దేవస్వం బోర్డు భూమి ఆక్రమణపై ఆలయ కమిటీ ఆగ్రహం!
ఇడుక్కి: శబరిమల మండల-మకరవిళక్కు యాత్రా సీజన్ సమీపిస్తున్న తరుణంలో సంప్రదాయ అటవీ మార్గమైన ‘సత్రం’ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ)కి చెందిన సుమారు 20 ఎకరాల భూమి ఆక్రమణకు గురైనా అధికారులు స్పందించకపోవడం, యాత్రికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో బోర్డు ఘోరంగా విఫలం కావడంపై స్థానికంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సత్రంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయ నిర్వహణ కమిటీ ఈ నిర్లక్ష్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
దశాబ్దాలుగా అయ్యప్ప భక్తులు ‘పులిమేడు’ చేరుకోవడానికి, అక్కడి నుంచి శబరిమల సన్నిధానానికి వెళ్లడానికి సత్రం అటవీ మార్గాన్నే ప్రధానంగా ఎంచుకుంటున్నారు. అయితే, ఈ సీజన్‌లో అటు జిల్లా యంత్రాంగం కానీ, ఇటు దేవస్వం బోర్డు కానీ కనీస ఏర్పాట్లు చేయలేదని ఆలయ కమిటీ ఆరోపించింది. గతంలో కల్పించిన తాత్కాలిక వసతులు కూడా ఈసారి కనిపించడం లేదు. తాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి షెడ్లు వంటి శాశ్వత సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఏళ్ల తరబడి విజ్ఞప్తి చేస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదని మండిపడింది.


