70 ఏళ్లు పైబడిన వయోవృద్ధలకు ఉచిత వైద్యం | - | Sakshi
Sakshi News home page

70 ఏళ్లు పైబడిన వయోవృద్ధలకు ఉచిత వైద్యం

Nov 26 2026 1:23 AM | Updated on Nov 26 2026 1:23 AM

● ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

సాక్షి, చైన్నె:రాష్ట్రంలోని వయోవృద్ధులకు మెరుగైన వైద్య సేవలను ఉచితంగా అందించేందుకు తమిళనా డు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. 70 ఏళ్లు , అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్‌ సిటిజన్లకు ఉచిత వైద్య చికిత్స అందించే సీఎం వయోవృద్ధుల బీమా పథకం అమలుకు సంబంధించి రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.శాసనసభలో ఆరోగ్య శాఖ పద్దులపై జరిగిన గ్రాంట్‌–ఇన్‌–ఎయిడ్‌ చర్చల సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి ఈ పథకా న్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 38లక్షల మంది వయో వృద్ధులకు ఎలాంటి వార్షిక ఆదాయ పరిమితి లేకుండా ఈ పథకం కింద ఉచిత చికిత్స లభించనుంది.

ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో ఖరీదైన చికిత్స ఫ్రీ..

ప్రస్తుతం సీఎం సమగ్ర ఆరోగ్య బీమా పథకం కింద అందుబాటులో ఉన్న అన్ని వైద్య సేవలు ఈ నూతన వయోవృద్ధుల బీమా పథకంలోనూ వర్తిస్తాయి. ప్రభుత్వం గుర్తించిన ప్రభుత్వ , ప్రైవేట్‌ ఆసుపత్రులలో క్యాన్సర్‌ చికిత్సలు, గుండె సంబంధిత శస్త్రచికిత్సలు, అవయవ మార్పిడి చికిత్సలతో పాటు ఖరీదైన నాణ్యమైన వైద్య పరీక్షలను కూడా లబ్ధిదారులు ఉచితంగా పొందవచ్చు. ఇప్పటికే ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద ఉన్న 70 ఏళ్లు పైబడిన వారితో పాటు, ఆ పథకంలో లేని అర్హులైన వయోవృద్ధులందరినీ ఈ పథకంలో చేర్చనున్నారు. నమోదు ప్రక్రియ మరియు ప్రీమియం వివరాలునమోదు కేంద్రాలు: ఈ–సేవా కేంద్రాలు మరియు ఇతర ప్రభుత్వ బీమా నమోదు కేంద్రాల ద్వారా అర్హులైన వయోవృద్ధులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.

ప్రీమియం చెల్లింపు

కొత్తగా నమోదు చేసుకునే 70 ఏళ్లు పైబడిన సీనియర్‌ సిటిజన్ల కోసం యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ ద్వారా ఒక్కొక్కరికి రూ. 849 ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించనుంది. వచ్చే ఏడాది కొత్త బీమా ఒప్పందం కుదుర్చుకునే సమయంలో ఈ ప్రీమియం మొత్తంలో మార్పులు ఉండే అవకాశం ఉంది.తమిళనాడు ఆరోగ్య సేవల ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ప్రతిపాదన, ఆర్థిక శాఖ ఆమోదంతో ప్రభుత్వం ఈ ఉత్తర్వులను వెలువరించింది. లబ్ధిదారులను నమోదు చేసే ముందు వారి వివరాలను క్షుణ్ణంగా ధృవీకరించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అలాగే సీఎం బీమా పథకం, ఆయుష్మాన్‌ భారత్‌ వంటి పథకాల కింద ఒకే వ్యక్తికి ద్వంద్వ ప్రయోజనాలు అందకుండా పథకాల డైరెక్టర్‌ పర్యవేక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement