● డీఎంకే మహిళా నిరసనలు ● సిబీఐ విచారణ కోసం ఉదయ నిధి వినతి పత్రం ● 2 నెలలలో విచారణ నివేదికకు సీఎస్‌ ఆదేశం ● కాకర్ల ఉషా నేతృత్వంలో కమిటీ | - | Sakshi
Sakshi News home page

● డీఎంకే మహిళా నిరసనలు ● సిబీఐ విచారణ కోసం ఉదయ నిధి వినతి పత్రం ● 2 నెలలలో విచారణ నివేదికకు సీఎస్‌ ఆదేశం ● కాకర్ల ఉషా నేతృత్వంలో కమిటీ

Nov 26 2026 1:23 AM | Updated on Nov 26 2026 1:23 AM

● డీఎంకే మహిళా నిరసనలు ● సిబీఐ విచారణ కోసం ఉదయ నిధి వినతి పత్రం ● 2 నెలలలో విచారణ నివేదికకు సీఎస్‌ ఆదేశం ● కాకర్ల ఉషా నేతృత్వంలో కమిటీ

ఎమ్మెల్యే అరుల్‌ అరెస్టుకు పట్టు

సాక్షి, చైన్నె:కళ్లకురిచ్చి జిల్లా కలెక్టర్‌ పద్మజకు అసభ్యక ర సందేశాలు పంపి, ఆమె నివాసంలోకి చొరబడి అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీకే ఎమ్మెల్యే అరుల్‌ విఘ్నేష్‌ను తక్షణమే అరెస్టు చేయాలని వివిధ రాజకీయ పార్టీల నేతలు డిమాండ్‌ చేశారు. డీఎంకే మహిళా విభాగం నేతృత్వంలో బుధవారం కళ్లకురిచ్చిలో ఆందోళనలు చోటు చేసుకున్నాయి. మరోవైపు, ఉదయం పోలీసులు ఆయనకు వ్యక్తిగతంగా సమన్లు జారీ చేయడంతో ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

రాజకీయ నేతల తీవ్ర డిమాండ్లు

నాలుగు నెలల క్రితమే కలెక్టర్‌ ఫిర్యాదు చేసినా చర్యలు లేకపోవడాన్ని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ తప్పుబట్టారు. జాతీయ మహిళా కమిషన్‌, హైకోర్టు జోక్యం తర్వాతే ఫిర్యాదు నమోదైందని, ఎమ్మెల్యేను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శిపళనిస్వామి స్పందిస్తూ, కలెక్టర్‌ దృఢంగా నిలబడి ఫిర్యాదు చేశారని, నిందితుడైన ఎమ్మెల్యేను వెంటనే అరెస్టు చేయాలని కోరారు. సోషల్‌ మీడియా వార్తలపై రాజకీయాలు చేస్తున్నారంటూ టీవీకే మంత్రుల వ్యాఖ్యలను డీఎంకే ఎంపి కనిమొళి ఖండించారు. మహిళల భద్రతపై సీఎం విజయ్‌ వైఖరిని ప్రశ్నిస్తూ, ఈ అంశాన్ని పార్లమెంటులోనూ లేవనెత్తుతామని తెలిపారు. ఇక, పీఎంకే నేత అన్బుమణి, ఎన్‌టీకే నేత సీమాన్‌, ఏఎంఎంకే నేత టీటీవీ దినకరన్‌, విది లీడర్స్‌ నేత అన్నామలై, బిజపీ నేత నైనార్‌ నాగేంద్రన్‌లు స్పందిస్తూ, ఎటువంటి జాప్యం లేకుండా ఎమ్మెల్యేలును అరెస్టు చేయాలని, రాజకీయ జోక్యం లేకుండా పారదర్శక విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.టీవీకే సర్కారుకు మద్దతు ఇస్తున్న టీఎన్‌సీపీ నేత మాణిక్యం ఠాకూర్‌, సీపీఎం నేత బాలకృష్ణన్‌, సీపీఐ నేత వీర పాండియన్‌లు స్పందిస్తూ, తప్ప చేసిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, పదవి నుంచి తొలగించాలని కోరారు.

పోలీసుల సమన్లు– నివేదికకు హైకోర్టు ఆదేశం

ఈ వ్యవహారంపై మద్రాస్‌ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి వి. లక్ష్మీ నారాయణన్‌, ఎవరూ అనవసరంగా రాజకీయం చేయకూడదని సూచించారు. నిందితులపై త్వరితగతిన దర్యాప్తు జరిపి డిసెంబర్‌ 22లోగా కోర్టులో తుది నివేదిక దాఖలు చేయాలని ఆదేశించారు. ఈ కేసు దర్యాప్తు అధికారిగా తిరుప్పూర్‌ ఎస్పీ సృష్టి సింగ్‌, పర్యవేక్షణ అధికారిగా అడ్మినిస్ట్రేటివ్‌ ఐజీ కామిని నియమితులయ్యారు. ఉదయం కల్లకురిచిలోని ఎమ్మెల్యే అరుల్‌ విఘ్నేష్‌ కార్యాలయానికి చేరుకున్న పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ భువనేశ్వరి ఆయనకు వ్యక్తిగతంగా సమన్లు జారీ చేసి, విచారణకు హాజరు కావాలని కోరారు. కార్యాలయం వద్ద పోలీసుల మోహరింపుతో కలకలం రేగింది. ఎమ్మెల్యేను ఎప్పుడైనా అరెస్టు చేసే అవకాశం ఉందన్న వార్తల మధ్య, రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.

ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు

ఈ వ్యవహారంపై మాట్లాడిన డీజీపీ మహేష్‌ కుమార్‌ అగర్వాల్‌, కళ్ల్లకురిచ్చి జిల్లా కలెక్టర్‌ ఈ నెల 23వ తేదీనే అధికారికంగా ఫిర్యాదు దాఖలు చేశారని, ఆ వెంటనే కేసు నమోదు చేశామని వెల్లడించారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను తిరుప్పూర్‌ జిల్లా ఎస్పీ సృష్టి సింగ్‌కు అప్పగించామని, పరిపాలనా విభాగం ఐజీ కామిని పర్యవేక్షక అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు. ఎవరినీ ఉపేక్షించకుండా న్యాయబద్ధంగా విచారణ జరుపుతామని డీజీపీ హామీ ఇచ్చారు. మహిళల భద్రతలో సమాజం భాగస్వామ్యం కావాలని పిలుపు నిచ్చారు. ఇదిలా ఉండగా కేసును సీబీఐ విచారణ కోరుతూ డీజీపీకి ఉదయనిధి స్టాలిన్‌ వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఒక మహిళా ఐఏఎస్‌ అధికారిణికి ఎమ్మెల్యే అసభ్యకర సందేశాలు పంపడమే కాకుండా, మద్యం మత్తులో ఆమె నివాసంలోకి చొరబడి గొడవ చేయడం దేశ చరిత్రలోనే అత్యంత హేయమైన ఘటనగా వ్యాఖ్యానించారు. జూలై 31న ఈ ఘటన జరిగితే, 116 రోజుల తర్వాత కోర్టు జోక్యంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని మండి పడ్డారు. అప్పటివరకు సీఎం విజయ్‌ నిద్రవాస్థలతో ఉన్నట్టుంది ఆగ్రహం వ్యక్తంచేశారు. బాధిత కలెక్టర్‌ అప్పట్లోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేస్తే, మరో జిల్లాకు బదిలీ చేయించుకోవాలని సల హా ఇచ్చి రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారని ఉదయనిఽ ది ఆరోపించారు.అందువల్ల ఈ కేసులో ప్రధాన కార్య దర్శిని కూడా నిందితుడిగా చేర్చాలని, సోషల్‌ మీడియాలో కలెక్టర్‌పై దాడి చేస్తున్న వారిపై చర్యలు తీసు కోవాలని డిమాండ్‌ చేశారు. కాగా, ఈ వ్యవహారంపై త్వరితగతిన విచారణ జరిపి రెండు నెలలో నివేదిక సమర్పించాలని సీఎస్‌ సాయికుమార్‌ ఆదేశించారు. ఇందు కోసం ఐఎఎస్‌ అధికారిణి కాకర్ల ఉషా నేతృత్వంలో దివ్యాంగలు సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్‌ మధుమతి, న్యాయ శాఖ కార్యదర్శి పి సుమతి, సునీతా జో సభ్యులుగా కమిటీని ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement