తిరుప్పరంకుండ్రం కొండపై దీపథూన్ వద్ద కార్తీక దీపం వెలిగించకపోవడంపై వివరణ
న్యూఢిల్లీ: మదురై తిరుప్పరంకుండ్రం కొండపై దీపథూన్(ప్రాచీన రాతి దీప స్తంభం) వద్ద సంప్రదాయ కార్తీక దీపాన్ని వెలిగించకపోవడం పట్ల తమిళనాడు ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు క్షమాపణ తెలియజేసింది. కార్తీక పౌర్ణమి నేపథ్యంలో మంగళవారం అక్కడ దీపం వెలిగించకపోవడానికి అరుళ్‌మిగు సుబ్రహ్మణ్యస్వామి ఆలయ అధికారులే కారణమని పేర్కొంది. మరోవైపు తమిళనాడు ప్రభుత్వంపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది.
సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు ప్రారంభించడానికి సుప్రీంకోర్టు నిరాకరిచింది. ఒకవేళ ఎవరైనా అలాంటి పిటిషన్ దాఖలు చేస్తే పరిశీలిస్తామని తెలిపింది. దీపం వెలిగించడానికి అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్లు, కోర్టు ధిక్కార పిటిషన్లను రిజిస్ట్రీ ధృవీకరిస్తుందని, వాటిపై గురువారం లేదా శుక్రవారం విచారణ చేపట్టవచ్చా? లేదా? అనేది కోర్టు పరిశీలిస్తుందని జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం.పంచోలిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.
సర్వోన్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చినప్పటికీ తిరుప్పరంకుండ్రంలో కొండపై ఉన్న రాతి స్తంభం వద్ద కాకుండా, ఆనవాయితీగా వస్తున్న ఉచ్చిపిళ్లయార్ మండపం వద్ద కార్తీక దీపం వెలిగించిన సంగతి తెలిసిందే. దీనిపై తమిళనాడు సర్కార్ తాజాగా సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చి క్షమాపణ కోరింది. ఈ మేరకు మధురై జిల్లా కలెక్టర్ నిశాంత్ కృష్ణ మధ్యంతర స్థితి నివేదికను సమరి్పంచారు. ఆలయ ధర్మకర్తల మండలి(బోర్డు ఆఫ్ ట్రస్టీస్) అనుమతి ఇవ్వకపోవడంతో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను అమలు చేయడం సాధ్యంకాలేదని తెలిపారు.


