అయ్యప్ప భక్తుల కోసం కొత్త సేవలు.. శబరి పోర్టల్‌, వాట్సాప్‌ చాట్‌బాట్‌ | Sabarimala Pilgrims Sabari Portal Whatsapp Chatbot Kerala | Sakshi
Sakshi News home page

అయ్యప్ప భక్తుల కోసం కొత్త సేవలు.. శబరి పోర్టల్‌, వాట్సాప్‌ చాట్‌బాట్‌

Nov 5 2026 9:50 AM | Updated on Nov 5 2026 9:50 AM

Sabarimala Pilgrims Sabari Portal Whatsapp Chatbot Kerala

శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం తీపికబురు అందించింది. యాత్రికులకు అవసరమైన సమాచారం, సేవలను ఒకే వేదికపై అందించేందుకు శబరి పోర్టల్‌తో పాటు ఇంటరాక్టివ్‌ వాట్సాప్‌ చాట్‌బాట్‌ను ప్రారంభించింది. కేరళ ప్రభుత్వం, పతనంతిట్ట జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ సంయుక్తంగా ఈ డిజిటల్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. దీంతో యాత్రికులు యాత్రకు సంబంధించిన కీలక సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు.

ఈ శబరి పోర్టల్‌లో రోజువారీ పూజా షెడ్యూల్స్‌తో పాటు యాత్రికులకు అవసరమైన సౌకర్యాల వివరాలు అందుబాటులో ఉంటాయి. పతనంతిట్ట కలెక్టరేట్‌లోని జూనియర్‌ సూపరింటెండెంట్‌ అజిత్‌ శ్రీనివాస్‌, భూ రెవెన్యూ కమిషనరేట్‌లోని రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ బి. యగేష్‌ ఈ పోర్టల్‌ను అభివృద్ధి చేశారు. ఇందులోని ఇంటరాక్టివ్‌ 'శబరి మ్యాప్‌' ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీని ద్వారా పంబ, నిలక్కల్‌, సన్నిధానం ప్రాంతాల్లోని తాగునీటి కేంద్రాలు, పబ్లిక్‌ టాయిలెట్లు, వైద్య సదుపాయాలు, పోలీస్‌ స్టేషన్లు, పార్కింగ్‌ ప్రాంతాలను యాత్రికులు సులభంగా గుర్తించవచ్చు.

కేరళలోని ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల వివరాలు కూడా ఈ పోర్టల్‌లో పొందుపరిచారు. అలాగే చెంగన్నూర్‌, తిరువల్ల, కొట్టాయం రైల్వే స్టేషన్ల రైళ్ల షెడ్యూల్‌ను తెలుసుకునే సదుపాయం కల్పించారు. పంబకు రాకపోకలు సాగించే సుదూర బస్సు సర్వీసులతో పాటు నిలక్కల్‌-పంబ మధ్య నడిచే షటిల్‌ బస్సుల సమయాలను కూడా తనిఖీ చేసుకోవచ్చు. దీంతో యాత్రికులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్రణాళిక చేసుకునేందుకు వీలుంటుంది.

మరోవైపు యాత్రా కేంద్రాల్లో వస్తువుల ధరల విషయంలోనూ భక్తులకు ఇబ్బందులు కలగకుండా 'చెక్‌ మై బిల్‌' సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా విక్రయించే వస్తువుల అధికారిక ధరలను ధ్రువీకరించుకోవచ్చు. ఎవరైనా అధిక ధరలు వసూలు చేస్తే ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంది. వాట్సాప్‌ చాట్‌బాట్‌ ద్వారా యాత్రికులు ఇంటరాక్టివ్‌ సహాయం పొందవచ్చు. అంతేకాకుండా ఇంటిగ్రేటెడ్‌ 'లాస్ట్‌ అండ్‌ ఫౌండ్‌' సదుపాయం ద్వారా పోగొట్టుకున్న వస్తువులు, మొబైల్‌ ఫోన్లు, తప్పిపోయిన కుటుంబ సభ్యుల వివరాలపై నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు.

ఈ డిజిటల్‌ కార్యక్రమం ద్వారా శబరిమల యాత్రికులకు అవసరమైన సమాచారం, రవాణా, వైద్యం, ఇతర సౌకర్యాల వివరాలను ఒకే వేదికపై అందించాలన్నది కేరళ ప్రభుత్వ లక్ష్యం. దీంతో అయ్యప్ప భక్తులు యాత్ర సమయంలో సమాచారాన్ని పొందడం మరింత సులభతరం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement