రేపటి నుంచి నామినేషన్లు
26న మధ్యాహ్నం వరకు పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు.. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్
రెండో విడతలో 4,960, మూడో విడతలో 4,240 పంచాయతీల్లో ఎన్నికలు
రాజకీయ పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా ఎలక్షన్స్
సాక్షి, అమరావతి: రాజకీయ పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా జరిగే పంచాయతీ పోరు మొదలైంది. రాష్ట్రంలో ఉన్న మొత్తం గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తొలి విడతలో 202 మండలాల పరిధిలోని 3,967 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) అనిల్ చంద్ర పునేఠ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ గ్రామ పంచాయతీల్లో 3,967 సర్పంచి పదవులతో పాటు 40,012 వార్డులకు ఈ నెల 26వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు.
ఈ పంచాయతీల్లో ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్టు తెలిపారు. సర్పంచి పదవికి పోటీ చేసే అభ్యర్థులు రూ.3,000 చొప్పున, వార్డు సభ్యులుగా పోటీ చేసే వారు రూ. 1,000 చొప్పున డిపాజిట్ చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఇందులో సగం చెల్లిస్తే సరిపోతుంది. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం 10 వేల లోపు జనాభా ఉండే పంచాయతీల్లో సర్పంచి పదవికి పోటీ చేసే వారు గరిష్టంగా రూ. 2.50 లక్షలు, వార్డులకు రూ. 60 వేలు, పది వేల జనాభాకు పైబడిన పంచాయతీల్లో సర్పంచి అభ్యర్థులు గరిష్టంగా రూ. 4 లక్షలు, వార్డు అభ్యర్థులు గరిష్టంగా రూ. లక్ష వరకు ఖర్చు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ఎడమ చేతి చిటికిన వేలుపై సిరా గుర్తు
పంచాయతీ ఎన్నికల పోలింగ్‌లో ఓటరు ఎడమ చేతి చిటికిన వేలుపై సిరా గుర్తు వేయాలని ఎస్‌ఈసీ పునేఠ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. సాధారణంగా ఎడమ చేతి మధ్య వేలిపై సిరా గుర్తు వేస్తా రు. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎడమ చేతి మధ్యవేలిపై వేసిన సిరా గుర్తు పూర్తిగా తొలిగిపోదని ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.
తొలి విడత ఎన్నికల షెడ్యూల్
సర్పంచి, వార్డు సభ్యుల నామినేషన్లు స్వీకరణ : 15న ఉదయం 10.30 గంటల నుంచి 17 సాయంత్రం 5 గంటల వరకు
నామినేషన్ల పరిశీలన: 18వ తేదీ ఉదయం 8 గంటల నుంచి తిరస్కరించిన నామినేషన్లపై ఎన్నికల అధికారి వద్ద అప్పీళ్లు: 19వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు
అప్పిలేట్ అథారిటీ వద్ద అప్పీళ్లు, తుది నిర్ణయం: 20 తేదీ
ఉపసంహరణ: 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు
పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ: 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత
పోలింగ్ : 26వ తేదీ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు
ఓట్ల లెక్కింపు: 26వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి
ఉప సర్పంచుల పరోక్ష ఎన్నిక : 26వ తేదీ
ఏదైనా కారణాలతో రీ పోలింగ్ లేదా ఉప సర్పంచి ఎన్నిక వాయిదా పడితే మళ్లీ ఎన్నిక: 27వ తేదీ
వాటిని మినహాయించి..
రాష్ట్రవ్యాప్తంగా 659 మండలాల్లో 13,354 గ్రామ పంచాయతీలుండగా.. కోర్టు కేసులు ఉన్న పంచాయతీలను మినహాయించి మిగిలిన 13,167 పంచాయతీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 2,61,52,377 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.


