ఇద్దరికంటే ఎక్కువ మందిని కనడాన్ని నిషేధించడం సరికాదు
సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో గత కొన్ని దశాబ్దాల్లో వచ్చిన జనాభా మార్పుల కారణంగా.. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలను కనడాన్ని నిషేధించే చట్టాలు తమ ప్రాసంగికతను కోల్పోయాయని సుప్రీంకోర్టు పేర్కొంది. 2003 నుంచి మొత్తం సంతానోత్పత్తి రేటు(టీఎఫ్‌ఆర్) 3.0 నుంచి 1.9కి పడిపోయినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో జనాభా వృద్ధిని పరిమితం చేసే లక్ష్యంతో రూపొందించిన చట్టాలు ఇప్పుడు ప్రాముఖ్యతను కోల్పోయాయని తెలియజేసింది.
కాకోడ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ఎన్నికైన మంగళ భీమ్‌రావ్ ఇంగ్లే దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం తమ తీర్పును బుధవారం వెలువరించింది. ఆమెకు ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉండటం వల్ల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హురాలని, ఇది ‘మహారాష్ట్ర గ్రామ పంచాయతీల చట్టం–1959’లోని సెక్షన్ 14(1)(జే1)ని ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఆమె ఎన్నికను కోర్టు రద్దు చేసింది.
‘హరియాణా పంచాయతీ రాజ్ చట్టం–1994’ చట్టబద్ధతను పరిశీలించిన అనంతరం, ఇద్దరికంటే ఎక్కువ మంది జీవించి ఉన్న పిల్లలు గల వ్యక్తులు పంచాయతీ పదవులను నిర్వహించడానికి లేదా చేపట్టడానికి అనర్హులని పేర్కొంటూ సుప్రీంకోర్టు 2003 జూలైలో ఇచ్చిన తీర్పును జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రస్తావించింది.
పునరుత్పత్తికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే హక్కు, ఆర్టికల్ 21 కింద లభించే జీవించే హక్కు వ్యక్తిగత స్వేచ్ఛలో అంతర్భాగమని పేర్కొంటూ, ‘జావేద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా’ (2003 తీర్పు) కేసులో వెలువరించిన నిర్ణయాన్ని పునఃపరిశీలించవలసిందిగా సుప్రీంకోర్టు ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలను కనడాన్ని శిక్షించే చట్టాలు ప్రాసంగికతను కోల్పోయినట్లు గట్టిగా అభిప్రాయపడుతున్నామని ధర్మాసనం స్పష్టంచేసింది. జనాభాలో వచ్చిన మార్పుల కారణంగా.. అటువంటి చట్టాలకు పునాది అయిన అధిక జనాభా భయం నేడు లేదని గుర్తుచేసింది.


