దేశం గర్వించదగిన శాస్త్రవేత్త | Scientist Ayyagari Sambasiva Rao death anniversary | Sakshi
Sakshi News home page

దేశం గర్వించదగిన శాస్త్రవేత్త

Oct 30 2026 11:15 AM | Updated on Oct 30 2026 1:15 PM

Scientist Ayyagari Sambasiva Rao death anniversary

 (అక్టోబరు 31 ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎ.ఎస్‌. రావు వర్ధంతి)

భారతదేశం గర్వించదగిన శాస్త్రవేత్త డా.ఎ.ఎస్‌. రావు. హోమీ జె. భాభా నాయకత్వంలో రూపొందించబడ్డ భారతదేశ తొలి అణు పరిశోధక రియాక్టర్‌ ‘అప్సర’ రూపకల్పనలో ఆయన పనిచేశారు. అలాగే రాజా రామన్న లాంటి శాస్త్రవేత్తలతో కలిసి పనిచేసిన మేధావి. హైదరాబాద్‌ లోని ఇ.సి.ఐ.ఎల్‌. రూపకర్త కూడా. ఆయన పూర్తి పేరు అయ్యగారి సాంబశివ రావు. 1914 సెప్టెంబర్‌ 20న మోగల్లులో ఒక పేద రైతు కుటుంబంలో జన్మించారు. బెనారస్‌ హిందూ విశ్వవిద్యా లయం నుండి ఎమ్మెస్సీ పట్టా సాధించిన తరువాత ఆ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ప్రోత్సాహంతో అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ యునివర్సిటీలో ఎలెక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌ సాధించారు.అమెరికాలో ఎన్ని అవకాశాలున్నా వదులు కొని, మాతృదేశ పురోగతియే ఏక లక్ష్యంగా భారతదేశం తిరిగి వచ్చారు. ఆయన నిరంతర కృషి వల్లనే ఈసీఐఎల్, ఎన్‌ఎఫ్‌సీ వంటి సంస్థలు హైదరా బాద్‌కు దక్కాయి.

ఎ.ఎస్‌.రావు నిరాడంబరత్వానికి ఆయన మిత్రులు ఒక సంఘటనను ఉదాహరణగా చెప్పు కునేవారు: ఒకరోజు సికింద్రాబాద్‌ నుండి ఎ.ఎస్‌. రావు నగర్‌ వెళ్ళే బస్సులో, చేతిలో చిన్న సంచితో రావుగారు ఎక్కారు. బస్సు క్రిక్కిరిసి ఉండటంతో బయట ఏమీ కనిపించని స్థితిలో ఆయన ‘ఎ.ఎస్‌. రావు నగర్‌ స్టాప్‌ వచ్చినప్పుడు చెప్ప’మని కండక్టర్‌ను కోరారు. ‘ఈ మాత్రం తెలియదా నీకు, అసలెవరివి’ అంటూ మాట్లాడిన కండక్టర్‌కు ‘నా పేరు ఎ.ఎస్‌ రావు, సైంటిస్ట్‌ని’ అని సౌమ్యంగా జవాబిచ్చారు. అది విని కండక్టర్‌ ఆశ్చర్య పోయి ‘క్షమించండి సార్‌’ అని వేడుకున్నాడు. బస్‌ డిపో చేరుకున్న కండక్టర్‌ ఆ సంఘటనను తోటి ఉద్యోగులకు చెప్పడంతో ఆ వార్త ఆనాటి పత్రికల్లో సంచలన వార్తగా మారింది. 

ఇదీ  చదవండి: పాఠ్యపుస్తకాల కోసం కోర్టుకెక్కిన విద్యావేత్త

ఉద్యోగ విరమణ తరువాత హైదరాబాద్‌లోని నాచారంలో ఉండే వారాయన. తన 89వ ఏట 2003 అక్టోబర్‌ 31న ఆయన తుది శ్వాస విడిచారు. హైదరాబాద్‌లో ఆయన పేరుతో 120 ఎకరాల్లో రూపుదిద్దుకున్న ఎ.ఎస్‌. రావు నగర్‌ ఒక చక్కని కాలనీగా మారింది. భారత ప్రభుత్వం ఆయన శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఒక పోస్టల్‌ స్టాంప్‌ను విడుదల చేసింది. పద్మశ్రీ, పద్మభూషణ్, శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ వంటి అవార్డులు ఆయన్ని వరించి తమను తాము గౌరవించుకున్నాయెప్పుడో!
– బసవరాజు నరేందర్‌ రావు అడ్వకేట్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement