కస్టమర్‌కు సమాచారం ఇవ్వని బ్యాంకు.. | SBI Ordered To Pay Retired Scientist ₹15 Lakh FD Amount With Interest, ₹35,000 Compensation For Service Deficiency | Sakshi
Sakshi News home page

కస్టమర్‌కు సమాచారం ఇవ్వని బ్యాంకు..

Oct 17 2026 12:12 PM | Updated on Oct 17 2026 1:43 PM

why SBI Ordered to Pay Over Rs 15 Lakh to Retired Scientist

ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (ఎఫ్‌డీ) మెచ్యూరిటీ తేదీని, పొడిగింపు అవకాశాన్ని ఖాతాదారుడికి తెలియజేయడంలో విఫలమైన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)కు హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ షాక్‌ ఇచ్చింది. రిటైర్డ్‌ శాస్త్రవేత్తకు అసలు డిపాజిట్‌తోపాటు వర్తించే వడ్డీ చెల్లించాలని, మానసిక వేదనకు రూ.25 వేలు, న్యాయవ్యయాల కింద రూ.10 వేలు అదనంగా చెల్లించాలని ఆదేశించింది. ఇటీవల వెలువడిన ఈ ఉత్తర్వుల్లో బ్యాంకు సేవల్లో లోపం ఉందని కమిషన్‌ స్పష్టం చేసింది.

అసలేం జరిగింది?

రిటైర్మెంట్‌ ప్రయోజనాల నుంచి వచ్చిన రూ.15 లక్షలను బాధితుడు 2018 డిసెంబరు 13న సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్‌లో పెట్టుబడిగా పెట్టారు. దీనిపై వార్షికంగా 8.5 శాతం వడ్డీ వర్తించగా 2023 డిసెంబరు 12న డిపాజిట్‌ మెచ్యూర్‌ కావాల్సి ఉంది. అయితే, మెచ్యూరిటీ గురించి బ్యాంకు సమాచారం ఇవ్వలేదని, సొమ్మును పొదుపు ఖాతాలోనూ జమ చేయలేదని ఆయన ఫిర్యాదు చేశారు. బ్యాంకు ఆన్‌లైన్‌ పోర్టల్‌ను పరిశీలించగా, డిపాజిట్‌ మెచ్యూరిటీ తేదీని 2028 డిసెంబరు 12గా చూపడంతోపాటు వడ్డీ రేటును సున్నాగా పేర్కొన్నట్లు తెలిపారు. దీంతో డిపాజిట్‌ ఆటోమేటిక్‌గా రెన్యువల్‌ అయినట్లు వివరించారు.

బ్యాంకు వాదనను తోసిపుచ్చిన కమిషన్‌

మెచ్యూరిటీ అనంతరం పొడిగింపునకు ఖాతాదారుడు నిర్ణీత గడువులో దరఖాస్తు చేయలేదని ఎస్‌బీఐ వాదించింది. పోర్టల్‌లో సున్నా వడ్డీ కనిపించడం సాంకేతిక లోపమని పేర్కొంది. అయితే, మెచ్యూరిటీ సమాచారం, మరో మూడేళ్లపాటు డిపాజిట్‌ను పొడిగించుకునే అవకాశంపై ఖాతాదారుడికి తెలియజేయకపోవడం సేవల్లో లోపమేనని కమిషన్‌ అభిప్రాయపడింది. మెచ్యూరిటీ వరకు ఒప్పందంలోని 8.5 శాతం వడ్డీని, ఆ తర్వాత వాస్తవ చెల్లింపు జరిగే వరకు వర్తించే పొదుపు ఖాతా వడ్డీని చెల్లించాలని ఆదేశించింది. ఉత్తర్వులు అందిన 45 రోజుల్లోగా అమలు చేయాలని పేర్కొన్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఎఫ్‌డీ రసీదులు, మెచ్యూరిటీ తేదీలు, బ్యాంకుతో జరిపిన సమాచార మార్పిడికి సంబంధించిన ఆధారాలను ఖాతాదారులు భద్రపరచుకోవాల్సిన అవసరాన్ని ఈ కేసు గుర్తుచేస్తోంది.

ఇదీ చదవండి: ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నా ఆస్తి ఇవ్వాలా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement