ఓటు హక్కు పరిరక్షణకు విపక్షం సమర శంఖం
లక్నోలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్న ఖర్గే
సాక్షి, న్యూఢిల్లీ: ఓటరు జాబితాల్లో అక్రమాలు, నకిలీ ఓట్ల నమోదు, అర్హులైన ఓటర్ల పేర్ల తొల గింపునకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టనున్నట్లు ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్య దర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా ఓటు హక్కు పరిరక్షణ కోసం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అన్ని రాష్ట్రాల్లో ‘సంవిధాన్ రక్షా మార్చ్’ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఉత్త రప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగే మార్చ్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొంటారని తెలిపారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వేణుగోపాల్ పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఎన్నికల సంఘం స్వతంత్రతపై ప్రశ్నలు
ఓట్ల చోరీకి సంబంధించి ఆధారాలను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశం ముందుంచారని వేణుగోపాల్ పేర్కొన్నారు. కర్ణాటకలోని మహదేవపురలో నకిలీ, డూప్లికేట్ ఓటర్ల నమోదు, అలంద్‌లో వేలాది మంది అసలైన ఓటర్ల పేర్ల తొలగింపునకు ప్రయత్నాలు, హరియాణా సహా ఇతర రాష్ట్రాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. వీటిపై నిష్పక్షపాత విచారణ జరపాల్సిన ఎన్నికల సంఘం అందుకు అంగీకరించడం లేదని విమర్శించారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) ప్రక్రియతో మూడు దశల్లో కలిపి 13 కోట్లకు పైగా పేర్లు తొలగించే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. పేదలు, దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, వలస కార్మికులు, వివాహం తర్వాత నివాసం మారిన మహిళలు ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగిస్తూ చట్టంలో మార్పులు చేయడం, అధికారిక విధుల నిర్వహణకు సంబంధించి ఎన్నికల కమిషనర్లకు చట్టపరమైన రక్షణ కల్పించడం వంటి చర్యలు ఎన్నికల సంఘం స్వతంత్రతను దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు.
ప్రతి బూత్‌లో ఓటు రక్షక్ కార్యక్రమం
‘ఓటు రక్షక్’ కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ కార్య కర్తలు ప్రతి పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటరు జాబి తాల నుంచి తొలగించిన పేర్లను పరిశీలిస్తారని, అర్హులైన ఓటర్లు తిరిగి తమ ఓటు హక్కు పొందేందుకు సహకరిస్తారని కేసీ వేణుగోపాల్ తెలిపారు. నవంబర్ 26న నిర్వహించే మార్చ్‌లు అంబేడ్కర్ లేదా మహాత్మాగాంధీ విగ్రహాల వద్ద ప్రారంభమవుతాయని, రాజ్యాంగ పీఠికను చదివి రాజ్యాంగ పరిరక్షణకు ప్రతిజ్ఞ చేస్తారని వివరించారు.


