అర్నబ్ దెబ్బనుంచి కోలుకోకముందే విరుచుకుపడిన మరో తుపాను
కుండపోత వానలు, గాలులకు నేలకొరిగిన వరి చేలు
తుడిచి పెట్టుకుపోయిన పంటలు
అన్నదాత ఆశలను చిదిమేసిన వరుస విపత్తులు
రైతులకు భారీగా పెట్టుబడి, ఉత్పత్తి నష్టాలు
సాక్షి, అమరావతి: అర్నబ్ తుపాను ప్రభావం నుంచి ఇంకా కోలుకోక ముందే ‘మురసు’ రూపంలో విరుచుకుపడిన మరో తుపాను అన్నదాతను కోలుకోలేని దెబ్బతీసింది. అర్నబ్ తుపాను దెబ్బకు ఉత్తరాంధ్ర మొదలు కోస్తాంధ్ర వరకు కకావికలమైన రైతులు మురసు దెబ్బకు విలవిల్లాడిపోతున్నారు. అర్నబ్ తుపాను దెబ్బకు నేలకొరిగిన పంట చేలను నిలబెట్టుకునేందుకు, ముంపునకు గురైన చేలల్లో నీటిని బయటకు తోడుకునేందుకు రైతులు పడరాని పాట్లుపడుతున్నారు. పొట్టదశలో ఉన్న పంట అంతా నేలపాలవడంతో కన్నీరుమున్నీరయ్యారు. నేలకొరిగిన పంటను ఒబ్బిడి చేసుకునేందుకు నానాతంటాలు పడుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో కుంభవృష్టిని తలపించేలా కురుస్తున్న వర్షాలు రైతుల ఆశలను పూర్తిగా చిదిమేశాయి.
ఆరంభం నుంచీ రైతులకు తిప్పలే
ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి ముగిసే వరకు తీవ్రమైన లోటు వర్షపాతంతో రైతులు సమతమతమయ్యారు. కరువు దెబ్బకు దాదాపు 5 లక్షల ఎకరాల్లో పంటలే సాగవలేదు. సాగైన చోట కూడా సగానికి పైగా పంటలు తీవ్రమైన నీటి ఎద్దడితో ఎండిపోయి పచ్చని చేలన్నీ బీడులను తలపించాయి. వర్షాభావం, సాగునీటి ఎద్దడి వంటి ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి గోదావరి, కృష్ణా డెల్టాల్లో సాగైన పంటలను వరుస విపత్తులు దెబ్బతీస్తున్నాయి. సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు కొంతమేర దెబ్బతినగా, పంట చేతికొచ్చే దశలో వరుసగా విరుచుకుపడిన అర్నబ్, మురసు తుపానులు అన్నదాతల ఆశలను చిదిమేశాయి.
దెబ్బ మీద దెబ్బ
ఖరీఫ్‌లో 37.33 లక్షల ఎకరాల్లో వరి సాగవగా.. దాంట్లో 26 లక్షల ఎకరాలు తుపాను ప్రభావిత జిల్లాల్లోనే సాగైంది. ఎకరాకు రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టారు. అర్నబ్ తుపాను దెబ్బకు అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాల్లో పంటలు పూర్తిగా నేలకొరిగాయి. చేలల్లో మొల లోతు నీరు నిలిచిపోయింది. పొట్ట దశకు చేరుకున్న వరిచేలు ముంపు నీటిలో చిక్కుకుని కుళ్లిపోతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారమే అర్నబ్ తుపాను ప్రభావానికి 9.38 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బ తిన్నట్టుగా ప్రకటించారు.
కాగా.. క్షేత్ర స్థాయిలో 12 లక్షల ఎకరాలకు పైగానే పంటలకు భారీగా నష్టం వాటిల్లినట్టు రైతులు చెబుతున్నారు. అర్నబ్ తుపాను నష్టం నుంచి ఇంకా తేరుకోకముందే మురసు ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు అన్నదాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ తుపాను ఏఎస్‌ఆర్, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు నంద్యాల, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది.
ఆ జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో వరితోపాటు మిరప, పత్తి, కంది, మొక్కజొన్న, పత్తి, మినుము, అరటి, బొప్పాయి, పసుపు, కూరగాయ పంటలన్నీ ఎందుకూ పనిరాకుండా దెబ్బతిన్నాయి. మురసు తుపాను ప్రభావంతో మంగళవారం కురుస్తున్న వర్షాలకు ప్రాథమిక లెక్కల ప్రకారమే దాదాపు 5 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 9వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఈ వరుస విపత్తులతో పెట్టుబడితో పాటు భారీగా ఉత్పత్తి నష్టం వాటిల్లడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరోవైపు విద్యుత్ కోతలతో కోస్తా జిల్లాల్లోని ఆక్వా చెరువులకు ఆక్సిజన్ కొరతతో లక్షలాది ఎకరాల్లోని ఆక్వా చెరువుల్లో రొయ్యలు తేలిపోతున్నాయి.

కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో నేలవాలిన వరి పైరు
పరిహారం ఇవ్వలేమంటున్న చంద్రబాబు
గతేడాది ఇదే సమయంలో దెబ్బతీసిన మోంథా తుపాను పరిహారం నేటికీ అందలేదు. కరువు సాయం ఊసెత్తడం లేదు. సెప్టెంబర్‌లో వర్షాలతో పాటు అర్నబ్ తుపాను పంట నష్టం అందని ద్రాక్షగానే కనిపిస్తోంది. తాజాగా మురసు తుపాను సాయం పరిస్థితి అంతే. పైగా కరువు జాబితాలో ఉన్నా సెప్టెంబర్ వర్షాలకు దెబ్బతిన్న పంటల జాబితాలో ఉంటే ఈ తాజా తుపానుల పంట నష్టం జాబితాలో వారి పేర్లు ఉండే చాన్స్ లేదని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.
మరోపక్క పంట చేలల్లో చేరిన నీటిని తొలగిస్తామని, నేలకొరిగిన పంటను నిలబెడతామని అని చెప్పిన ప్రభుత్వం చివరకు ‘ఉప్పు ద్రావణం పిచికారీ చేయండి.. ముంపునకు గురైన పంటలను కాపాడుకోండి’ అంటూ ఉచిత సలహాలు ఇవ్వడమే తప్ప నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చే దిశగా ఆలోచన చేయడం లేదు. ప్రభుత్వం ఆదుకోకపోతే తమకు ఆత్మహత్యలు తప్ప మరో గత్యంతరం లేదని రైతులు వాపోతున్నారు. ఏడాదిలో అనావృష్టి.. అతివృష్టితో దెబ్బతిన్న తమను ఆర్థికంగా ఆదుకోకుండా ప్రభుత్వం ప్రకటనలతో సరిపెడుతోందని మండిపడుతున్నారు.


