నయా ట్రెండ్!
సోషల్ మీడియా
నేను మీ ఆరాధ్య తేజస్వీ. ఇప్పుడు టైమ్ మార్నింగ్ ఆరున్నర అవుతుంది. మా చింటుగాడిని ఎలా నిద్రలేపుతానో చూడండి. చూశారు కదా... ఇప్పుడు మా ఆయన దగ్గరికి వెళదాం. జిమ్‌కు వెళ్లకుండా సెల్‌ఫోన్ చూసుకుంటూ కూర్చున్నారు. ఆయనను జిమ్‌కు ఎలా పంపుతానో చూడండి. చూశారు కదా...ఇప్పుడు మా వంట ఇంట్లోకి వెళదాం....’ ...ఇలాంటి రీల్స్ చూసి ‘మీ ఇంటి విషయాలు మాకెందుకమ్మా’ అని చాలామంది అనుకుంటారుగానీ...ఇప్పుడిదే...హాటెస్ట్ లేటెస్ట్ ట్రెండ్...ట్రాడ్–వైఫ్ ఇన్‌ఫ్లూయెన్సర్ ట్రెండ్!
ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన వైశాలి కర్మాకర్ ఇంటి బాధ్యతల బరువు పెరగడంతో ఉద్యోగం వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆమె కంటెంట్ క్రియేటర్‌గా ఆదాయం సంపాదిస్తోంది. ఆ కంటెంట్ వినోదం, విజ్ఞానానికి సంబంధించినది కాదు...చాలా సింపుల్!
ఇంట్లో సాధారణంగా కనిపించే దృశ్యాలే ఆమె వీడియోలలో కనిపిస్తాయి.
ఉదా: అల్పాహారం తయారుచేయడం, భర్తను పనికి సాగనంపడం, మధ్యాహ్నం అతని కోసం భోజనం వండడంలాంటివి. కంటెంట్‌కు సంబంధించిన బ్రాండ్‌ల సహకారంతో వైశాలి కర్మాకర్ ఆదాయం సంపాదిస్తుంది. వైశాలి వీడియోలకు ‘కోడలి ప్రేమజీవితం’ అనే ట్యాగ్‌లైన్ కనిపిస్తుంది.
→ జీవితం అనే కలలో!
‘పెళ్లయిన అమ్మాయిగా నా జీవితంలో ఒకరోజు’ అనే ట్యాగ్‌లైన్‌తో తనిష్క అనే యువతి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో పాపులర్ అయింది. ఈ వీడియోలో ఆమె టీ, అల్పాహారం తయారు చేస్తూ కనిపిస్తుంది. వంట గదిలోకి వెళ్లి పాత్రలు కడుగుతుంది. ఉదయం తొమ్మిది గంటల లోపు ఆమె చేసే పనులు స్క్రీన్‌పై కనిపిస్తాయి. తనిష్క తన ఇంటి పనులు చేస్తున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో పాత హిందీ పాట ఒకటి వినిపిస్తూ ఉంటుంది. ఆ పాట అర్థం... ‘జీవితం అనేది ఒక కల. ఆ కలలో నిజానిజాల మధ్య ఎలాంటి తేడా ఉండదు. తనిష్క అప్‌లోడ్ చేసిన ఈ ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ను 12 మిలియన్‌ల మందికి పైగా వీక్షించారు.
→ ఒక ఉదయం...ఒకరోజు!
వైశాలి కర్మాకర్, తనిష్కలు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఎంతోమంది యువ మహిళలు ట్రాడ్–వైఫ్ ఇన్çఫ్లుయెన్సర్లుగా ఆదాయం సంపాదిస్తున్నారు. వారి కంటెంట్ పెళ్లిపనులు, ఇంటి నిర్వహణ, ఇంటి బాధ్యతలపై కేంద్రీకృతమై ఉంటుంది. ‘21 ఏళ్ల వివాహిత జీవితంలో ఒక ఉదయం’ ‘20 ఏళ్ల వివాహిత జీవితంలో ఒకరోజు’లాంటి ట్యాగ్‌లైన్‌తో ఈ వీడియోలు మిలియన్‌ల కొద్దీ వ్యూస్‌ను సొంతం చేసుకుంటున్నాయి. వంట చేయడం నుంచి ఇళ్లు శుభ్రం చేయడం వరకు... ఇంటిపనులను డాక్యుమెంట్ చేసే వీడియోలలో చాలామంది ‘పెళ్లయిన అమ్మాయిగా నా జీవితంలో ఒకరోజు’ ట్యాగ్‌లైన్‌ను ఉపయోగిస్తున్నారు.
→ ట్రాడ్–వైఫ్ అంటే?
ట్రాడ్–వైఫ్ అనేది ‘ట్రెడిషనల్ వైఫ్’ అనే పదానికి సంక్షిప్త రూపం. కొన్నిసంవత్సరాల క్రితం ఆన్‌లైన్‌లో పుట్టిన పదమే ఈ ట్రాడ్–వైఫ్. సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా వ్యాప్తి చెందింది. ట్రాడ్–వైఫ్ ఇన్‌ఫ్లూయెన్సర్‌లు తమ రోజువారీ గృహకార్యకలాపాలను రికార్డ్ చేసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తారు. వీటికి విశేషమైన ఆదరణ లభిస్తోంది.
→ ఎస్టర్ ఇయర్
అమెరికన్ ట్రాడ్–వైఫ్ ఇన్‌ఫ్లూయెన్సర్‌లపై యెస్టర్ ఇయర్(2026) అనే నవల వచ్చింది. క్లరో కైర్ బ్లర్క్ రాసిన తొలి నవల ఇది. ఈ నవలలో కథానాయిక నటాలీ హెల్లర్ మిల్స్ అంకితభావం గల భార్య, తల్లి, గృహిణిగా ఆన్‌లైన్‌లో విశేషమైన గుర్తింపు పొందుతుంది. వంట చేయడం, పిల్లలను పెంచడం, భర్తను చూసుకోవడం...ఆమె వీడియోలలో కనిపించే ప్రధాన కంటెంట్. సోషల్ మీడియాలో విశేష ఆదరణ పొందిన నటాలీ ఉన్నట్టుండీ 1805 కాలంలోకి వెళుతుంది. ఈ కాలంలో మాదిరిగా ఆ కాలంలో ఎలాంటి సౌకర్యాలు ఉండవు. నటాలీ పడిన కష్టాలు ఇన్నీ అన్నీ కావు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ట్రాడ్–వైఫ్ ఇన్‌ఫ్లూయెన్సర్‌ల ట్రెండ్‌పై వ్యంగ్యంగా రాసిన నవల ఇది. ఈ నవలపై ఎంతో చర్చ జరిగింది.
→ పాత భావజాలం...కొత్త రూపంలో!
ట్రాడ్–వైఫ్ ఇన్‌ఫ్లూయెన్సర్ ట్రెండ్‌పై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మహిళలకు సంబంధించిన ఇంటి పనుల భారాన్ని ట్రాడ్– వైఫ్ ట్రెండ్ గ్లామరైజ్ చేస్తూ, వారిని ఉద్యోగాలకు వెళ్లకుండా చేస్తుంది అనేది ఒక ప్రధాన విమర్శ. ‘ఆడపిల్లలు ఇంటికే పరిమితం కావాలి అనే పాతభావజాలాన్ని ఆధునీకీకరించిన ట్రెండ్’ అనే విమర్శ కూడా ఉంది.
చాలా కుటుంబాలలో భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేయడం అనేది లగ్జరీ కాదు... తప్పనిసరి అవసరం. అయితే ఈ ట్రెండ్ పుణ్యమా అని ‘మహిళలు ఇంటి పనులు చేస్తే చాలు... భర్తకు సహాయంగా ఉంటే చాలు’ అనే భావన ప్రచారం అయ్యే ప్రమాదం ఉంది అంటున్నారు.
ట్రాడ్–వైఫ్ ఇన్‌ఫ్లూయెన్సర్ ట్రెండ్‌ను సమర్థించేవారు ఇలా అంటున్నారు....
‘21వ శతాబ్దం స్త్రీలను వారి సహజ స్వభావానికి దూరం చేసింది. ఈ నేపథ్యంలో ట్రాడ్–వైఫ్ ట్రెండ్ అనేది మహిళలు సంప్రదాయ వ్యవస్థలోకి వెళ్లేలా చేస్తుంది’
మరి మీరు ఏం అంటారు?!
ఇంటి బాధ్యతలు... ఇంకా సమానత్వం రాలేదు!
మన దేశంలో పనిచేసే మహిళల సంఖ్య ఎనిమిదేళ్లలో దాదాపు రెట్టింపు అయింది. 2025 నాటికి 20.1 కోట్లకు చేరుకుంది. అయినప్పటికీ, ఇంటిబాధ్యతలను మహిళలే ఎక్కువగా మోస్తున్నారు. పురుషులతో పోలిస్తే ఇంటిపనుల కోసం అయిదు గంటలు ఎక్కువ సేపు అదనంగా వెచ్చిస్తున్నారు. ఉద్యోగం చేసే మహిళల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వేతనం లేని ఇంటిబాధ్యతల భారం తగ్గలేదు.
ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిషలేషన్స్ రూపొందించిన ‘పార్టిసిపేషన్ పారడాక్స్’ నివేదిక ప్రకారం భారతదేశంలో పనిచేసే మహిళల సంఖ్య 2017–18లో 10.4 కోట్లు ఉండగా, 2025 నాటికి అది 20.1 కోట్లకు పెరిగింది. ఇదే కాలంలో మొత్తం శ్రామికశక్తిలో మహిళల వాటా 22 శాతం నుండి 38 శాతానికి చేరుకుంది. వేతనంతో కూడిన ఉపాధి పనులలో మహిళల భాగస్వామ్యం పెరిగినప్పటికీ ఇంటిబాధ్యతల పంపిణీలో మాత్రం సమానత్వం రాలేదు.
మహిళలు ఇంటి పనుల కోసం రోజూ సగటును 464 నిమిషాలు గడుపుతుండగా, పురుషులు మాత్రం 178 నిమిషాలు గడుపుతున్నారు. విశ్రాంతి కోసం అందుబాటులో ఉండే సమయంలో కూడా అసమానత కనిపిస్తోంది. స్త్రీ,పురుషుల మధ్య అంతరం 2019లో 57 నిమిషాల నుండి 2024 నాటికి 70 నిమిషాలకు పెరిగింది. ఇంటిబాధ్యతలు, పిల్లల పెంపకం మహిళల ఉపాధికి ప్రధాన అడ్డంకిగా మారాయి.
– యాకుబ్ పాషా


