Supreme Court tells NHAI to explore setting up cow shelters at plazas | Sakshi
Sakshi News home page

టోల్‌ ప్లాజాల వద్ద గోశాలలు నిర్మించండి

Nov 19 2026 6:17 AM | Updated on Nov 19 2026 6:17 AM

Supreme Court tells NHAI to explore setting up cow shelters at plazas

జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు సుప్రీంకోర్టు సూచన

ఎన్‌హెచ్‌ఏఐ సీఎస్‌ఆర్‌ కింద నిధులను కేటాయించాలని ఆదేశం 

రోడ్లపై మూగజీవాల సంచారంతో అమాయకుల ప్రాణాలు పోతున్నాయని ఆవేదన

ప్రాజెక్టు వ్యయం పూర్తయినా టోల్‌ వసూళ్లపై న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి

వీధి కుక్కల నియంత్రణపైనా రాష్ట్రాల పనితీరు పట్ల సమీక్ష  

సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ రహదారులపై మూగజీవాల సంచారం కారణంగా నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడం, అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతుండడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ప్రమాదాలను నివారించేందుకు టోల్‌ ప్లాజాల సమీపంలో పశువుల కోసం ప్రత్యేక షెల్టర్లు(గోశాలలు) నిర్మించాలని భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ)కు సూచించింది. 

ఇందుకు అవసరమైన నిధులను కార్పొరేట్‌ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్‌) కింద విరాళంగా అందించాలని స్పష్టం చేసింది. రహదారులపై మూగజీవాల నియంత్రణకు సమగ్ర యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని మే 19న ఇచ్చిన తీర్పుపై స్పష్టత కోరుతూ ఎన్‌హెచ్‌ఏఐ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ సందీప్‌ మెహతా, జస్టిస్‌ ఎన్‌వీ అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది.  

చట్టపరమైన పరిమితులు ఉన్నాయి: ఎన్‌హెచ్‌ఏఐ
కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. రహదారులపై పశువుల సంచారం ప్రమాదకరమన్న కోర్టు ఆందోళనతో ఏకీభవించారు. అయితే, షెల్టర్ల నిర్మాణంలో ఆచరణాత్మక ఇబ్బందులు ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఎన్‌హెచ్‌ఏఐ కేవలం రోడ్ల నిర్మాణ బాధ్యతలు మాత్రమే చూస్తోందని, నేరుగా భూసేకరణ చేపట్టదని వివరించారు.

 1988 నాటి ఎన్‌హెచ్‌ఏఐ చట్టం, 2002 నాటి జాతీయ రహదారుల(భూమి, ట్రాఫిక్‌ నియంత్రణ) చట్టం ప్రకారం సంస్థ పరిధి కేవలం రహదారుల అభివృద్ధి, నిర్వహణకే పరిమితమని పేర్కొన్నారు. జాతీయ రహదారుల పొడవునా పశు వులకు షెల్టర్లు నిర్మించాలంటే కనీసం రూ.5,000 కోట్లకు పైగా వ్యయం అవుతుందని అభిప్రాయపడ్డారు. 

మొత్తం ఖర్చు మీరే భరించమనలేదు కదా! 
ఎన్‌హెచ్‌ఏఐ వాదనలపై త్రిసభ్య ధర్మాసనం స్పందించింది. గోశాలల నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చును ఎన్‌హెచ్‌ఏఐ భరించాలని తాము ఆదేశించలేదని జస్టిస్‌ సందీప్‌ మెహతా స్పష్టం చేశారు. సీఎస్‌ఆర్‌ నిధుల నుంచి కొంతమేర విరాళంగా అందించాలని మాత్రమే సూచించామన్నారు. ఇదే సమయంలో టోల్‌ వసూళ్లపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రహదారుల నిర్మాణ వ్యయం వసూలైన తర్వాత కూడా చాలాచోట్ల టోల్‌ ప్లాజాలు కొనసాగుతూనే ఉన్నాయని గుర్తుచేసింది. 

ప్రాజెక్టు ఖర్చు రికవరీ అయ్యాక ప్రయాణికుల నుంచి టోల్‌ వసూలు చేయడం చట్టవిరుద్ధమేనని వ్యాఖ్యానించింది. దీనిపై అమికస్‌ క్యూరీ, సీనియర్‌ న్యాయవాది గౌరవ్‌ అగర్వాల్‌తో చర్చించి చట్టపరమైన, ఆచరణాత్మక పరిష్కారాన్ని కనుగొనేందుకు కొంత సమయం కావాలని సొలిసిటర్‌ జనరల్‌ కోరారు. ఇందుకు అంగీకరించిన కోర్టు, తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది.

శునకాల నియంత్రణ ఇలాగేనా? 
వీధి కుక్కల నియంత్రణకు సంబంధించిన కేసులో పాత ఆదేశాల అమలు తీరును సైతం ధర్మాసనం సమీక్షించింది. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు 19 రాష్ట్రాలు సమ్మతి నివేదికలు సమర్పించాయని అమికస్‌ క్యూరీ కోర్టుకు తెలిపారు. బిహార్, అస్సాం రాష్ట్రాలు పనితీరును మరింత మెరుగు పరుచుకో వాల్సి ఉందని, ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమాత్రం సరిపోవని వివరించారు. రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలు అదనపు గణాంకాలతో కూడిన అఫిడవిట్లను సమర్పించినట్లు కోర్టుకు తెలిపారు. శునకాలు గుజరాత్, ఢిల్లీ హైకోర్టుల ఆవరణల్లో ఇంకా స్వేచ్ఛగా సంచరిస్తుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement