4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీల్లో నేటి నుంచి నామినేషన్లు | Nominations begin today in 4 corporations and 19 municipalities | Sakshi
Sakshi News home page

4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీల్లో నేటి నుంచి నామినేషన్లు

Nov 14 2026 5:00 AM | Updated on Nov 14 2026 5:00 AM

Nominations begin today in 4 corporations and 19 municipalities

సాక్షి, అమరావతి: మలి విడత మున్సిపల్‌ ఎన్నికలు జరుగుతున్న 4 నగరపాలక సంస్థలు (కార్పోరేషన్లు), 19 మున్సిపాలిటీల్లో శనివారం ఉదయం 11 గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తెలిపింది. శ్రీకాకుళం నగరపాలక సంస్థలో మేయర్‌ అభ్యర్థుల నామినేషన్లను కార్పొరేషన్‌ కార్యాలయంతో పాటు జిల్లా కలెక్టరేట్‌లోనూ స్వీకరిస్తారు. 

అన్నమయ్య జిల్లా బీ కొత్తకోట మున్సిపాలిటీ చైర్మన్, 23 వార్డులకు మున్సిపల్‌ కార్యాలయంతో పాటు మదనపల్లిలోని అన్నమయ్య జిల్లా కలెక్టరేటులో కూడా నామినేషన్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణం నామినేషన్లను కూడా మున్సిపల్‌ కార్యాలయంతో పాటు ఒంగోలు కలెక్టర్‌ కార్యాలయంలోనూ స్వీకరిస్తారు. మార్కాపురం జిల్లా పొదిలిలోనూ మున్సిపల్‌ కార్యాలయం, మార్కాపురంలోని కలెక్టర్‌ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేయవచ్చని అధికారులు తెలిపారు.  

తొలివిడత మున్సిపల్‌ ఎన్నికలతో పాటు పరిషత్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో చాలా చోట్ల అధికార పార్టీ అల్లరిమూకలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడంతో జిల్లా కలెక్టరేట్లలోనూ నామినేషన్లు తీసుకోవాలని సుప్రీం కోర్టు సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టరు, ఎస్పీలు చర్చించుకొని అవసరమైన చోట జిల్లా కలెక్టరేట్‌లో నామినేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్‌ఈసీ సూచించారు. ఈ సూచన ప్రకారం ఈ నాలుగు చోట్ల నామినేషన్లను కలెక్టరేట్‌లోనూ తీసుకోవాలని నిర్ణయించినట్లు అధికారవర్గాలు తెలిపాయి.   

పల్లెల్లో ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాలు
5 వేల లోపు జనాభా ఉండే గ్రామాలకు రూ.15 లక్షలు ప్రోత్సాహకం 
5 వేల నుంచి 10 వేల లోపు జనాభా ఉంటే రూ. 25 లక్షలు, 10 వేలకు పైబడి ఉంటే రూ. 50 లక్షలు 
ఐదేళ్ల కాలంలో దశలవారీగా ప్రోత్సాహకం విడుదల 
సర్పంచి పదవితో పాటు గ్రామంలోని వార్డులన్నీ ఊరందరి ఏకాభిప్రాయంతో ఏకగ్రీవమవ్వాలి 
బలవంతపు ఏకగ్రీవాలకు తావుండకూడదు 
అర్హులైన వ్యక్తులు పోటీ చేసే హక్కుకు ఎటువంటి ఆటంకం కలిగించకూడదు 
ఆదేశాలు జారీ చేసిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ
సాక్షి, అమరావతి: రాజకీయ పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా జరిగే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచి పదవితో పాటు ఆ గ్రామంలోని వార్డుల పదవులన్నింటికీ ఊరంతా ఏకాభిప్రాయంతో చేసే  ఏకగీవ్రాలకు ఈ ఎన్నికల్లో కూడా ప్రోత్సాహకాలను కొనసాగిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. 

5 వేలకంటే తక్కువ జనాభా ఉండే గ్రామాల్లో సర్పంచి పదవితో పాటు వార్డులన్నీ ఏకగ్రీవమైతే ఆ గ్రామానికి రూ. 15 లక్షలు ప్రభుత్వం ప్రోత్సాహకంగా అందజేస్తుంది. 5,001 నుంచి 10,000 మధ్య జనాభా ఉండే గ్రామాలకు రూ.25 లక్షలు, పది వేలకు పైబడి జనాభా ఉండే గ్రామాలకు రూ.50 లక్షలు చొప్పున ప్రోత్సాహకంగా అందజేయనున్నట్టు ఆ ఆదేశాల్లో పేర్కొంది. ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీకి వచ్చే ఐదేళ్ల కాలంలో దశలవారీగా ప్రోత్సాహకాన్ని అందజేయనున్నట్టు తెలిపింది. 

ప్రోత్సాహకాలకు నిబంధనలివీ.. 
» అర్హులైన వ్యక్తులు పోటీ చేయడానికి ఉన్న చట్టబద్ధమైన హక్కుకు భంగం వాటిల్లకూడదు 
»  ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, స్వతంత్రంగా వినియోగించుకునే హక్కుకు ఎటువంటి ఆటంకం కలిగించకూడదు 
» బలవంతపు ఏకగ్రీవాలకు, బలవంతపు రాజీనామాలకు తావుండకూడదు 
» ప్రోత్సాహకం మొత్తాన్ని విడుదల చేసే ముందు ఆ గ్రామ పంచాయతీలకు అర్హత ఉందో లేదో సంబంధిత అధికారులు పరిశీలించి ధ్రువీకరించాలి 
»  ప్రోత్సాహకం మొత్తాన్ని ఆడిట్‌ విధానాలకు లోబడి కేవలం సంబంధిత గ్రామ పంచాయతీలలో ఆమోదించిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పనుల కోసం మాత్రమే ఉపయోగించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement