మీరు రీజనబుల్‌ ఎకామడేషన్‌ కోరవచ్చు | Reasonable Accommodation for Persons with Disabilities | Sakshi
Sakshi News home page

మీరు రీజనబుల్‌ ఎకామడేషన్‌ కోరవచ్చు

Oct 7 2026 11:25 AM | Updated on Oct 7 2026 11:30 AM

Reasonable Accommodation for Persons with Disabilities

నేను ఒక ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాను. నాకు రైటర్స్‌ క్రాంప్‌ అనే నరాల సంబంధిత సమస్య ఉంది. అందువల్ల చేతితో రాయడం చాలా కష్టంగా మారింది. విధి నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ అధికారులు నా పరిస్థితికి అనుగుణంగా పని కేటాయించకుండా,‘‘అసైన్‌మెంట్‌కు అనుగుణంగా మీరే సర్దుకుపోవాలి’’ అంటున్నారు. సహోద్యోగుల నుంచి ఎగతాళి, మానసిక వేధింపులు కూడా ఎదురవుతున్నాయి. ఉన్నతాధికారులను పలుమార్లు సంప్రదించినా పరిష్కారం లభించలేదు. ఏం చేయాలో సలహా ఇవ్వగలరు.
– రాఘవ, విశాఖపట్నం

చాలా సంస్థల్లో, ముఖ్యంగా చట్టాలు పటిష్టంగా అమలు కావాల్సిన పరిశ్రమలలో కూడా ఇలాంటి చట్టాల పట్ల, హక్కులపట్ల సరైన అవగాహన లేక΄ోవటం, దివ్యాంగుల పట్ల, ఆరోగ్యసమస్యలు ఎదుర్కొంటున్నవారి పట్ల హుందాగా ప్రవర్తన ఎలా ఉండాలో సున్నితత్వం లేకపోవటం శోచనీయం. సుప్రీంకోర్టు  (2021) అనే కేసులో ఇచ్చిన తీర్పులో రైటర్స్‌ క్రాంప్‌ అనే నరాల సంబంధిత వ్యాధిని సైతం దివ్యాంగుల హక్కుల చట్టం, 2016 పరిధిలో చూడాలని చెప్తూ, సదరు చట్టంలోని ‘‘రీజనబుల్‌ ఎకామడేషన్‌’’ అనేది దయతో ఇచ్చే సౌకర్యం కాదని, వైకల్యం ఉన్న వ్యక్తికి సమాన అవకాశాలు కల్పించేందుకు అవసరమైన చట్టబద్ధమైన హక్కు అని స్పష్టం చేసింది. 

అందువల్ల, మీ బ్యాంకు మీ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, సాధ్యమైనంతవరకు రాత అవసరం తక్కువ గా ఉండే విధుల్లో నియమించడం, పని విధానంలో తగిన మార్పులు చేయడం లేదా ఇతర సముచిత సౌకర్యాలు కల్పించడం వంటి చర్యలను పరిశీలించాల్సి ఉంటుంది. కేవలం ‘‘మీరు పరిస్థితికి సర్దుకుపోవాలి’’ అని చెప్పడం సమంజసం కాదు.

ముందుగా మీ న్యూరాలజిస్ట్‌ నుంచి మీ వ్యాధి, చేతిరాతపై దాని ప్రభావం, అవసరమైన సదుపాయాల (పని ప్రదేశంలో) గురించి స్పష్టమైన వైద్యనివేదిక తీసుకుని, బ్యాంకు ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా సహేతుకమైన రీజనబుల్‌ ఎకామడేషన్‌ కోరాలి. ఎగతాళి, అవమానాలు, మానసిక వేధింపులకు సంబంధించిన సంఘటనలను కూడా తేదీలతో సహా నమోదు చేసుకోవాలి. 

అంతర్గతంగా పరిష్కారం లభించకపోతే, బ్యాంకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు, పరిస్థితిని బట్టి 2016 చట్టం కింద కూడా సంబంధిత కమిషనర్‌ను ఆశ్రయించడం లేదా హైకోర్టులో రిట్‌ దాఖలు చేయడం వంటి న్యాయపరమైన మార్గాలను పరిశీలించవచ్చు. మీకు న్యాయం జరుగుతుంది. 

(శ్రీకాంత్‌ చింతల, హైకోర్టు న్యాయవాది మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం
sakshifamily3@gmail.comకు మెయిల్‌ చేయవచ్చు. )

ఇదీ చదవండి: చెత్త ఏరుకుంటూ..అన్ని లక్షలా పెన్షనా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement