ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ లేఖ
16 ఫిర్యాదులతో ఎస్‌ఈసీకి వేర్వేరు లేఖలు రాసిన పార్టీ
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని చోట్లా
సీసీటీవీ లేదా వీడియోగ్రఫీ ఏర్పాట్లకు ఎస్‌ఈసీ ఆదేశం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ బరి తెగించి అక్రమాలకు పాల్పడుతున్నా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్లిప్తంగా వ్యవహరించడం.. సుప్రీంకోర్టు ఆదేశాలనూ బేఖాతర్ చేయడంపై వైఎస్సార్‌సీపీ తీవ్రంగా పరిగణించింది. ఎస్‌ఈసీ నిర్లక్ష్యం కారణంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా చోటు చేసుకుంటున్న ఘటనలపై ప్రతి స్పందించింది.
కుప్పం మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు సందర్భంగా.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లను బయటకు పంపించడం, పోలీసుల లాఠీచార్జి.. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు సందర్భంగా వైఎస్సార్‌సీపీ గెలిచిన వార్డుల్లోనే రీకౌంటింగ్‌కు అనుమతి ఇవ్వడంపై ఎన్నికల కమిషన్ తక్షణ జోక్యం చేసుకోవాలని వైఎస్సార్‌సీపీ కోరింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని సూచిస్తూ వైఎస్సార్‌సీపీ మంగళవారం 16 వేర్వేరు ఫిర్యాదులు చేసింది. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఎస్‌ఈసీకి లేఖలు రాశారు. అందులో వివరాలివీ...
సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు..
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో గతంలో చోటు చేసుకున్న ఘటనలను దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సీసీటీవీ, వీడియోగ్రఫీ ఏర్పాటుతోపాటు అదనపు పోలీసు బలగాలను మోహరించాలి. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం రూరల్ మండలం, ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ముదిగుబ్బ, తాడిమర్రి మండలాలు, ఇదే జిల్లాలోని బత్తలపల్లి మండలంలో తగిన ఏర్పాట్లు చేయాలి. తిరుపతి జిల్లా పెల్లకూరు మండలం పునబాక, చిల్లకూరు గ్రామాల ఎస్సీ, ఎస్టీ ఓటర్లకు రక్షణతోపాటు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లకు తగిన పోలీసు భద్రత కల్పించాలి. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలంలోని 56, 57, 58, 59 పోలింగ్ కేంద్రాల వద్ద, మార్కాపురం జిల్లా హనుమంతునిపాడు మండలంలోని సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయాలి.
100 శాతం వెబ్‌కాస్టింగ్, సీసీటీవీలు..
తిరుపతి జిల్లా చినగొట్టిగల్లు, రామచంద్రాపురం మండలాల్లోని కీలక, అత్యంత కీలకమైన పోలింగ్ కేంద్రాల్లో కేంద్ర సాయుధ పోలీసు బలగాల మోహరింపు, వెబ్‌కాస్టింగ్, ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయాలి. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అదనపు బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, 100 శాతం వెబ్‌కాస్టింగ్, సీసీటీవీలు ఏర్పాట్లు చేయాలి. దీంతో పాటు తిరుపతి జిల్లా పెల్లకూరు మండలంలో అధికారికంగా నియమించిన ఏజెంట్లను అన్ని పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించి స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు జరిగేలా చూడాలి.
కుప్పంలో విపక్ష అభ్యర్థులు, ఏజెంట్లను గెంటేసి కౌంటింగ్...
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా పలుచోట్ల చోటు చేసుకున్న ఘటనలపై ఎన్నికల కమిషన్ తక్షణం చర్యలు తీసుకోవాలి. కుప్పం మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు సందర్భంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లను బయటకు పంపించడం, పోలీసుల లాఠీచార్జి, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు సందర్భంగా అక్రమాలకు తెర తీస్తూ.. వైఎస్సార్‌సీపీ గెలిచిన వార్డుల్లోనే రీకౌంటింగ్‌కు అనుమతి ఇవ్వడంపై ఎన్నికల కమిషన్ తక్షణ జోక్యం చేసుకోవాలి.
వీటితో పాటు ప్రకాశం జిల్లా చీమకుర్తి కౌంటింగ్ కేంద్రంలో టీడీపీ నాయకులు, వారి అనుచరులు వైఎస్సార్‌సీపీ కౌంటింగ్ ఏజెంట్లను అడ్డుకోవడం, పోలీసులు స్పందించకపోవడంపై తక్షణ జోక్యం చేసుకోవాలి. ఆత్మకూరు మున్సిపాలిటీలో 26, 27 వార్డుల్లో రీకౌంటింగ్ సందర్భంగా చోటు చేసుకున్న అక్రమాలు, అనధికార వ్యక్తులు కౌంటింగ్ హాల్‌లోకి ప్రవేశించడంపై స్వతంత్ర బృందం పర్యవేక్షణలో తిరిగి లెక్కింపు జరపాలి.
ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలి...
గతంలో పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నికల సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరించిన కడప కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఎన్నికల ప్రక్రియను అధికార పార్టీకి అనుకూలంగా నిర్వహించేలా అవకాశం కల్పించారు. ఆ ఉపఎన్నిక సందర్భంగా జరిగిన చోటు చేసుకున్న అక్రమాల గురించి తెలిసి కూడా పట్టించుకోలేదు. ఓటరు స్లిప్పుల పంపిణీలో అక్రమాలు, పెద్ద సంఖ్యలో ఓటర్లను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించడం లాంటి అంశాలపై ఫిర్యాదులు అందినా తగిన చర్యలు తీసుకోలేదు. దీనిపై స్వతంత్ర విచారణ జరిపించడంతో పాటు పక్షపాతంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించి స్థానిక సంస్థల ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి.
పోలింగ్ రికార్డింగ్‌లు భద్రపరచాలని ఆదేశం..
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదులపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాల్లో సీసీటీవీ లేదా వీడియోగ్రఫీ ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లను ఆదేశించింది. ఎన్నికల పిటిషన్ దాఖలు చేసే గడువు ముగిసే వరకు లేదా దానిపై తుది పరిష్కారం అయ్యేవరకు రికార్డింగ్‌లను భద్రపరచాలని స్పష్టం చేసింది. అలాగే ఆయా ఫిర్యాదులపై తీసుకున్న చర్యల నివేదికను ఈ నెల 4వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు సమర్పించాలని ఆదేశించింది.


