ఇందుకోసం నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలి
‘మాదక ద్రవ్య రహిత భారత్’ను సాధించాలి
నక్సలిజం మళ్లీ పుట్టకుండా చర్యలు తీసుకోవాలి
మంత్రివర్గ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: మాదక ద్రవ్యాల ముప్పు నుంచి మన దేశానికి విముక్తి కల్పించడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం దేశమంతటా ప్రచార కార్యక్రమాలు వేగవంతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించారు. నక్సలిజం ఇకపై ఏ రూపంలోనూ తిరిగి ఉనికిలోకి రాకుండా నిరోధించాలని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఉదయం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది.
మోదీ ఫిలిప్పైన్స్‌లో ఆసియాన్ శిఖరాగ్ర సదస్సును ముగించుకొని తిరిగి వచ్చిన వెంటనే ఈ భేటీ నిర్వహించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్ తదితరులు పాల్గొన్నారు. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన 11 మంది కార్యదర్శులు ఈ సందర్భంగా ప్రజెంటేషన్లు ఇచ్చారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 50 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడం, నక్సలిజం నిర్మూలన అనే రెండు కీలక అంశాలపై మంత్రివర్గ సమావేశంలో సమగ్రంగా చర్చించారు. ‘మాదక ద్రవ్య రహిత భారత్’ను సాధించేందుకు చర్యలను వేగవంతం చేయాలని మోదీ పేర్కొన్నారు.
మాదక ద్రవ్యాల సమస్యల గురించి మాట్లాడుతూ మోదీ భావోద్వేగానికి గురయ్యారని, డ్రగ్స్ భూతం దేశంలోని కొన్ని ప్రాంతాలను తీవ్రంగా ప్రభావితం చేసిందని అన్నారని తెలిసింది. పేదరికాన్ని చాలావరకు నిర్మూలించగలిగామని, డ్రగ్స్ ముప్పును సైతం కచ్చితంగా అంతం చేయగలమని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. పంజాబ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో డ్రగ్స్‌పై మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పంజాబ్‌లో డ్రగ్స్ ముప్పు అధికంగా ఉన్న సంగతి తెలిసిందే. పేదరికంపై విజయం సాధించామని, ఈ ఘనత మంత్రులు, అధికారులు, క్షేత్రస్థాయి కార్యకర్తలతో సహా ప్రతిఒక్కరికీ దక్కుతుందని మంత్రివర్గ భేటీలో మోదీ ప్రశంసించినట్లు తెలిసింది.
కీలక బిల్లులు గట్టెక్కాల్సిందే..
త్వరలో జరుగబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలతోపాటు శీతాకాల కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ సమావేశాల్లో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లులను ప్రవేశపెట్టి, ఆమోదించడానికి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీ తర్వాత మూడు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు, 30వ తేదీ లేదా డిసెంబర్ మొదటి వారం నుంచి శీతాకాల సమావేశాలు నిర్వహించే ప్రతిపాదనపై కేబినెట్ భేటీలో చర్చించారు. కీలక బిల్లులను ప్రవేశపెట్టే అంశం, పార్లమెంట్ సమావేశాల ఎజెండా గురించి మంత్రుల అభిప్రాయాలను ప్రధాని తెలుసుకున్నారు. ఒకటి కంటే ఎక్కువ శాఖల బాధ్యతలు నిర్వర్తిస్తున్న 12 మంది కేబినెట్ మంత్రుల పనిభారాన్ని తగ్గించేందుకు త్వరలో మంత్రివర్గ విస్తరణ లేదా శాఖల మార్పులు చేసే అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది.
గత నిర్ణయాలు, శాఖల పనితీరుపై సమీక్ష
గత సమావేశాలు, చింతన్ శిబిర్‌లో ఆయా మంత్రిత్వ శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలు, తీసుకున్న నిర్ణయాల పురోగతిని ప్రధాని మోదీ ఈ సమావేశంలో సమీక్షించారు. ప్రతి మంత్రిత్వ శాఖ సాధించిన ప్రగతిపై నివేదికలను పరిశీలించారు. ‘వికసిత్ భారత్–2047’లక్ష్యాన్ని చేరుకోవడానికి వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయంతోపాటు స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికల అమలు తీరుపై విస్తృతంగా చర్చించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్ర స్థాయిలో లబ్ధిదారులందరికీ సత్వరమే వంద శాతం చేరేలా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.


