ప్రజాస్వామ్యంలో ఎన్నికలు గ్రామ స్థాయి నుంచి నగరస్థాయి వరకు ప్రజలకు తమ ప్రతినిధులను ఎన్నుకునే అవకా శాన్ని కల్పించే ప్రజాస్వామ్య పండుగలు. ప్రజలు తమ పాలకులను ప్రశ్నించడానికి, తమ అభిప్రాయాలను ఓటు రూపంలో వ్యక్తం చేయడానికి ఎన్నికలు ఒకరాజ్యాంగబద్ధమైన వేదిక. కానీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులను అడ్డు కుంటే, నామినేషన్ పత్రాలను లాక్కొని చించివేస్తే, అభ్యర్థులను బెదిరిస్తే, పోలింగ్ ఏజెంట్లను బూతుల్లోకి అనుమతించకపోతే, ఓటర్లను ఓటు వేయకుండా నిరోధిస్తే, పోలీసులు ప్రేక్షకులుగా మిగిలిపోతే ఆ ఎన్నికలను స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికలని అంటారా? ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు ఈ ప్రశ్నలను మన ముందుంచుతున్నాయి.
నామినేషన్ పత్రమే తొలి బ్యాలెట్?
ఈ ఘటనలను సాధారణ ఎన్నికల గొడవలుగా చూడలేం. నామినేషన్ పత్రం కేవలం ఒక పరిపాలనా పత్రం కాదు. అది ఒక పౌరుడి ప్రజాస్వామ్య ఆకాంక్షకు తొలి వ్యక్తీకరణ. ఓటరు తన ప్రతి నిధిని ఎంచుకునే ముందు, ఒక పౌరుడు తాను అభ్యర్థిగా నిలబడే హక్కును వినియోగించుకోగలగాలి. మండల పరిషత్ కార్యాలయం గేటు వద్ద నామినేషన్ పత్రాన్ని లాక్కోవడం, రిటర్నింగ్ అధికారి సమక్షంలోనే చించివేయడం అంటే ఒక కాగితాన్ని నాశనం చేయడం కాదు. అది ఒక పౌరుడి రాజ్యాంగ హక్కును నిరాకరించడం. పోటీ చేసే అభ్యర్థినే లేకుండా చేసిన తరువాత ఓటరు తనకు నచ్చిన ప్రతినిధిని ఏ విధంగా ఎంచుకోగలుగుతాడు?
ఏకగ్రీవ ఎన్నికలు తప్పు కాదు. పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాకపోతే ఒక అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక కావచ్చు. కానీ బెదిరింపులు, దాడులు, నామినేషన్లకు అడ్డంకులు జరిగిన ప్రాంతా ల్లోనే పెద్ద సంఖ్యలో ఏకగ్రీవ ఫలితాలు వస్తే వాటి వెనుక పరిస్థితు లను పరిశీలించాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛందంగా వచ్చిన ఏకగ్రీవత ప్రజాస్వామ్య ఫలితం. భయంతో వచ్చిన ఏకగ్రీవత ప్రజాస్వామ్యానికి ప్రతికూలం.
ఎస్‌ఎల్‌పి(సి) నం.37476/2026లో స్వేచ్ఛాయుతమైన, నిష్ప క్షపాతమైన ఎన్నికలు రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నామినేషన్ దాఖలు చేసి ఎన్నికల్లో పాల్గొనే హక్కుకు ఆటంకం కలగకుండా చూడటం కూడా ఆ సూత్రంలో భాగమేనని గుర్తించింది. మహిళా అభ్యర్థులపై దాడులు జరిగాయని, నామినేషన్ పత్రాలను లాక్కొని చించివేశారని కూడా ఫిర్యాదులు వచ్చాయి. ఒక మహిళా అభ్యర్థి గడువు ముగిసే వరకు నామినేషన్ కేంద్రానికి చేరకుండా నిరోధిస్తే, మహిళలకురాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ ప్రయోజనం ఏమిటి?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 243జెడ్‌ఏ ప్రకారం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ, నియంత్రణ బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘానిదే. కిషన్ సింగ్ తోమర్ వర్సెస్ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (2006) కేసులో రాష్ట్ర ఎన్నికల సంఘాల రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను సుప్రీంకోర్టు వివరించింది. స్టేట్ ఆఫ్ గోవా వర్సెస్ ఫౌజియా ఇంతియాజ్ షేక్ (2021) కేసులో ఎన్నికల సంఘాల స్వతంత్రత ప్రాధాన్యాన్ని పునరుద్ఘాటించింది.
ఇందిరా నెహ్రూ గాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్ (1975) కేసులో స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికలు రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అక్టో బర్ 21, 2026న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసే హక్కు విషయంలో కూడా ఇదే సూత్రాన్ని మరోసారి గుర్తుచేసింది.
అందరూ సమానం కాదా?
ఆర్టికల్ 14 చట్టం ముందు సమానత్వాన్ని హామీ ఇస్తుంది. పోలీసులు పక్షపాతంగా వ్యవహరించడం ఈ హామీని దెబ్బతీస్తుంది. ఆర్టికల్ 21 జీవించే హక్కుతో పాటు వ్యక్తిగత స్వేచ్ఛను, గౌరవంగా జీవించే హక్కును రక్షిస్తుంది. ఆర్టికల్ 19(1)(ఎ)లోని భావప్రకటనా స్వేచ్ఛకు ఎన్నికల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కుతో సంబంధం ఉంది. పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2013) కేసులో ఓటు వేయడం అనేది వ్యక్తి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే ప్రక్రియలో భాగమని సుప్రీంకోర్టు గుర్తించింది.
మానవ హక్కుల పరిరక్షణ చట్టం, 1993 కూడా ఈ విషయంలో ఒక ముఖ్యమైన మార్గాన్ని అందిస్తుంది. సెక్షన్ 2(1)(డి) ప్రకారం జీవించే హక్కు, స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం వంటి హక్కులు మానవ హక్కుల పరిధిలోకి వస్తాయి. సెక్షన్ 12(ఎ) ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల వల్ల జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలను లేదా వాటిని నివారించడంలో వారు చూపిన నిర్లక్ష్యాన్ని జాతీయ మానవ హక్కుల సంఘం విచారించవచ్చు. సెక్షన్ 17కింద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ నుంచి నివేదికలు కోర వచ్చు. సెక్షన్ 14 కింద తన దర్యాప్తు విభాగం ద్వారా విచారణ జరిపించవచ్చు. సెక్షన్ 18 కింద తగిన సిఫారసులు చేయవచ్చు.
సాధారణంగా ఎన్నికల ఫలితాలను ఎన్నికల పిటిషన్ ద్వారా సవాలు చేయాలి. అయితే ఎన్నికల పిటిషన్, మానవ హక్కుల విచారణ రెండూ వేర్వేరు ప్రయోజనాల కోసం ఏర్పడిన మార్గాలు. ఎన్నికల పిటిషన్ ద్వారా ఫలితాన్ని సవాలు చేయవచ్చు. కానీ నామినేషన్ పత్రాలను చించివేసినప్పుడు పోలీసులు ఎందుకు చర్య తీసుకోలేదు, ఒక అభ్యర్థిని అక్రమంగా నిర్బంధించారా, ప్రభుత్వ ఉద్యోగి పక్షపాతంగా వ్యవహరించారా అనే ప్రశ్నలకు అది ప్రత్యా మ్నాయం కాదు. ఈ అంశాలను మానవ హక్కుల సంఘం పరిశీలించవచ్చు. కానీ ఎన్నికల ఫలితాన్ని రద్దు చేసే అధికారం దానికి లేదు.
ఇకనైనా మారాల్సినవి!
ప్రతి నామినేషన్ కేంద్రంలో నిరంతర వీడియో రికార్డింగ్ ఏర్పాటు చేయాలి. ఆ రికార్డులను నిర్దిష్ట కాలం వరకు భద్రపరచడం తప్పనిసరి చేయాలి. స్థానిక నామినేషన్ కార్యాలయం హింసకుకేంద్రంగా మారితే, అభ్యర్థులు కలెక్టరేట్‌లో లేదా సురక్షితమైన ఆన్‌లైన్ విధానంలో నామినేషన్లు దాఖలు చేసే ప్రత్యామ్నాయం కల్పించాలి. పోలీసులు రాజకీయ గుర్తింపుతో సంబంధం లేకుండా నేరాలను నమోదు చేసి దర్యాప్తు చేయాలి. పక్షపాతంగా వ్యవహరించినట్లు రుజువైన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి.
బెదిరింపులకు భయపడి బాధితులు ముందుకు రాలేని పరిస్థి తుల్లో వారి తరఫున ఇతరులు కూడా మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించవచ్చు. జాతీయ మానవ హక్కుల సంఘం ఈ ఘటన లను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ నుంచి నివేదికలు కోరాలి. ప్రభుత్వ అధికారుల పాత్రను పరిశీలించి, ఉల్లంఘనలు రుజువైన చోట తగిన చర్యలు సిఫారసు చేయాలి.ఆంధ్రప్రదేశ్ ముందున్న ప్రశ్న ఏ పార్టీ ఎక్కువ గెలుచుకుందన్నది కాదు. ఆ ఫలితాన్ని నిర్ణయించే ప్రక్రియలో ప్రతి పౌరుడికి భయం లేకుండా పాల్గొనే అవకాశం కల్పించారా అన్నదే అసలు ప్రశ్న.
ఓటు హక్కు అనేది పోటీ చేసే హక్కుతో ప్రారంభ మవుతుంది. పోటీ చేసే హక్కుకు పునాది మానవ గౌరవం, సమానత్వం. వీటిని కాపాడలేని ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యానికి నిజమైన ప్రతిబింబం కాలేదు.

- వ్యాసకర్త నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ పూర్వ రిజిస్ట్రార్
- ప్రొ‘‘ మాడభూషి శ్రీధర్


