అప్రమత్తంగా...  శక్తిమంతంగా... | Richa Hukumchand and Vinay Hukumchand builds hybrid satellite and terrestrial Quantum Key Distribution | Sakshi
Sakshi News home page

అప్రమత్తంగా...  శక్తిమంతంగా...

Nov 28 2026 1:38 AM | Updated on Nov 28 2026 1:38 AM

Richa Hukumchand and Vinay Hukumchand builds hybrid satellite and terrestrial Quantum Key Distribution

టెక్నో ఉమెన్‌

‘దేశం క్వాంటం శకానికి సిద్ధమయ్యే కాలం ఆసన్నమైంది’ అంటున్నారు ప్రమత్ర స్పేస్‌ టెక్‌ వ్యవస్థాపకురాలు రీచా హుకుంచంద్‌. డీఆర్‌డీవోలో సైంటిస్ట్‌గా, పిక్సెల్‌ స్పేస్‌లో సీఐవోగా పనిచేసిన రీచ, వినయ్‌ హుకుమ్‌చంద్‌తో కలిసి బెంగళూరు కేంద్రంగా ప్రమత్ర డీప్‌ టెక్‌ స్టార్టప్‌ను ప్రారంభించారు. పోస్ట్‌–క్వాంటం క్రి΄్టోగ్రఫీ (పీక్యూసీ), క్యూకెడీ(క్వాంటమ్‌ కీ డిస్ట్రిబ్యూషన్‌) సమ్మేళనమే... ప్రమత్ర కోర్‌ టెక్నాలజీ.


క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్‌ అంటే...
హ్యాక్‌ చేయడానికి వీలులేని క్వాంటం ఎన్‌క్రిప్షన్‌ కీలను రూపొందించడానికి, రహస్యంగా వినడాన్ని గుర్తించడానికి లోఎర్త్‌ ఆర్బిట్‌ (ఎల్‌ఈవో) ఉపగ్రహాలపై ఇంటిగ్రేటెడ్‌ ఫొటోనిక్స్‌ను ఉపయోగించి చిప్‌ ఆధారిత ‘క్యూకేడీ’ని అభివృద్ధి చేయడమే క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్‌. సురక్షిత కమ్యూనికేషన్‌ల కోసం హైబ్రిడ్‌ ఉపగ్రహ వ్యవస్థలను నిర్మిస్తోంది ప్రమత్ర కంపెనీ. పెరుగుతున్న సైబర్‌ ముప్పుల నుంచి కంపెనీలను రక్షించడానికి ‘క్యూకేడీ’ అనేది అదనపు భద్రతావ్యవస్థగా పనిచేస్తుంది.

కుటుంబ బలం
‘జీవితంలో కొత్త మార్గంలో ప్రయాణించే మహిళలకు బలం...కుటుంబ ప్రోత్సాహం. డీఆర్‌డీవో నుండి బయటికి వచ్చిన తరువాత తల్లిదండ్రులు, భర్త, అత్తమామలు నాకు అండగా నిలబడ్డారు. వారికి క్వాంటం టెక్నాలజీ పూర్తిగా అర్థం కాకపోయినా, నన్ను అర్థం చేసుకోగలరు. నా విజయాలను ఆస్వాదించగలరు’ అంటున్నారు రీచా హుకుంచంద్‌.
భవిష్యత్‌కు సంబంధించి సురక్షిత కమ్యూనికేషన్‌ వ్యవస్థలు, స్వదేశీ డీప్‌–టెక్‌ ఆవిష్కరణలపై పని చేస్తున్నారు రీచ.

సాంకేతికతకు లింగభేదం లేదు
‘సాంకేతికతకు లింగభేదం లేదు. క్వాంటం కంప్యూటింగ్‌ లాంటి అధునాతన రంగాలలో మహిళలు విజయం సాధించగలరు. నాకు ఉన్న నలుగురు సలహాదారులలో ఇద్దరు మహిళలు నా ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారు’ అంటున్నారు రీచ.
తొమ్మిదో తరగతిలో గణితం, భౌతిక శాస్త్రంపై ఆసక్తి పెంచుకున్నారు రీచ. ఆ ఆసక్తే ఆమెను ఉన్నత పదవులు చేపట్టేలా, సొంతంగా టెక్‌–స్టార్టప్‌ ప్రారంభించేలా చేసింది.

సవాళ్లు ఎదుర్కొంటూ...
‘సవాళ్లను ఎదుర్కోవడం అనేది మనల్ని మరింత బాధ్యతాయుతంగా తీర్చిదిద్దుతుంది’ అంటున్న రీచ ఎన్నో సవాళ్లను అధిగమించి, అనుభవాలనే పాఠాలుగా చేసుకొని టెక్‌ ప్రపంచంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

భవిష్యత్‌ కోసం...
టెక్‌ కంపెనీల వ్యవస్థాపకులు వర్తమాన సమస్యలను పరిష్కరించడమే కాదు భవిష్యత్‌ కాల సమస్యలను పరిష్కరించడానికి కూడా నడుం కట్టాలి. ఈ నేపథ్యంలో ‘ప్రమత్ర’ పరిశోధనలు శాస్త్రప్రపంచానికి కీలకంగా మారనున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement