తప్పుడు కేసులు పెడితే వాళ్లపై పరువు నష్టం కేసు వేయవచ్చా? | Legal Advice: Legal action against the person filing the false case | Sakshi
Sakshi News home page

తప్పుడు కేసులు పెడితే వాళ్లపై పరువు నష్టం కేసు వేయవచ్చా?

Nov 25 2026 4:22 PM | Updated on Nov 25 2026 4:27 PM

Legal Advice: Legal action against the person filing the false case

నా భార్య నాపై నా కుటుంబంపై హైదరాబాదులో అబద్ధపు కేసులు చాలా పెట్టింది. ఒకదాని తర్వాత ఒకటి నోటీసులు వస్తున్నాయి. అన్ని కేసులలో పచ్చి అబద్ధాలు రాశారు. నా చెల్లిపైనా లేనిపోని నిందలు వేశారు. మా బావగారిని కూడా కేసులోకి లాగారు. అందువల్ల నా కుటుంబంలో, ముఖ్యంగా నా చెల్లి వాళ్ళ అత్తగారి కుటుంబం నుంచి కూడా చాలా ఒత్తిడి వస్తోంది. నా చెల్లి వైవాహిక జీవితంలో గొడవలు మొదలయ్యి వాళ్లిద్దరూ విడిపోయే స్థాయికి చేరుకుంది. నేను నా భార్యపై పరువు నష్టం దావా వేయాలనుకుంటున్నాను. ఎలా ముందుకు వెళ్ళాలో సూచించగలరు.
 – శివకుమార్, విజయవాడ

పరువు నష్టం దావా రెండు రకాలు. సివిల్‌ దావా – క్రిమినల్‌ డెఫమేషన్‌ (356 బీఎన్‌ఎస్‌). మీరు క్రిమినల్‌ డెఫమేషన్‌ వేయాలి అనుకుంటే అది క్రిమినల్‌ కోర్టులో నేరుగా ప్రైవేటు కంప్లైంట్‌ రూపంగా వేయాల్సి ఉంటుంది. ఈ కేసులో శిక్ష పడితే గరిష్టంగా రెండు సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది – జరిమానా కూడా విధించవచ్చు. సివిల్‌ దావాలో అయితే నష్టపరిహారం పొందే అవకాశం ఉంటుంది. కాకపోతే కోర్టు కేసులలో, పోలీసు ఫిర్యాదులలో చేసిన ఆరోపణల ఆధారంగా పరువు నష్టం దావా వేయడం కుదరదు. 

కాబట్టి తప్పుడు కేసులు పెట్టారనేది దావాకు ఆధారం కాదు. అయితే, మీ భార్యగాని, ఆవిడ తరపు వారు ఎవరైనా కానీ మీ మీద, మీ కుటుంబం మీద వేరే వాళ్ల సమక్షంలో లేదా సోషల్‌ మీడియాలో అబద్ధపు ప్రచారం చేస్తున్నారు అని మీరు రుజువు చేయగలిగినా, సాక్ష్యాలు/సాక్షులను సమర్పించగలిగినా కచ్చితంగా కేసులు వేయవచ్చు. ప్రస్తుతానికి మాత్రం పరువు నష్టం కేసు ఆలోచన ఏమంత ప్రయోజనకరమైందేమీ కాదు. ఇకపోతే మీ చెల్లి పైన చేసిన ఆరోపణల వల్ల తమ వ్యక్తిగత జీవనానికి భంగం కలిగింది కాబట్టి, మీ చెల్లెలు తనకు జరిగిన నష్టానికి సివిల్‌ దావా ద్వారా పరిహారం కోరే అవకాశం లేకపోలేదు. 

కానీ అది అంత సులభం కాదు. తనపై ఎలాంటి ఆరోపణలు చేశారు, అందువలన తనకు జరిగిన నష్టం ఏమిటి, ఆ నష్టానికి మీ భార్య చేసిన ఆరోపణలే నేరుగా కారణమని నిరూపించ గలిగితే మాత్రమే మీ చెల్లి వేయవలసిన దావా నిలుస్తుంది. సుప్రీం కోర్టు, హైకోర్టులు సైతం చాలా కేసులలో భర్త చుట్టాలపై కేసులు వేయడం సరికాదని చెప్పినప్పటికీ, కొంతమంది అలా కేసులు వేయడం సర్వసాధారణం అయిపోయింది. మీ బావగారిపై – మీ చెల్లిపై కేసులు వేయడం తప్పు అని భావిస్తే, హైకోర్టును క్వాష్‌ పిటిషన్‌ ద్వారా ఆశ్రయించే అవకాశం కోసం దగ్గర్లోని హైకోర్టు న్యాయవాదిని సంప్రదిస్తే మంచిది. 

ఇదీ చదవండి: కజియా లిజ్ మెజోని చూస్తే గర్వంగా ఉంది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement