బియ్యం ఎక్కువగా తినడం వల్లే రాష్ట్రంలో మధుమేహం అధికమంటూ సీఎం విశ్లేషణ
షుగర్ రోగులు పెరగడంతో పంచదార వినియోగం తగ్గిందని వ్యాఖ్య
చెరకు సాగు తగ్గుదల, సహకార చక్కెర కర్మాగారాల మూతపై వింత వివరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజలు బియ్యం ఎక్కువగా తినడం వల్లే మధుమేహ బాధితులు అధికమయ్యారని, దీంతో పంచదార వినియోగం తగ్గి చక్కెర కర్మాగారాలు మూతపడ్డాయని సీఎం చంద్రబాబు నాయుడు విశ్లేషించారు. ఉత్తరాంధ్రలో చెరకు సాగు విస్తీర్ణం తగ్గడం, సహకార చక్కెర కర్మాగారాలు మూతపడటంపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సీఎం ఈ మేరకు స్పందించారు. రెండు రోజుల సీఐఐసీ పార్టనర్‌షిప్ సమావేశ వివరాలను తెలియచేయడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
ప్రజల ఆహారపు అలవాట్లు మారుతున్నాయని, వాటికి అనుగుణంగా పంటల సాగులోనూ మార్పులు రావాలని సూచించారు. పంచదార వినియోగం తగ్గిందని, పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలిపి వినియోగించడం వల్ల వాహనాల ఇంజన్లు దెబ్బతినే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఉద్యానవన, ఆక్వాకల్చర్ రంగాలను భారీగా ప్రోత్సహిస్తామని తెలిపారు.
హామీలన్నీ నెరవేర్చాం..
రాష్ట్రంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినందునే తమ ప్రభుత్వంపై నమ్మకంతో ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారని చంద్రబాబు పేర్కొన్నారు. రాజకీయాల్లో డబ్బు పనిచేయదని స్థానిక సంస్థల ఎన్నికలు నిరూపించాయని చెప్పారు. ఎక్కడా డబ్బులు పంచవద్దని తమ పార్టీ కార్యకర్తలకు స్పష్టంగా సూచించానని, సుపరిపాలనకు మద్దతుగా ప్రజలు తీర్పునిచ్చారని వ్యాఖ్యానించారు.
పారిశ్రామిక రాయితీల కోసం ఏర్పాటు చేసిన ఎస్క్రో ఖాతా పాత బకాయిలకు వర్తించదని సీఎం స్పష్టం చేశారు. ఇకపై వచ్చే కొత్త రాయితీలకు మాత్రమే ఈ విధానం వర్తిస్తుందని తెలిపారు. పరిశ్రమల రక్షణ కోసం కొత్తగా రూపొందిస్తున్న చట్టాన్ని రాష్ట్ర శాసనసభలో ఆమోదించి కేంద్రానికి పంపిస్తామని, పార్లమెంటు ఆమోదం లభించిన తర్వాతే అది అమల్లోకి వస్తుందని వివరించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
రెండు రోజులపాటు సదస్సు
అంతకుముందు సీఐఐ భాగస్వామ్య సదస్సు ముగింపు సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. రెండు రోజుల సదస్సు ద్వారా రాష్ట్రానికి 303 ప్రాజెక్టుల రూపంలో రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చినట్లు వెల్లడించారు. స్వచ్ఛ షహర్ కేటగిరీలో దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా విశాఖపట్నం నిలవడం గర్వకారణమని పేర్కొన్నారు. ఇలాంటి అద్భుతమైన నగరంలో సీఐఐ భాగస్వామ్య సదస్సును నిర్వహించుకున్నామని తెలిపారు. ‘నేవిగేటింగ్ ద న్యూ వరల్డ్ ఆర్డర్’ ఇతివృత్తంతో వాణిజ్యం, సాంకేతికత, విశ్వసనీయత, ఆలోచనా నాయకత్వం వంటి అంశాలపై రెండు రోజుల పాటు సదస్సు జరిగిందన్నారు.
వివిధ దేశాల ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, కేంద్ర మంత్రులు ఇందులో పాల్గొన్నారని వివరించారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికీ పెట్టుబడులను తీసుకురావడంతో పాటు ప్రతిపాదిత ప్రాజెక్టులను కార్యరూపంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని చెప్పారు. సీఐఐ భాగస్వామ్య సదస్సుతో పాటు ఆరు సన్నాహక సమావేశాల ద్వారా పెట్టుబడులను ఆకర్షించామని తెలిపారు. చేనేత క్లస్టర్ల నుంచి ఏరోస్పేస్, రక్షణ, ఎలక్ట్రానిక్స్ రంగాల వరకు వివిధ పరిశ్రమల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు.


