కేకేఆర్‌లో భారీ వాటా విక్రయం..? | Jay Mehta to sell 22.5 percent stake in KKR to US firm for 400m dollars | Sakshi
Sakshi News home page

కేకేఆర్‌లో భారీ వాటా విక్రయం..?

Nov 18 2026 12:40 PM | Updated on Nov 18 2026 12:45 PM

Jay Mehta to sell 22.5 percent stake in KKR to US firm for 400m dollars

source: IPL X

ఐపీఎల్‌ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (KKR) యాజమాన్యంలో కీలక మార్పు చోటుచేసుకోనుంది. జట్టులో సహ యజమానిగా ఉన్న జే మెహతా తన వాటాలో సగం విక్రయించేందుకు సిద్ధమయ్యారు. అమెరికాకు చెందిన పెట్టుబడుల నిర్వహణ సంస్థ ఏరెస్‌ మేనేజ్‌మెంట్‌ (Ares Management)కు కేకేఆర్‌లో 22.5 శాతం వాటాను విక్రయించనున్నట్లు తెలుస్తోంది.

ఈ లావాదేవీ విలువ సుమారు 400 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.3,700 కోట్లు)గా ఉండవచ్చని అంచనా. ఈ ఒప్పందం పూర్తయితే కేకేఆర్‌ మొత్తం విలువ 1.78 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.16,634 కోట్లు)గా లెక్కించబడుతుంది. ఈ ఒప్పందం తుది దశకు చేరుకున్నట్లు సమాచారం.

కేకేఆర్‌లో వాటాల వివరాలు
ప్రస్తుతం జే మెహతా వద్ద కేకేఆర్‌లో 45 శాతం వాటా ఉంది. ఇందులో సగం అంటే 22.5 శాతం వాటాను ఏరెస్‌ మేనేజ్‌మెంట్‌కు విక్రయించనున్నారు. బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ ఖాన్‌ వద్ద 55 శాతం మెజారిటీ వాటా ఉంది. జే మెహతా భార్య, నటి జూహీ చావ్లా కూడా ఈ ఫ్రాంచైజీ సహ యజమానిగా ఉన్నారు.

2007లో బీసీసీఐ తొలి ఎనిమిది ఐపీఎల్‌ ఫ్రాంచైజీలను విక్రయించినప్పుడు షారుఖ్‌ ఖాన్‌, జూహీ చావ్లా, జే మెహతా కలిసి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టును కొనుగోలు చేశారు. ఇందుకోసం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ స్పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థను ఏర్పాటు చేశారు.

బీసీసీఐ అనుమతి తప్పనిసరి
జే మెహతా, ఏరెస్‌ మేనేజ్‌మెంట్‌ మధ్య ఈ ఒప్పందం నగదు రూపంలో జరగనున్నట్లు సమాచారం. అయితే వాటాల విక్రయానికి బీసీసీఐ అధికారిక అనుమతి తప్పనిసరి. కొత్త పెట్టుబడిదారుపై బోర్డు తగిన పరిశీలన చేపట్టాల్సి ఉంటుంది.

ఈ లావాదేవీ విలువలో ఐదు శాతం మొత్తాన్ని బీసీసీఐకి చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఈ ఒప్పందం ద్వారా బోర్డుకు సుమారు 20 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.200 కోట్లు) ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

ఐపీఎల్‌పై అమెరికా పెట్టుబడిదారుల ఆసక్తి
ఐపీఎల్‌ ఫ్రాంచైజీలపై అమెరికా పెట్టుబడిదారుల ఆసక్తి పెరుగుతోంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు యాజమాన్యంలో బ్లాక్‌స్టోన్‌, బోల్ట్‌ వెంచర్స్‌ వంటి అమెరికా సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. మరోవైపు ఏరెస్‌ మేనేజ్‌మెంట్‌కు అంతర్జాతీయ క్రీడారంగంలోనూ పెట్టుబడుల అనుభవం ఉంది. 

ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌ క్లబ్‌ చెల్సీ, ఎన్‌ఎఫ్‌ఎల్‌ జట్టు మయామి డాల్ఫిన్స్‌తో సంబంధం ఉన్న పెట్టుబడులు కూడా ఆ సంస్థకు ఉన్నాయి. క్రికెట్‌లో ఇప్పటికే ది హండ్రెడ్‌ టోర్నీలోని ట్రెంట్‌ రాకెట్స్‌ జట్టులో సహ యాజమాన్య వాటా కలిగి ఉంది.

ఇదీ చదవండి: ఐపీఎల్‌ 2027కు సంబంధించి కీలక అప్‌డేట్‌.. బీసీసీఐ అధికారిక ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement