ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతా వివరాలు తెలుసుకోవడానికి ఇకపై ప్రతిసారీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. మొబైల్ ఫోన్‌లో వాట్సాప్ ద్వారానే పీఎఫ్ బ్యాలెన్స్‌ను సులభంగా తనిఖీ చేసుకోవడంతోపాటు చివరిగా జరిగిన ఐదు లావాదేవీల వివరాలను వెంటనే చూడవచ్చు. అంతేకాకుండా పూర్తి స్థాయి పీఎఫ్ పాస్‌బుక్‌ను కూడా పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త డిజిటల్ సేవలతో కోట్లాది మంది వేతన జీవులకు తమ పదవీ విరమణ పొదుపు వివరాలను ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా సులభంగా తెలుసుకునే అవకాశం లభించింది.
కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఇటీవల ఈపీఎఫ్‌ఓ 74వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వాట్సాప్ ఆధారిత సేవలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సేవల ద్వారా సభ్యులు తమ పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్, చివరి ఐదు లావాదేవీలు, పాస్‌బుక్ వివరాలను వేగంగా పొందవచ్చని కేంద్ర ప్రభుత్వ అధికారిక ప్రకటన స్పష్టం చేసింది. చందాదారులకు వ్యక్తిగత మార్గదర్శకత్వం అందించడంతోపాటు ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (పీఎంవీబీఆర్‌వై)కు సంబంధించిన అవసరాల్లోనూ తగిన సహాయం అందించడం ఈ సేవల ప్రధాన లక్ష్యం.
వాట్సాప్‌లో వివరాలు ఎలా తెలుసుకోవాలి?
ఈపీఎఫ్‌ఓ అందుబాటులోకి తెచ్చిన అధికారిక వాట్సాప్ నంబర్ +91 87964 41800. ఈ నంబర్‌కు సభ్యులు Hi అని మెసేజ్ పంపడం ద్వారా తక్షణమే సేవలను ప్రారంభించవచ్చు. ప్రత్యామ్నాయంగా ఈపీఎఫ్‌ఓ అధికారికంగా విడుదల చేసిన పోస్టర్‌లోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి కూడా నేరుగా చాట్‌ను ప్రారంభించే వీలుంది. వాట్సాప్‌లో సూచించిన విధంగా తమకు నచ్చిన భాషను ఎంచుకోవాలి. అనంతరం తెరపై కనిపించే సర్వీసులు జాబితా నుంచి పీఎఫ్ బ్యాలెన్స్, చివరి ఐదు లావాదేవీలు లేదా పాస్‌బుక్ సంబంధిత ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. తదనుగుణంగా అవసరమైన ఖాతా వివరాలను సులభంగా పొందవచ్చు.
పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేయడానికి..
ముందుగా +91 87964 41800 నంబర్‌కు Hi అని సందేశం పంపాలి.
తర్వాత తమకు నచ్చిన భాషను ఎంచుకోవాలి.
సేవల జాబితాలో Download Passbook ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.
ఒకటి కంటే ఎక్కువ యూఏఎన్‌లు (యూనివర్సల్ అకౌంట్ నంబర్లు) ఉంటే సంబంధిత యూఏఎన్‌ను ఎంచుకోవాలి.
రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని (వన్ టైమ్ పాస్‌వర్డ్) నమోదు చేయాలి.
ధ్రువీకరణ పూర్తయిన తర్వాత పాస్‌బుక్ పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ పీడీఎఫ్ పత్రాన్ని తెరవడానికి సభ్యుల పుట్టిన తేదీని పాస్‌వర్డ్‌గా ఉపయోగించాలి. అయితే ఓటీపీ, పాస్‌వర్డ్ వంటి వ్యక్తిగత వివరాలను వాట్సాప్‌లో ఎవరితోనూ పంచుకోకూడదు.
EPFO services are now just a WhatsApp message away! 💬 Simply say Hi and access: ✅ EPF Balance ✅ Last 5 Transactions ✅ EPF Passbook 📲 WhatsApp Number: +91 8796441800 #EPFO #EPFOWhatsAppServices https://t.co/9VHg2f7X22
— EPFO (@officialepfo) November 16, 2026
సైబర్ మోసాల పట్ల అప్రమత్తత అవసరం
పీఎఫ్ ఖాతా వివరాలు ఉద్యోగుల ఆర్థిక భద్రతకు సంబంధించినవి కావడంతో వాట్సాప్ సేవలను వినియోగించేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి. ఈపీఎఫ్‌ఓ అధికారికంగా ప్రకటించిన +91 87964 41800 నంబర్ ద్వారానే సేవలను పొందాలి. యూఏఎన్, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ వంటి సున్నితమైన సమాచారాన్ని అపరిచిత వ్యక్తులతో ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోకూడదు. పీఎఫ్ సేవల పేరుతో డబ్బులు చెల్లించాలని కోరే సందేశాలు, నకిలీ లింక్‌లు లేదా ఫోన్ కాల్స్‌ను నమ్మకూడదు. వ్యక్తిగత వివరాలు లేదా చెల్లింపులు కోరుతూ ఈపీఎఫ్‌ఓ ఎప్పుడూ ఫోన్ చేయదని సంస్థ తన అధికారిక పోర్టల్‌లో స్పష్టంగా హెచ్చరించింది.
ఇదీ చదవండి: తండ్రికి నోటీసులు పంపిన కూతురు


