రూ.కోట్లు కుమ్మరించి పబ్లిసిటీ షో! | CII Partnership Summit fails miserably to attract investments | Sakshi
Sakshi News home page

రూ.కోట్లు కుమ్మరించి పబ్లిసిటీ షో!

Nov 14 2026 5:20 AM | Updated on Nov 14 2026 5:20 AM

CII Partnership Summit fails miserably to attract investments

పెట్టుబడుల సదస్సా? బాబు, లోకేశ్‌ ఇమేజ్‌ బిల్డప్‌ కార్యక్రమమా?

పారిశ్రామిక దిగ్గజాల జాడేది? సెలబ్రిటీలతోనే మమ 

ఇన్‌ఫ్లుయెన్సర్లు.. సదస్సు ప్రాంగణంలో రీల్స్, వీడియోలు 

ప్రతిష్టాత్మక సదస్సు అంటూనే చౌకబారు ప్రచారాలు 

రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడుల లెక్కలపై స్పష్టత కరువు 

పాత పెట్టుబడి ఒప్పందాలకే కొత్త రంగులు 

పరిశ్రమల మంత్రి టీజీ భరత్‌ను పక్కకు నెట్టి లోకేశ్‌ హడావుడి 

రాత్రికి సూర్యరశ్మి, అంతరిక్షం నుంచి కరెంటు.. బాబు వ్యాఖ్యలపై నెటిజన్ల సెటైర్లు

సాక్షి, అమరావతి: వందల కోట్ల రూపాయల ప్రజాధనంతో అట్టహాసంగా నిర్వహించిన రెండు రోజుల సీఐఐ భాగస్వామ్య సదస్సు పారిశ్రామిక దిగ్గజాలను ఆకర్షించడంలో ఘోరంగా విఫలమయ్యింది. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావడం, తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా జరగాల్సిన సదస్సును ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్‌ వ్యక్తిగత ప్రచార వేదికగా మార్చుకోవడంపై పారిశ్రామిక వేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్ర­ము­ఖ పారిశ్రామికవేత్తలతో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనపై చర్చించాల్సిన వేదికపై సినీ, మీడి­యా ప్రముఖులతో పాడ్‌కాస్ట్‌లు, ఫైర్‌సైడ్‌ చాట్‌లు, ఇంటర్వ్యూలకే పెద్దపీట వేయడం విస్మయం కలిగించింది. 

మెగా కుటుంబానికి చెందిన రామ్‌చరణ్‌ భార్య ఉపాసనతో ఒకరోజు నారా లోకేశ్‌ పాడ్‌కాస్ట్‌ నిర్వహించగా.. మరుసటి రోజు సినీ నటుడు దగ్గుబాటి రానాతో మరో పాడ్‌కాస్ట్‌ చేశారు. తానేమీ తక్కువ కాదన్నట్లు చంద్రబాబు ప్రముఖ జర్నలిస్టు పాల్కీ శర్మతో ఫైర్‌సైడ్‌ చాట్‌లో పాల్గొని దానికి సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించారు. అనంతరం టైమ్‌ ఇంటర్నేషనల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డామియన్‌ డగ్గన్, బ్లూమ్‌బెర్గ్‌ సహా పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. పెట్టుబడుల ఆకర్షణ కంటే తమ వ్యక్తిగత ఇమేజ్‌ పెంచుకోవడానికే బాబు, లోకేశ్‌ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. 

అంతేకాదు.. రెండు రోజుల సదస్సులో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌కు తగిన ప్రాధాన్యత లేకుండా నారా లోకేశ్‌ అంతా తానై వ్యవహరించడంపైనా చర్చ జరిగింది. తన శాఖ పరిధిలోని అంశాలకే పరిమితం కాకుండా ఇతర శాఖలకు సంబంధించిన ఒప్పందాలు, కార్యక్రమాల్లోనూ లోకేశ్‌ ముందుండటంతో పరిశ్రమల శాఖ మంత్రి పాత్ర ఏమిటన్న ప్రశ్నలు తలెత్తాయి. సంబంధిత శాఖల మంత్రులు, అధికారుల పాత్రను పక్కకు నెట్టి లోకేశ్‌ తన ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 

పాత ఒప్పందాలతో మమ... 
కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో గతంలో ప్రకటించిన పెట్టుబడి ప్రతిపాదనలనే తిరిగి తెరపైకి తెచ్చి కొత్త ఒప్పందాలుగా ప్రచారం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న రెన్యూ పవర్, మేఘా ఇంజినీరింగ్, గ్రీన్‌కో, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, కియా, జేఎస్‌డబ్ల్యూ, మాండలీజ్, గెయిల్‌ ఇండియా వంటి సంస్థలకు సంబంధించిన గత పెట్టుబడి ప్రకటనలనే తాజా సదస్సులోనూ ప్రస్తావించారు. 

రెండు రోజుల సదస్సు ద్వారా 303 ప్రాజెక్టుల రూపంలో రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ ప్రతిపాదనల్లో గతంలోనే ప్రకటించిన ప్రాజెక్టులు ఎన్ని? నిజంగా కొత్తగా వచ్చిన పెట్టుబడులు ఎన్ని? ఇప్పటికే ఒప్పందాలు కుదిరినవాటిలో మళ్లీ ప్రస్తావించినవి ఎన్ని? అన్న వివరాలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 2023లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో నిర్వహించిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో ప్రకటించిన కొన్ని పెట్టుబడి ప్రతిపాదనలే ఇప్పుడు మళ్లీ తెరపైకి వ­చ్చాయన్న ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. 

గత రెండు నెలలుగా దేశ, విదేశాల్లో విస్తృత ప్రచా­రం నిర్వహించి, ప్రకటనలు గుప్పించినా అంతర్జా­తీయ పారిశ్రామిక దిగ్గజాల భాగస్వామ్యం ఆశించిన స్థాయిలో లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చ­కు దారితీసింది. విశాఖకు ప్రపంచస్థాయి పారిశ్రామికవేత్తలు వస్తారని, వారి అనుభవాలను ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చని ఆశించిన ఔత్సాహిక పారిశ్రామికవేత్త­ల­కు నిరాశే ఎదురైందన్న అభి­ప్రాయాలు వ్యక్తమయ్యాయి. 

బాబు వ్యాఖ్యలతో మరింత డ్యామేజ్‌! 
పెట్టుబడులను ఆకర్షించి చంద్రబాబు ఇమేజ్‌ను పెంచాలన్న లక్ష్యంతో నిర్వహించిన సదస్సు చివరకు ఆయన వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో ప్రతికూల ప్రచారానికి వేదికగా మారింది. రాత్రిపూట కూడా సూర్యరశ్మి అందిస్తామన్న ప్ర­క­టన, అంత­రి­క్షం నుంచి లేజర్‌ ద్వారా విద్యుత్‌ సరఫరా చేస్తామ­న్న హామీ, అమరావతిలో 3 వేల క్యూ­బిట్ల క్వాంటం కంప్యూటర్ల తయారీ వంటి వ్యాఖ్యలపై నెటిజన్లు సెటైర్ల మీద సెటైర్లు గుప్పించారు. ఈ విమర్శలపై చంద్రబాబే స్వయంగా విలేకరుల సమావేశంలో ప్రస్తావించి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

పెట్టుబడుల సదస్సు ద్వారా రాష్ట్రానికి ఎంత కొత్త పెట్టుబడి వచ్చింది? ఎన్ని పరిశ్రమలు వాస్తవంగా ఏర్పాటవుతాయి? యువతకు ఎన్ని ఉ­ద్యోగాలు లభి­స్తాయి? గతంలో కుదిరిన ఒప్పందా­ల్లో ఎన్ని కార్యరూపం దాల్చాయి? అన్న ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వాల్సి ఉండగా.. ప్రచారార్భాటం, సెలబ్రిటీల హడావిడి, పాత ఒప్పందా­ల పునరావృతమే ప్రధాన చర్చగా మారడంతో ఈ సదస్సు నిర్వహణ విమర్శలకు కారణమయ్యింది.

చిరాకు పెట్టించిన ఇన్‌ఫ్లుయెన్సర్ల హడావుడి! 
సీఐఐ భాగస్వామ్య సదస్సు చరిత్రలోనే ఎన్నడూ లేని రీతిలో ఈసారి సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల హడావుడి కనిపించింది. ప్రభుత్వ ప్రచారం కోసం పెద్ద సంఖ్యలో ఇన్‌ఫ్లుయెన్సర్లను తీసుకురావడంతో సమావేశ ప్రాంగణం, ఎగ్జిబిషన్‌ కౌంటర్లు, బయట ఏర్పాటు చేసిన లాంజ్‌లు వీడియో షూటింగ్‌ కేంద్రాలుగా మారిపోయాయి. ఎవరికి వారు కెమెరాలు పట్టుకుని వీడియోలు తీస్తూ, రీల్స్‌ చేస్తూ తిరగడంతో సదస్సు నిర్వహణలోని సీరియస్‌నెస్‌ దెబ్బతిన్నదన్న విమర్శలు వినిపించాయి. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో కీలక చర్చలు జరగాల్సిన ప్రాంగణంలో ప్రచార హడావుడికే ప్రాధాన్యత ఇవ్వడం పట్ల అసంతృప్తి వ్యక్తమైంది. 

శుక్రవారం ఉదయం 11 గంటలు దాటిన తర్వాత సమావేశ హాళ్లు వెలవెలబోయాయని, ఆశించిన స్థాయిలో పారిశ్రామిక ప్రతినిధుల సందడి కనిపించలేదని స్థానిక వర్గాలు పేర్కొన్నాయి. గతంలో జరిగిన సీఐఐ సదస్సులతో పోలిస్తే ఈసారి పారిశ్రామిక దిగ్గజాల భాగస్వామ్యం, సమావేశాల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తమైంది. దిగ్గజ పారిశ్రామికవేత్తలను ప్రత్యక్షంగా కలుసుకుని వారి అనుభవాల నుంచి ప్రేరణ పొందాలన్న ఆశతో వచ్చిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు నిరాశతో వెనుదిరగడం కనిపించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement