సాక్షి, చైన్నె: దేశ చమురు దిగుమతులలో 25 శాతం వాటాను ఆక్రమిస్తున్న మధ్యస్థ , భారీ వాణిజ్య వాహనాల (ట్రక్కులు, బస్సులు) విద్యుదీకరణను వేగవంతం చేసేందుకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీ మద్రాస్) నడుం బిగించింది. ఎలక్ట్రిక్ ట్రక్కుల వినియోగాన్ని పెంచేందుకు ఆచరణాత్మక విధాన సిఫార్సులు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల ప్రణాళికలు , పారిశ్రామిక రోడ్‌మ్యాప్‌లను రూపొందించే లక్ష్యంతో ఇ–సివి డైలాగ్ పేరుతో జాతీయ స్థాయి చర్చా కార్యక్రమాన్ని నిర్వహించనుంది. భారత ప్రభుత్వ ప్రధాన శాసీ్త్రయ సలహాదారు కార్యాలయం ఆధ్వర్యంలో 2027 జనవరి 21, 22 తేదీల్లో ఈ రెండు రోజుల సదస్సు జరగనుంది. ఇందులో కేంద్ర మంత్రులు, విధాన రూపకర్తలు, ఆటోమోటివ్ పరిశ్రమ దిగ్గజాలు , వాణిజ్య ఫ్లీట్ ఆపరేటర్లు, లాజిస్టిక్స్ సంస్థలు , పరిశోధకులు ఒకే వేదికపైకి రానున్నారు.
చమురు దిగుమతుల భారం తగ్గించేందుకే ఈ చొరవ
ఈ కార్యక్రమ ఆవశ్యకతను ఐఐటి మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి వివరిస్తూ, దేశంలోని రోడ్డు రవాణా ఇంధన వినియోగంలో సుమారు 40 శాతం, మొత్తం చమురు దిగుమతుల బిల్లులో దాదాపు 25 శాతం వాటా మధ్యస్థ, భారీ వాణిజ్య వాహనాలదేనని వివరించారు. 2070 నాటికి నికర సున్నా ఉద్గారాల లక్ష్యం దిశగా భారత్ పయనిస్తున్నప్పటికీ, ప్రస్తుతం మొత్తం వాణిజ్య వాహనాల అమ్మకాల్లో ఎలక్ట్రిక్ ట్రక్కుల వాటా కేవలం 0.2 శాతంగానే ఉందన్నారు. ఈ రంగంలో సమన్వయ చర్యల ద్వారా సున్నా–ఉద్గార రవాణాకు ఒక స్పష్టమైన చట్రాన్ని ఏర్పాటు చేయడమే తమ లక్ష్య్యంగా అని పేర్కొన్నారు. ఐఐటి మద్రాస్ అసోసియేట్ డీన్ ,సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ జీరో ఎమిషన్ ట్రకింగ్ , ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ ప్రొఫెసర్ సి.ఎస్. శంకర్ రామ్ మాట్లాడుతూ, దేశంలోని సగానికి పైగా ప్రయాణికులు, సరుకు రవాణా వాణిజ్య వాహనాల ద్వారానే జరుగుతోందని, వీటి విద్యుదీకరణ వల్ల కాలుష్య నియంత్రణతో పాటు దేశ ఇంధన భద్రత బలోపేతం అవుతుందని తెలిపారు. సాధారణ సదస్సుల్లో ఉండే ఏకపక్ష ప్రసంగాలకు భిన్నంగా, ప్రాచీన భారతీయ సంప్రదాయమైన శాస్త్రార్థం స్ఫూర్తితో ఈ సదస్సును రూపొందించినట్లు ఇంజనీరింగ్ డిజైన్ విభాగం ప్రొఫెసర్ కార్తిక్ ఆత్మనాథన్ వెల్లడించారు. ఇందులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, వాహన తయారీదారులు, టెక్నాలజీ డెవలపర్ల మధ్య లోతైన వర్క్‌షాప్‌లు, చర్చలు జరుగుతాయన్నారు. ప్రోత్సాహకాలు, బ్యాటరీ వ్యవస్థలు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, భద్రతా ప్రమాణాలు, ఆర్థిక సహాయ యంత్రాంగాలు , ప్రామాణిక నిర్వహణ విధానాల రూపకల్పనపై నిపుణులు చర్చించి ఆచరణాత్మక పరిష్కారాలను సిద్ధం చేయనున్నామన్నారు.


