ప్రజాస్వామ్యం హైజాక్‌! | Chandrababu naidu dramas in local body elections | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యం హైజాక్‌!

Nov 4 2026 3:51 AM | Updated on Nov 4 2026 3:51 AM

Chandrababu naidu dramas in local body elections

అధికారాన్ని అడ్డుపెట్టుకుని పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టించదల్చుకుంటే సకల వ్యవస్థలూ సాగిలబడి సహకరిస్తాయని ఆంధ్రప్రదేశ్‌లో ‘సజావుగా’ సాగిన నగరపాలక, పట్టణ, నగర పంచాయతీ ఎన్నికల ప్రహసనం నిరూపించింది. నామినేషన్ల ఘట్టం తొలిరోజు మొదలైన హింసాకాండ, దౌర్జన్యం ఫలితాల నాడు కూడా యథాప్రకారం కొనసాగాయి. ఇక గురువారం జరిగే జడ్‌పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్‌తంతు మిగిలింది. 

దాదాపు అన్నిచోట్లా నామినేషన్ల దాఖలుకు వచ్చేవారిపై దాడులు, మహిళలని చూడకుండా తోడేళ్లలా మీదబడి నామినేషన్‌ పత్రాలు లాక్కొనటం, తమవారినే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులుగా ఫేక్‌ నామినేషన్లు దాఖలు చేయించి ఉపసంహరింపజేయటం, అన్నీ దాటుకుని అభ్యర్థులైనవారి ఇళ్లపై పోలీసులు, గూండాలతో దాడులు చేయించి ఉపసంహరింపజేయటం, సాధ్యంకాకపోతే వారి సంతకాలు ఫోర్జరీ చేయటం, నామినేషన్లు చెల్లబోవని అధికారులతో చెప్పించటం, పోలింగ్‌నాడు అడ్డ గోలుగా ఓట్లేసుకుని బ్యాలెట్‌ బాక్సులు నింపడం, ఫలితాల రోజున వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నెగ్గినట్టుగా డిక్లరేషన్లిచ్చినచోట చించి పోగులు పెట్టడం... ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆడించిన డ్రామాలకు అంతూ పొంతూ లేదు. 

మూడు దశాబ్దాల క్రితం మాయమాటలతో, తప్పుడు ఆరోపణలతో, ఫోర్జరీ సంతకాలతో, స్వయానా మామ అయిన స్వర్గీయ ఎన్టీఆర్‌నుంచి అధికారాన్నీ, పార్టీనీ కూడా సంగ్రహించిన బాబు అచ్చం తనలాంటి వారినే ఊరూరా ప్రతిష్ఠించటానికి ఈ ఎన్నికల్లో పట్టపగ్గాల్లేకుండా చెలరేగి పోయారు. అంతా అయినాక ప్రజాస్వామ్యంపై నారాస్వామ్యం గెలిచిందని ఈ క్షీణచంద్రుడు నూలుపోగు సైతం వదిలేసి మరీ ప్రకటించదల్చుకున్నట్టు కనబడుతోంది. 

‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం... అరాచకత్వాన్ని అంతం చేద్దాం’ నినాదంతో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సారథ్యంలో బీజేపీ హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన మహా పాదయాత్ర విజయవంతమైందని ఆ పార్టీ శ్రేణులు సంబరపడ్డాయి. కానీ అంతకు పక్షం రోజుల్నించి పొరుగునున్న ఏపీలో జరుగుతున్నదేమిటో తెలంగాణ వాసులు గమనించరనుకున్నారా? తమ కూటమి ప్రభుత్వం విధ్వంసక శక్తిగా మారి పోలీసుల్నీ, గూండాలనూ వీధుల్లో స్వైరవిహారం చేయించి ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టించిన వైనం, అరాచకత్వాన్ని ప్రతిష్ఠించిన తీరు చూసి జనం విస్తుబోతున్నారు. వారికేం చెబుతారు? ఇందులో పాలుపంచుకున్న తమ పార్టీ నేతలనైనా మందలించారా? అక్కడి పరిస్థితుల గురించి కేంద్ర నిఘా సంస్థలు ఎలాంటి నివేదికలిచ్చాయి? తమవారే ఇలా చేస్తుంటే ప్రజాస్వామ్యాన్ని ఎవరినుంచి రక్షిద్దామనుకుంటున్నారని సూటిగా ప్రశ్నిస్తే అమిత్‌ షా అయినా, ఆ పార్టీ ఇతర నేతలైనా జవాబివ్వగలరా?

రాజ్యం వీరభోజ్యమనే రోజులు పోయాయని అందరూ అనుకుంటున్న తరుణంలో అది అబద్ధమని బాబు అండ్‌ కో నిరూపించారు. అసలు నామినేషన్ల పర్వం ప్రారంభానికి ముందే బెదిరింపులు మొదలెట్టారు. అప్పనంగా వచ్చిన అధికారంవల్ల అమాత్యుడైన ఒక దౌర్భాగ్యుడు నామినేషన్‌ వేయొద్దంటూ ఫోన్‌లో బెదిరిస్తాడు. అలాంటి పదవి కోసం కాచుక్కూర్చున్న అదే బాపతు నాయకుడు ఇంకోచోట ఇళ్లకు గూండాల్ని పంపి, అభ్యర్థిత్వం ఉపసంహరించుకుంటున్నట్టు మైనారిటీ మహిళతో చెప్పిస్తాడు. ‘మీతో భద్రంగా నామినేషన్లు వేయిస్తాం రండ’oటూ వ్యాన్‌లో తీసుకెళ్లే పోలీసులు ముందే ఆ సమాచారాన్ని టీడీపీ గూండాలకు చేరేస్తారు. కార్యాలయం ముందు దిగగానే వారిపై గూండాల దాడులు మొదలై, నెత్తుటి గాయాలతో వెనుదిరుగుతారు. 

ఎన్నికల్లో విచ్చలవిడి హింసకు తెరలేపి, ఆ నెపంతో కాల్పులు జరిపించి జనాన్ని పొట్టనబెట్టుకోవటానికి... ఆ బాధ్యతను వైఎస్సార్‌ కాంగ్రెస్‌పైకి నెట్టడానికి ప్రభుత్వ యంత్రాంగం చేయని ప్రయత్నమంటూ లేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో ఆయన కాన్వాయ్‌కి ఎదురెళ్లమని వివేకా హత్య కేసు ప్రధాన నిందితుడు దస్తగిరిని ఉసిగొల్పడం సైతం ఈ కుట్రలోభాగం. ఈ సోకాల్డ్‌ ఎన్నికల ప్రక్రియ పొడవునా ప్రతి దాడులకు దిగకుండా, మాట తూలకుండా ఉన్నందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ శ్రేణుల్ని అభినందించాలి. ఇవాళ ఏపీ ప్రశాంతంగా ఉందంటే ఆ పార్టీ శ్రేణుల సంయమనమే కారణం. అసలు వీటిని ఎన్నికలనొచ్చా? న్యాయవ్యవస్థ తేల్చాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement