సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2026 టోర్నీలో పెను సంచలనం నమోదైంది. ఇండోర్ వేదికగా జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో స్టార్ ఆటగాళ్లతో కూడిన ఢిల్లీ జట్టును 2 వికెట్ల తేడాతో బిహార్ చిత్తు చేసింది. ఢిల్లీ నిర్దేశించిన 225 పరుగుల భారీ లక్ష్యాన్ని బిహార్ 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
లక్ష్య ఛేదనలో ఓపెనర్ ఆయుష్ లోహరుకా (22 బంతుల్లో 50) అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత వన్‌డౌన్ బ్యాటర్ బిపిన్ సౌరభ్ (19 బంతుల్లో 49) కూడా దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ ధాటిగా ఆడటంతో బిహార్ 7.3 ఓవర్లలోనే 2 వికెట్లకు 117 పరుగులు చేసి పటిష్ఠ స్థితిలో నిలిచింది.
అయితే ఆ తర్వాత ఢిల్లీ బౌలర్లు పుంజుకుని వరుస క్రమంలో వికెట్లు తీయడంతో బిహార్ 16.3 ఓవర్లలో 189 పరుగులకు 8 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. ఈ సమయంలో మయాంక్ కుమార్ (13 బంతుల్లో 24 నాటౌట్), ప్రశాంత్ సింగ్ (8 బంతుల్లో 13 నాటౌట్) అద్భుత పోరాట పటిమ కనబరిచి జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించారు.
యశ్ ధుల్ మెరుపులు వృథా
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. కెప్టెన్ ప్రియాంష్ ఆర్య, సీనియర్ బ్యాటర్ నితీశ్ రాణా విఫలమైనప్పటికీ.. యువ ఆటగాడు యశ్ ధుల్ మాత్రం మెరుపు సెంచరీతో విరుచుకుపడ్డాడు.
ధుల్ కేవలం 59 బంతుల్లోనే 16 ఫోర్లు, 7 సిక్సర్లతో 125 పరుగులు చేశాడు. అతడితో పాటు వికెట్ కీపర్ తేజస్వి దహియా (25 బంతుల్లో 51; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. కాగా ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో బిహార్ జట్టుకు భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీ కోసం వైభవ్ దోహాకు వెళ్లడంతో ప్రస్తుతం బిహార్ జట్టును సూరజ్ కశ్యప్ నడిపిస్తున్నాడు.


