సుప్రీంకోర్టుకు మదురై కలెక్టర్‌ నివేదిక | - | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టుకు మదురై కలెక్టర్‌ నివేదిక

Nov 26 2026 1:23 AM | Updated on Nov 26 2026 1:23 AM

● తిరుప్పరకుండ్రం దీపం వివాదం ● రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, అరెస్టులు

సాక్షి, చైన్నె : తిరుప్పరకుండ్రం కొండపై ఉన్న దీపస్తంభం వద్ద కార్తీక దీపం వెలిగించకపోవడం తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం కొండ శిఖరంపై దీపం వెలిగించనందుకు మనస్ఫూర్తిగా చింతిస్తున్నట్లు మదురై జిల్లా కలెక్టర్‌ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన నివేదికలో పేర్కొన్నారు.

సుప్రీంకోర్టులో కలెక్టర్‌ వివరణ

మదురై హైకోర్టు న్యాయమూర్తి జి.ఆర్‌. స్వామినాథన్‌ తీర్పును సమర్థిస్తూ, ఈ ఏడాది కార్తీక దీపం సందర్భంగా కొండ ఆలయంలో దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, మంగళవారం పండుగ రోజున దీపస్తంభం వద్ద కాకుండా యథావిధిగా ఉచ్చిపిళ్లైయార్‌ ఆలయ మండపంలోనే ఆగమ నియమాల ప్రకారం దీపం వెలిగించారు. దీనికి గల కారణాలను వివరిస్తూ మదురై కలెక్టర్‌ బుధవారం సుప్రీంకోర్టులో నివేదిక సమర్పించారు. దీపస్తంభం వద్ద దీపం వెలిగించేందుకు ఆలయ యాజమాన్యం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి సిఫార్సు చేయకపోవడం వల్లే ఇలా జరిగిందని, జిల్లా కలెక్టర్‌గా తన పరిధిలో అన్ని చర్యలు తీసుకున్నానని, దీపస్తంభం వద్ద దీపం వెలగనందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని పేర్కొన్నారు. కాగా, ఈ కేసుపై తుది విచారణను సుప్రీంకోర్టు జనవరికి వాయిదా వేసింది. కాగా, కొండపై దీపం వెలిగించకపోవడాన్ని నిరసిస్తూ హిందూ సంఘాలు, బీజేపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగాయి. కోయంబత్తూరు, తిరునల్వేలి, మధురైలలో భారీ నిరసనలు చోటు చేసుకున్నాయి. నిరసన కారులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. కేసులు నమోదు చేశారు.

మంత్రి నిర్మల్‌ కుమార్‌ నివాసం వద్ద భద్రత

కొండపై కార్తీక దీపం వెలిగించకపోవడంపై చెలరేగిన వివాదం మధురైలో ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ అంశానికి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి నిర్మల్‌ కుమార్‌ ప్రధాన కారణమని ఆరోపిస్తూ హిందూ మున్నాని కార్యకర్తలు ఆయన నివాసం, కార్యాలయాలను ముట్టడించేందుకు సిద్ధమవుతున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యగా మంత్రి ఇల్లు, కార్యాలయం వద్ద 40 మందికి పైగా సాయుధ పోలీసులను మోహరించారు. తమిళనాడు ప్రభుత్వం, మధురై జిల్లా కలెక్టర్‌, స్థానిక ఎమ్మెల్యే, మంత్రి నిర్మల్‌ కుమార్‌, పోలీసుల వైఖరిని నిరసిస్తూ మంగళవారం రాత్రంతా తిరుప్పరకుండ్రంలోని ఆలయం సమీపంలో హిందూ సంఘాలు ఆందోళనకు దిగడంతో ఉదయాన్నే వారందర్నీ అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement