బడాయి బాబు.. అర్ధరాత్రి సూరీడు! | Chandrababu Naidu says he will bring sunshine at night | Sakshi
Sakshi News home page

బడాయి బాబు.. అర్ధరాత్రి సూరీడు!

Nov 14 2026 5:09 AM | Updated on Nov 14 2026 5:09 AM

Chandrababu Naidu says he will bring sunshine at night

రాత్రిపూటా సూర్యరశ్మి తెస్తానంటూ విశాఖ సదస్సులో బాబు డాంబికాలు

అమెరికా స్టార్టప్‌ ప్రయోగం తన ఘనతగా చెప్పుకునే బుకాయింపు 

అద్దాలతో వెలుగు వేరు.. లేజర్‌తో కరెంటు వేరు.. ఫ్యాక్ట్‌చెక్‌తో మరింత పరువు తక్కువ 

ఏడేళ్లలో అంతరిక్షం నుంచి ఇంటింటికీ విద్యుత్తంటూ మరో ఆకాశహామీ 

అమరావతిలో మూడేళ్లలో 3 వేల క్యూబిట్ల క్వాంటం కంప్యూటర్ల తయారీ!

బిల్‌గేట్స్‌ నుంచి సత్య నాదెళ్ల వరకు.. అందరి విజయాల వెనుకా బాబేనట! 

చైనాను దాటేస్తామంటూ జోస్యం..పదేళ్లలో నగరాల రూపురేఖలు మారుస్తామంటూ బిల్డప్‌ 

నిరుద్యోగ భృతి, ఉచిత విద్యుత్తుపై మాత్రం నోరుమెదపని బాబు 

ఆకాశంలో అద్భుతాలకు ఆతృత.. నేలమీద హామీలకు పాతర!  

సాక్షి, అమరావతి: సూర్యుడు ఉదయించినా తన వల్లేనని డబ్బా కొట్టుకునే చంద్రబాబు.. ఇక రాత్రికి కూడా సూర్యుడిని తెస్తానంటూ బయలుదేరారు. అంతరిక్షం నుంచి లేజర్‌తో కరెంటు పంపిస్తారట.. అమరావతిలో మూడేళ్లలో 3 వేల క్యూబిట్ల క్వాంటం కంప్యూటర్లు తయారు చేస్తారట! అమెరికాలో ఎవరో చేస్తున్న ప్రయోగం తన ఘనతగా చెప్పుకోవడం.. ఒక టెక్నాలజీ గురించి మాట్లాడి, దాన్ని కప్పి­పుచ్చేందుకు మరో టెక్నాలజీతో ఫ్యాక్ట్‌చెక్‌ చేయించడం.. ఇదీ బాబు మార్కు బిల్డప్‌! 

ప్రపంచాన్ని విస్మయపరిచే ఆవిష్కరణలన్నీ తన ఖాతాలో వేసుకునే ఆతృతలో ఆకాశాన్నే అందుకుంటున్న ముఖ్యమంత్రి.. నేలమీద ప్రజలకు ఇచ్చిన హామీల దగ్గరకు వచ్చేసరికి మాత్రం పత్తా లేకుండా పోతున్నారు. ఇంటింటికీ నిరుద్యోగ భృతి ఇవ్వలేని బాబు.. అంతరిక్షం నుంచి ఇంటింటికీ కరెంటు ఇస్తారట! ప్రజల సమస్యలకు పరిష్కారం చూపలేని పాలన.. ప్రగల్భాలతో మాత్రం గెలాక్సీలను దాటేస్తోంది. 

ఉతికి ఆరేసిన సోషల్‌ మీడియా 
బాబు మాటలపై సోషల్‌ మీడియా ఒక ఆట ఆడుకో­వడంతో ఆయన వందిమాగధులు రంగంలోకి దిగా­రు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ‘రిఫ్లెక్ట్‌ ఆర్బిటల్‌’ అనే స్టార్టప్‌ గురించే బాబు చెప్పారంటూ బుకాయించారు. భూ కక్ష్యలో భారీ అద్దాల ఉపగ్రహాలు పెట్టి, రాత్రి పూట ఐదు కిలోమీటర్ల మే­ర వెలుగు ప్రసరింపజేయాలనేది ఆ సంస్థ ప్రయో­గం. ఆ వెలుగు కూడా సూర్యుడిలా ఉండదు, పౌర్ణ­మి నాటి వెన్నెల స్థాయిలోనే ఉంటుంది. గంట వెలుగుకు దాదాపు రూ.4.6 లక్షలు ఖర్చవుతుందని అంచనా. 

ప్రయోగం అమెరికాది.. క్రెడిట్‌ చోరీ బాబుది 
ఆ ఉపగ్రహాలను ప్రయోగించే కాంట్రాక్టు దక్కించుకున్నది హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్‌ ఏరోస్పేస్‌. ప్రయోగం అమెరికాది, రాకెట్‌ తెలంగాణది, క్రెడిట్‌ చోరీ మాత్రం బాబుది. ఈ ప్రయోగం ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, వాణిజ్యపరంగా అందుబాటులోకి రాలేదని వారిచ్చిన ఫ్యాక్ట్‌ చెక్‌లోనే చెప్పక తప్పలేదు. ఎక్కడో ఓ స్టార్టప్‌ చేస్తున్న ప్రయోగాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు బాబు చేసిన ప్రయత్నం భగ్నమై ఆయన పరువు మరోసారి రోడ్డున పడింది. 

ఏడేళ్లలో అంతరిక్షం నుంచి లేజర్‌ కరెంటు 
అదే సదస్సులో బాబు మరో అడుగు ముందుకేశారు. ‘ఐదు నుంచి ఏడేళ్లలో అంతరిక్షం నుంచి లేజర్‌ టెక్నాలజీ ద్వారా విద్యుత్‌ను సరఫరా చేసే పరిస్థితి వస్తుంది. సూర్యకాంతిని ఉపయోగించి భూమి మీద కంటే అక్కడ ఏడు రెట్లు ఎక్కువ విద్యుత్‌ ఉత్పత్తి చేయవచ్చు’ అని ప్రకటించారు. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌కు సైతం ఇదే కథ వినిపించారు. ఈ ప్రాజెక్టు ఏడేళ్లలో సాకారమవుతుందని, ‘అప్పుడు మీ ఇంటికి కూడా విద్యుత్తు అందిస్తాం’ అని హామీ ఇచ్చేశారు. 

బాబు మాటల కవరింగ్‌కు అధికారుల తంటాలు.. 
ఇక్కడే బాబు బండారం బయటపడింది. ఆయన చెప్పింది లేజర్‌తో కరెంటు పంపడం. ఆయన మాటను కవర్‌ చేయడానికి వందిమాగధులు విడుదల చేసిన ఫ్యాక్ట్‌ చెక్‌లో చూపించింది అద్దాలతో వెలుగు పంపడం. బాబు ఒక టెక్నాలజీ చెబితే, అధికారులు ఇంకో టెక్నాలజీ చూపించి పరువు తీసుకున్నారు. రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు తొమ్మిది గంటల ఉచిత కరెంటు సరిగ్గా ఇవ్వలేని ప్రభుత్వం, ఆకాశం నుంచి లేజర్‌తో ఇంటింటికీ కరెంటు ఇస్తుందా అని విశ్లేషకులు ఎద్దేవా చేస్తున్నారు. ఆ కరెంటుకు కూడా ట్రూఅప్‌ చార్జీలు అంతరిక్షం నుంచే వసూలు చేస్తారేమోనన్న వ్యంగ్య వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. 

అమరావతిలో 3 వేల క్యూబిట్ల క్వాంటం కంప్యూటర్లు 
బాబు కోతలు అంతరిక్షంతో ఆగలేదు. రాబోయే రెండు, మూడేళ్లలో అమరావతిలోనే 3,000 క్యూబిట్ల సామర్థ్యమున్న క్వాంటం కంప్యూటర్లు తయారు చేస్తామని ప్రకటించేశారు. గూగుల్, ఐబీఎం లాంటి దిగ్గజాలే ఇంకా ఆ ప్రయోగాలతో తంటాలు పడుతు­న్నాయి. రాజధానిలో రోడ్లు, భవనాల పునాదు­లు కూడా పూర్తి చేయలేని చంద్రబాబు మాత్రం మూడేళ్లలో అక్కడ క్వాంటం కంప్యూటర్లు తయారు చేస్తామంటున్నారని నిపుణులు ఆశ్చర్యపోతున్నారు.  

బిల్‌ గేట్స్‌ కథ.. మళ్లీ మొదటికి 
సెల్‌ఫోన్‌ తానే కనిపెట్టానని, హైదరాబాద్‌ను తానే కట్టానని బోగస్‌ మాటలు చెప్పి తరచూ నవ్వులపాలయ్యే చంద్రబాబు ఈ సదస్సులోనూ అదే పాత కథ ఎత్తుకున్నారు. జర్నలిస్ట్‌ పాల్కీ శర్మతో ఫైర్‌సైడ్‌ చాట్‌లో హైదరాబాద్‌కు బిల్‌ గేట్స్‌ను తానే రప్పించానని, భవిష్యత్తు ఐటీదేనని ఆనాడే ఊహించానని చెప్పుకున్నారు. 

నాదెళ్ల నుంచి సింధు దాకా.. అంతా నేనే 
సత్య నాదెళ్ల తన స్ఫూర్తితోనే సివిల్‌ సర్వీసెస్‌ వదిలి ఐటీలోకి వెళ్లారని గతంలో చెప్పుకున్న ఘనత కూడా బాబుదే. నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌లో చేరింది 1992లో, బాబు సీఎం అయింది 1995లో. బాబు స్ఫూర్తి టైమ్‌ మెషీన్‌ ఎక్కి మూడేళ్లు వెనక్కి వెళ్లి అమెరికా చేరిందన్నమాట. పీవీ సింధు ఒలింపిక్‌ పతకం కూడా బాబు ఖాతాలోకే వెళ్లింది. ‘కోర్టులో చెమటోడ్చింది సింధు, మైకు ముందు చెమటోడ్చింది బాబు’ అని విమర్శకులు ఎద్దేవా చేస్తున్నారు. దేశంలోనే తొలిసారి విద్యుత్‌ సంస్కరణలు తెచ్చింది తానేనని బాబు ఈ సదస్సులో మరోసారి అదే అబద్ధాన్ని గర్వంగా చెప్పుకున్నారు.  

ఇరవై ఏళ్లలో చైనాను దాటేస్తామని ప్రగల్భాలు  
ఇంకో రెండు దశాబ్దాల్లో భారత్‌ పలు రంగాల్లో చైనాను సమం చేస్తుందని, దాటేస్తుందని చెప్పి బాబు కొత్తగా జ్యోతిష్యుడి అవతారం ఎత్తారు. పదేళ్ల తర్వాత ఏ నగరం, ఏ రాష్ట్రం నివాసయోగ్యంగా ఉంటుందో వచ్చి చూడాలని పాల్కీ శర్మకే సవాల్‌ విసిరారు. పదేళ్ల క్రితం కూడా అమరావతి గురించి ఇదే సినిమా చూపించారు, సింగపూర్‌ను మించిన రాజధాని అన్నారు. ఆ సినిమా ఇంకా టీజర్‌ దశ దాటలేదన్నది అందరికీ తెలిసిందే. 

ఆకాశంలో హామీలు.. నేల మీద మోసాలు 
టెక్నాలజీ నుంచి అంతరిక్షం వరకూ అంతా తానేన­ని చెప్పుకున్న చంద్రబాబు, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి ఇంకా ఎందుకివ్వలేదన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేకపోతున్నారు. కరెంటు చార్జీలు పెంచనని చెప్పి, అధికారంలోకి రాగానే ట్రూ­అప్‌ బాదుడు మొదలుపెట్టారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, స్థానిక ఎన్నికల్లో అధికార దుర్వినియోగంతో గట్టెక్కిన బాబు, ఇప్పుడు జనం చూపును ఆ­కాశం వైపు మళ్లించే ఎత్తుగడ వేశారు. రేపు సూర్యు­డి­ని కూడా తానే సృష్టించానని బాబు ప్రకటించినా ఆ­శ్చర్యపోనక్కర్లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement