కాంగ్రెస్ హయాంలో రాజ్యాంగానికి తూట్లు: ప్రధాని మోదీ | Constitution extraordinary PM Modi | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ హయాంలో రాజ్యాంగానికి తూట్లు: ప్రధాని మోదీ

Nov 26 2026 11:39 AM | Updated on Nov 26 2026 11:39 AM

Constitution extraordinary PM Modi

న్యూఢిల్లీ: భారత రాజ్యాంగం అసాధారణమైనదని, సామాన్య కుటుంబంలో జన్మించిన వ్యక్తి సైతం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకత్వం వహించే స్థాయికి ఎదిగే అవకాశం కల్పించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తన జీవిత ప్రయాణంలోనూ రాజ్యాంగం విడదీయలేని భాగమని పేర్కొన్నారు. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గురువారం వివిధ పత్రికల్లో ప్రచురితమైన తన వ్యాసంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

రాజ్యాంగం వల్లే ఈ స్థాయికి..
చిన్నతనంలో తాను పెరిగిన సాధారణ కుటుంబ పరిస్థితులు, ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకుంటే రాజ్యాంగం పట్ల కృతజ్ఞతాభావం కలుగుతుందని మోదీ తెలిపారు. ఎలాంటి ప్రత్యేక అవకాశాలు, కుటుంబ నేపథ్యం లేని వ్యక్తికి దేశానికి సేవ చేసే బాధ్యత దక్కడం భారత రాజ్యాంగ గొప్పతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మరింత బలోపేతం చేయడం ద్వారా ఆ రుణాన్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.

రాజ్యాంగ దినోత్సవం ప్రాధాన్యం
1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిందని మోదీ గుర్తు చేశారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌తో పాటు రాజ్యాంగ పరిషత్ సభ్యుల సేవలను కొనియాడారు. భారతీయ నాగరికత, సంప్రదాయాల విజ్ఞానాన్ని ఆధునిక రాజ్యాంగంలో పొందుపరిచారని తెలిపారు. రాజ్యాంగం కేవలం పార్లమెంటు, న్యాయస్థానాలకే పరిమితం కాకుండా ప్రజలందరి జీవితాల్లో భాగం కావాలన్నారు. అందుకే పదేళ్ల క్రితం నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహించాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు.

పేదరిక నిర్మూలనతో సామాజిక న్యాయం
భారత్‌లో దాదాపు 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ఇటీవల ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించినట్లు మోదీ తన వ్యాసంలో ప్రస్తావించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా పేదలకు పక్కా ఇళ్లు, ఉజ్వల యోజన ద్వారా మహిళలకు పొగలేని వంటగదులు, ఆయుష్మాన్ భారత్ ద్వారా పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. ముద్రా, పీఎం స్వనిధి పథకాలు, డిజిటల్ సాంకేతికత, యూపీఐ వంటి వేదికలు అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తున్నాయని తెలిపారు.

రాజ్యాంగ సవరణలతో కీలక మార్పులు
101వ రాజ్యాంగ సవరణ ద్వారా జీఎస్టీ అమల్లోకి వచ్చిందని, 102వ సవరణతో జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు రాజ్యాంగబద్ధ హోదా లభించిందని మోదీ వివరించారు. 103వ సవరణ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్లు కల్పించినట్లు తెలిపారు. ఎనిమిదో షెడ్యూల్‌లోని మొత్తం 22 భాషల్లో రాజ్యాంగం అందుబాటులోకి రావడం మరో ముఖ్యమైన పరిణామమని పేర్కొన్నారు. భారతీయ న్యాయ సంహిత ద్వారా విద్యకు ప్రాధాన్యమిచ్చే వలస పాలన నాటి విధానం నుంచి పౌరులకు న్యాయం అందించే దిశగా అడుగులు వేసినట్లు చెప్పారు.

కాంగ్రెస్ పాలనపై విమర్శలు
పేరు ప్రస్తావించకుండా కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు గుప్పించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కలిగిన వారే గతంలో దానిని బలహీనపరిచారని ఆరోపించారు. 1951లో తొలి రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక స్వేచ్ఛలను పరిమితం చేశారని, అత్యవసర పరిస్థితుల సమయంలో 1976లో చేసిన 42వ సవరణ న్యాయ సమీక్ష అధికారాలను కుదించి, వ్యవస్థల మధ్య అధికార సమతుల్యతను దెబ్బతీసిందని పేర్కొన్నారు. 38, 39వ సవరణలను కూడా యువత అధ్యయనం చేయాలని సూచించారు. ఆర్టికల్ 356ను ఉపయోగించి దాదాపు 100 సార్లు రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసిన ఘనత ఒక పార్టీకి ఉందని విమర్శించారు. ఇందిరాగాంధీ పాలనను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆర్టికల్ 370 రద్దుతో చారిత్రక తప్పిదం సరిదిద్దాం
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370, 35ఏ కారణంగా 70 ఏళ్లకు పైగా అక్కడ భారత రాజ్యాంగం పూర్తిస్థాయిలో అమలు కాలేదని మోదీ పేర్కొన్నారు. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలు, మహిళల హక్కులకు విఘాతం కలిగిందని ఆరోపించారు. 2019లో ఈ నిబంధనలను రద్దు చేయడం ద్వారా చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దినట్లు తెలిపారు.

2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఆలోచనల్లో ‘ఇండియా ఫస్ట్’, ఆచరణలో ‘కర్తవ్యం’ అనే రెండు సూత్రాలను మార్గదర్శకంగా చేసుకోవాలని సూచించారు. రాజ్యాంగమే మన బలమని, దాని స్ఫూర్తితో భవిష్యత్ తరాలకు ఉజ్వలమైన భారతదేశాన్ని అందించవచ్చని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 2028 వరకు ఆగని యుద్ధం.. జ్యోతిష్యుల హెచ్చరిక!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement