సాంకేతికతే అభివృద్ధి చోదకశక్తి
ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పిలుపు
సీఐఐ పార్టనర్‌షిప్ సమావేశంలో ముఖ్యఅతిథిగా ప్రసంగం
సాక్షి, అమరావతి: కలిసి పనిచేద్దాం.. కలిసి ఎదుగుదాం.. శ్రేయస్సును పంచుకుందాం అనే నినాదంతో ముందుకు సాగాలని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. రెండు రోజుల సీఐఐ పార్టనర్‌షిప్ సమావేశాల ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ రెండు రోజుల సీఐఐ భాగస్వామ్య సదస్సులో పెట్టుబడి ఒప్పందాలతో పాటు కీలక అంశాలపై మేధోమథనం జరిగిందని పేర్కొన్నారు. పోర్టులు, విమానాశ్రయాలు, ఎలక్ట్రానిక్స్, స్పేస్, డిఫెన్స్, పర్యాటక రంగాల్లో రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షిస్తోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా దేశం ముందుకు సాగుతోందని చెప్పారు.
భవిష్యత్తులో టెక్నాలజీ కీలకమైన అభివృద్ధి చోదక శక్తిగా నిలుస్తుందని, ఏఐ వంటి అధునాతన సాంకేతికతను పాలన, పౌరసేవల్లో వినియోగించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యారంగం, ఆవిష్కర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కోవిడ్ సమయంలో భారత్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను 100 దేశాలకు అందించడం ద్వారా దేశం తన సామర్థ్యాన్ని చాటిందన్నారు.
ఒప్పందాలకే పరిమితం కాకుండా అభివృద్ధి లక్ష్యాల సాధనకు కృషి చేయాలని, ’వర్క్ టుగెదర్, గ్రో టుగెదర్, షేర్ ప్రాస్పెరిటీ’ నినాదంతో ముందుకు సాగాలని ఉద్ఘాటించారు. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ ఈ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్‌పై పారిశ్రామికవేత్తలకు ఉన్న విశ్వాసం వెల్లడైందన్నారు. పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్ ప్లాంట్, తూర్పు కోస్తా రైల్వే జోన్ వంటి ప్రాజెక్టులు కేంద్ర సహకారంతో సాకారమవుతున్నాయని పేర్కొన్నారు.
వన్‌ఫ్యామిలీ వన్ ఏఐ చాంపియన్ విధానంతో ప్రోత్సాహం
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, ’వన్ ఫ్యామిలీ వన్ ఏఐ ఛాంపియన్’ విధానం ద్వారా టెక్నాలజీ నైపుణ్యాలను ప్రోత్సహించనున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ లక్ష్యాన్ని సాధించే దిశగా కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత ఉందని, ఈ నేపథ్యంలో ఏపీ యువతకు నైపుణ్య శిక్షణ అందించడం కీలకమన్నారు. క్లీన్ ఎనర్జీ రంగంలో 114 గిగావాట్ల ఉత్పత్తి కోసం ఏపీ ఒప్పందాలు చేసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ కోసం కేంద్రం కేటాయించిన రూ.లక్ష కోట్లకు పైగా బడ్జెట్‌ను ఏపీ గరిష్టంగా వినియోగించుకుంటోందన్నారు.
పీఎం సూర్యఘర్ పథకం కింద ఏపీకి ఇప్పటికే 7.8 లక్షల యూనిట్లు కేటాయించినట్లు తెలిపారు. మరోవైపు ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ, భారత పరిశ్రమల సమాఖ్య మధ్య ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. రెండు రోజుల సదస్సులో 65 దేశాలకు చెందిన ప్రభుత్వ, పారిశ్రామిక ప్రతినిధులు పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమంలో మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, సీఐఐ ప్రెసిడెంట్ డెసిగ్నేట్ సుచిత్రా ఎల్లా పాల్గొన్నారు.


