రాప్తాడు ఉన్మాదికి కాలు తొలగింపు | Doctors completely amputate Hemant right leg | Sakshi
Sakshi News home page

రాప్తాడు ఉన్మాదికి కాలు తొలగింపు

Nov 4 2026 5:16 AM | Updated on Nov 4 2026 5:16 AM

Doctors completely amputate Hemant right leg

బుల్లెట్ల గాయాలతో కుడికాలుకు ఇన్‌ఫెక్షన్‌ 

రక్త ప్రసరణ లేక గంటల వ్యవధిలోనే నల్లబారిన వైనం 

కుడి కాలు పూర్తిగా తొలగించిన వైద్యులు 

అనంతపురం సిటీ: అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థినిపై ఎలక్ట్రిక్‌ రంపంతో దాడి చేసిన ఘటనలో నిందితుడు హేమంత్‌కు వైద్యులు శస్త్రచికిత్స చేసి కుడి తొడ వరకూ తొలగించారు. గత నెల 31న ఉదయం పాఠశాల తరగతి గదిలో ఉన్న పదో తరగతి విద్యార్థిని గోపికపై హేమంత్‌ పాశవికంగా దాడి చేసిన విషయం తెలిసిందే. అనంతరం పరారీలో ఉన్న హేమంత్‌ ఆచూకీని ఈ నెల 1న పోలీసులు పసిగట్టారు. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో ఉన్నట్లుగా గుర్తించిన రాప్తాడు సీఐ వెంకటేష్, సిబ్బంది అదే రోజు రాత్రి అక్కడకు చేరుకోగా, వారి నుంచి తప్పించుకునే క్రమంలో సీఐపై హేమంత్‌ కత్తితో దాడి చేశారు. దీంతో సీఐ జరిపిన కాల్పుల్లో హేమంత్‌ రెండు కాళ్లలో తొడ భాగం నుంచి మోకాలి కింది భాగం వరకు బుల్లెట్లు దూసుకెళ్లాయి.

అనంతరం పోలీసులు హేమంత్‌ను జీజీహెచ్‌కు తరలించారు. అయితే బుల్లెట్‌ గాయాల కారణంగా కుడి కాలుకు ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో కండరాలు స్వా«దీనం కోల్పోయా­యి. రక్తప్రసరణ సక్రమంగా జరగకపోవడంతో తొడ భాగం నుంచి కాలు నల్లబారిపోయింది. వైద్య పరీక్షల అనంతరం ఆ కాలును తొలగించాల్సి ఉంటుందని వైద్యు­లు నిర్ధారించారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 11 గంటలకు శస్త్రచికిత్స చేసి కుడి కాలును తొలగించేందుకు వైద్యులు సిద్ధమయ్యారు. 

అయితే మత్తుకు హేమంత్‌ శారీరక పరిస్థితి సహకరించక పోవచ్చని అనస్తీషియా విభాగం వైద్యులు భావించడంతో ఒక రోజు ఆగాల్సి వచ్చింది. మంగళవారం తెల్లవారుజామున రెండున్నర గంటలకు పైగా శ్రమించి కుడి కాలు తొడ భాగం నుంచి పూర్తిగా తొలగించారు. ప్రస్తుతం హేమంత్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రెండు, మూడు రోజుల అబ్జర్వేషన్‌ తర్వాత ప్రిజనర్స్‌ వార్డుకు నిందితుడిని మార్చే అవకాశమున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement