కొండ కోనల్లో కురిసే కుండపోత వర్షాలు వాగులు, వంకలై అరణ్యాలను దాటుకుని ఒకదానినొకటి పెనవేసుకుంటూ... వందల కిలోమీటర్లు కడచి నదులై జనారణ్యాల్లోకి ప్రవహిస్తాయి. కానీ ఆ జలరాశిపై మన నిర్లక్షం అవధులు దాటుతోంది. ఉత్తరాది ప్రజలు పవిత్రంగా నిర్వహించే ఛఠ్ పూజల సందర్భంగా సోమవారం ఢిల్లీలోని కాళిందీ కుంజ్ వద్ద యమునా నదీతీరాన కనబడిన దృశ్యాలు దేశ ప్రజల్ని దిగ్భ్రాంతిలో పడేశాయి.
సంప్రదాయబద్ధంగా నడుములోతు నీటిలో నిలబడి సూర్యదేవుడికి అర్ఘ్యం ఇచ్చి అభ్యంగనం చేయడానికొచ్చిన వేలాదిమంది మహిళలకు విషపూరిత నురుగతో నిండిన నదీ జలాలే దిక్కవటం ఎంతో ఆందోళనకరం. గత నెలాఖరున సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్రాలూ, కేంద్రపాలిత ప్రాంతాలతోపాటు, ఆ నది పొడవునా ఉండే జిల్లాల అధికార యంత్రాంగాలను తీవ్రంగా మందలించింది.
ఈ నదీ కాలుష్యానికి జవాబుదారీతనాన్ని నిర్ణయించి భారీగా జరిమానాలు వసూలుచేసి, సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో జమ చేయాలనీ ఆదేశించింది. జరిమానా లెక్కగట్టడానికి అవసరమైన ఫార్ములా రూపొందించే బాధ్యతను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ)కి అప్పగించింది. దీనికి సంబంధించిన సవివరమైన ఆదేశాలు ఛఠ్ పూజరోజున వెలువడ్డాయి.
నిజానికిది ఇప్పుడే తలెత్తిన సమస్య కాదు. ప్రతియేటా ఛఠ్ పండుగ సమీపించే నాటికి యమునా నది ఇదే రూపంలో దర్శనమిస్తోంది. విపక్షంలో ఉన్న పార్టీలు తాము అధికారంలోకి రాగానే ఈ కాలుష్యాన్ని అంతం చేస్తామని హామీ ఇస్తాయి. అధికార పక్షమేమో ఇంత చేశాం, అంత చేశామంటూ లెక్కలు తీస్తుంది. అంతక్రితంతో పోలిస్తే మెరుగుపడిందని ఏకరువు పెడుతుంది. సారాంశం మాత్రం యమునా నదీజలాలు విషపూరితం కావటం.
యమునా నదిలో కలుస్తున్న కాలుష్యం ఒక రకం కాదు, ఒక విధం కాదు. పరిశ్రమలు విడిచిపెట్టే వ్యర్థజలాలన్నీ దాన్లోనే కలుస్తాయి. మానవ వ్యర్థాలకూ గమ్యం ఆ నదే. ఈసారి యమునలో మల సంబంధిత బ్యాక్టీరియా పరిమితికి మించి ఏడు నుంచి ఎనిమిది రెట్లు అధికంగా నమోదైందని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ తెలిపింది. మొత్తం 520 మురుగుకాల్వలు దానిలో కలుస్తున్నాయి. ఒక అంచనా ప్రకారం ఢిల్లీలోకి ప్రవేశించేముందు వజీరాబాద్–ఓఖ్లాల మధ్యగల 22 కిలోమీటర్ల పొడవునా ఈ కాలుష్యం బెడద తీవ్రంగా ఉంది. నిజానికి నదీమార్గంలో ఈ నిడివి కేవలం 2 శాతం మాత్రమే. కానీ మొత్తం కాలుష్యంలో పెద్ద వాటా ఆ ప్రాంతానిదే.
ఢిల్లీ మాస్టర్ ప్లాన్–2047 ప్రకారం ఆ మహానగరం ‘ఓ’ జోన్‌లోకి వస్తుంది. అంటే అది ఎంతో జాగ్రత్తగా పరిరక్షించాల్సిన గ్రీన్ జోన్ అన్నమాట. ఆ ప్రణాళిక సాకారం కావటానికి మరో ఇరవైయ్యేళ్లుంది గనుక ఇప్పుడిప్పుడే దాని ప్రక్షాళనకు తొందర పడాల్సిన అవసరంలేదని పాలకులనుకుంటున్నారేమో! సమస్యేమంటే, యమున ఇలా కాలుష్యపూరితమైన తర్వాత కొన్ని కిలోమీటర్లు పయనించి గంగానదిలో సంగమిస్తుంది. పర్యవసానంగా ఆ నది కూడా నాశనమవుతోంది.
ఆమధ్య శ్రీమఠ్‌కు చెందిన స్వామీజీ కరౌలీ శంకర్ మహదేవ్ చొరవతో 15,000మంది భక్తులు, 32 స్వచ్ఛంద సంస్థలకు చెందిన వందలాదిమంది వాలంటీర్లు ఏకమై గంగానదిలో ఉన్న వ్యర్థాల్ని తొలగించ టానికి 18 రోజలు శ్రమించారు. ఏకంగా 150 టన్నుల వ్యర్థాల్ని ట్రక్కుల్లోకెక్కించారు. ఈ వ్యర్థాల్లో ప్లాస్టిక్, పాతబట్టలు, చెప్పులు వగైరాలున్నాయి. ఆ తర్వాత నదీజలాలు స్ఫటిక స్వచ్ఛతతో అందరినీ ఆశ్చర్యపరిచాయి. కానీ అందరినీ అనుమతించిన పదిరోజుల్లో అంతా మొదటికొచ్చింది. కావడ్ యాత్ర ముగిశాక హరిద్వార్ దగ్గర ఏకంగా ఏడువేల టన్నుల వ్యర్థాలు వెలికి తీశారు.
చాలా దేశాల్లో నదీజలాలు ప్రవహించినంతమేరా ఎంత స్వచ్ఛంగా ఉంటాయో అందరికీ తెలుసు. కానీ నదుల్ని దేవతలుగా భావించి కొలిచే మన దేశంలో మాత్రం నిమజ్జనాల పేరిటా, మొక్కుల పేరిటా వాటిని కాలుష్యంతో ముంచెత్తుతున్నాం. పరిశ్రమల వ్యర్థాలను అరికట్టడానికి తగిన చట్టాలున్నా వాటిని అమలు చేసే దిక్కులేదు. మన దేశంలో 14 పెద్ద నదులూ, 55 చిన్న నదులూ ఉన్నాయి. వీటన్నిట్లో రోజూ లక్షలాది లీటర్ల కాలుష్యం వచ్చిచేరుతోంది. ఈ నీటిపై ఆధారపడక తప్పని కోట్లాదిమంది జనం ప్రమాదకర రోగాలబారిన పడి ఆస్పత్రులపాలవుతున్నారు. పాలకులు మేల్కొనాలంటే ఇంకెన్ని అనర్థాలు జరగాలో వారే సెలవీయాలి.
ఇదీ చదవండి: దేశంలో వాయు కాలుష్యానికి నాదే బాధ్యత: గడ్కరీ


