ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లపై వైఎస్ జగన్ మండిపాటు
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి ఉరితాడు బిగించింది మీరే
ఆ ఉరితాడు ఇప్పుడు అమాయక విద్యార్థుల ప్రాణాల మీదకు వస్తోంద
ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన పథకాలను నిర్వీర్యం చేశారు
బంగారం లాంటి పేద పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు.. వారి చదువుల ఉసురు పోసుకుంటున్నారు
ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన పథకాల కింద రూ.9,600 కోట్లకుపైగా బాకీఇంత బకాయిలు పెడితే పేదపిల్లల చదువులకు భరోసా ఎక్కడ? వారెలా చదువుకోవాలి?.. పేద పిల్లల చదువులతో, భవిష్యత్తుతో, చివరకు వారి ప్రాణాలతో ఆడుకునే హక్కు మీకెవరిచ్చారు?
విద్యార్థిని ఆత్మహత్యాయత్నాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానండి
విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు వెంటనే చెల్లించండి
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల చిత్తూరులోని ప్రైవేటు కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితికి సీఎం చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి లోకేశ్ వైఖరే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేశ్‌లు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి ఉరితాడు బిగించారని, అది ఇప్పుడు అమాయక విద్యార్థుల ప్రాణం మీదకు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పేద పిల్లల చదువులతో, భవిష్యత్తుతో, చివరకు వారి ప్రాణాలతో ఆడుకునే హక్కు మీకెవరిచ్చారు? అంటూ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. విద్యార్థి ని ఆత్మహత్యాయత్నాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానాలని హితవు పలికారు. విద్యా దీవెన, వసతి దీవెన కింద బాకీ పడిన రూ.9,600 కోట్లను తక్షణమే చెల్లించాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..
ఇంత దుర్మార్గమైన పాలన ఎప్పుడూ చూడలేదు
‘నారా చంద్రబాబునాయుడు గారూ.. చిత్తూరులోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి మీరు, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి, మీ సుపుత్రుడు లోకేశ్ కారణం కాదా? ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి మీరిద్దరూ మీ చేతులతో ఉరితాడు బిగిస్తే, అదే ఉరితాడు ఇప్పుడు అమాయక విద్యార్థుల ప్రాణాల మీదకు వస్తోంది. ఈ దారుణమైన పరిస్థితికి ముమ్మాటికీ మీరే బాధ్యులు. ప్రభుత్వం ఫీజులు కట్టక పోవడంతో తమకు ఈ దుస్థితి వచ్చిందని, ఇదే కాలేజీలో గతంలో కూడా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ విద్యార్థులు రోడ్డెక్కి తమ ఆవేదనను, ఆగ్రహాన్ని వెళ్లగక్కినా అసలు ఏమీ పట్టనట్టే ఉన్నారు. పైగా టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మీరు, మీ కుమారుడు బాధ్యతలను పూర్తిగా వదిలేయడం అత్యంత దారుణం. ఇంత దుర్మార్గమైన పాలన గతంలో ఎప్పుడూ చూడలేదు.
పేద పిల్లల ప్రాణాలతో ఆడుకునే హక్కు మీకెవరిచ్చారు?
పేదవాళ్లకు గొప్ప చదువులే లక్ష్యంగా అమ్మ ఒడి నుంచి విద్యా దీవెన, వసతి దీవెన పథకాలతో దేశంలో ఎక్కడా లేని విధంగా గొప్పగా మేం ప్రారంభించి అమలు చేస్తే, మీరు అధికారంలోకి వచ్చిన తొలి క్షణం నుంచే పేదలను ఉన్నత చదువులకు దూరం చేసే కుట్రలో భాగంగా, ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన పథకాలను నిర్వీర్యం చేశారు. బంగారం లాంటి పేద పిల్లల భవిష్యత్తును నాశనం చేసి, వారి చదువుల ఉసురు పోసుకుంటున్నారు. ఈ విద్యా సంవత్సరం చివరి వరకు చూసుకుంటే 13 త్రైమాసికాలకుగాను, ప్రతి త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున విద్యా దీవెన కింద ఇవ్వాల్సిన మొత్తం రూ.9,100 కోట్లు.
ఇది కాకుండా 2024 ఏప్రిల్, 2025 ఏప్రిల్, 2026 ఏప్రిల్‌కు గానూ ఒక్కో ఏడాదికి రూ.1,100 కోట్ల చొప్పున మూడేళ్లకు ఇవ్వాల్సిన వసతి దీవెన బకాయిలు రూ.3,300 కోట్లు. మొత్తంగా ఈ రెండు పథకాలకు ఖర్చు చేయాల్సింది రూ.12,400 కోట్లు. అయితే ఇప్పటి వరకు ఇచ్చింది ఎంత అని చూస్తే, ఒకసారి రూ.1,700 కోట్లు, ఒకసారి రూ.1,100 కోట్లు. ఇంకా రూ.9,600 కోట్లకుపైగా బాకీ. ఇంత బకాయిలు పెడితే ఇక పేద పిల్లలకు భరోసా ఎక్కడిది? వాళ్లు ఎలా చదువుకోవాలి? వారి చదువులతో, భవిష్యత్తుతో, చివరకు వారి ప్రాణాలతో ఆడుకునే హక్కు మీకెవరిచ్చారు చంద్రబాబు గారూ?
తక్షణమే బకాయిలు చెల్లించాలి
ప్రభుత్వం ఫీజులు చెల్లించక పోవడంతో కాలేజీ యాజమాన్యాలు ఆ భారాన్ని పిల్లలు, వారి తల్లిదండ్రుల మీద మోపుతున్నాయి. తమ ఫీజులను వసూలు చేయడానికి, విద్యార్థులపై ఒత్తిడితెచ్చి, ఫీజులు కట్టకపోతే పరీక్షలు రాయనివ్వమని, సర్టిఫికెట్లు ఇవ్వమని చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చదువులు కొనసాగించలేక కొందరు పనులకు వెళ్తుంటే, ఈ ఒత్తిళ్లు భరించలేక ఇలా ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న వారు ఇంకొందరు.
చంద్రబాబు గారూ.. విద్యా శాఖను సర్వం భ్రష్టు పట్టించిన మీ సుపుత్రుడిని వెంటనే బాధ్యతల నుంచి తప్పించండి. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలను తక్షణమే చెల్లించాలి. కాలేజీల్లో విద్యార్థులపై ఒత్తిళ్లను వెంటనే ఆపాలి. విద్యార్థి ఆత్మహత్యాయత్నాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మాని, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు వెంటనే చెల్లించాలి’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.


