జీ.పీ.ఏ. ద్వారా ఆస్తి కొనవచ్చు కానీ.. | Legal Advice: Buying or Selling Property through GPA Is It Safe | Sakshi
Sakshi News home page

జీ.పీ.ఏ. ద్వారా ఆస్తి కొనవచ్చు కానీ..

Nov 18 2026 9:55 AM | Updated on Nov 18 2026 10:00 AM

Legal Advice: Buying or Selling Property through GPA Is It Safe

మేము ఒక ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటున్నాము. ఇంటియజమాని యూరోప్‌లో ఉంటారు. ఆయన తన భార్యకి జీ.పీ.ఏ. ఇస్తాను, జీపీఏ ద్వారా ఇల్లు రిజిస్టర్‌ చేసుకోవాలి అంటున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం పత్రికలో జీ.పీ.ఏ. ద్వారా చేసిన లావాదేవీలు చెల్లవు అని ఒక వార్త చదివాను. దగ్గర్లోని న్యాయవాదిని అడిగితే, ఓనర్‌ను వచ్చి రిజిస్టర్‌ చేయమనండి, జీపీఏ ద్వారా ఇల్లు కొనకూడదు అని చెప్పారు. రిజిస్టర్‌ ఆఫీసు వారు మాత్రం ఏమీ పరవాలేదు జీ.పీ.ఏ. సరిపోతుంది అంటున్నారు. నేను బ్యాంక్‌లోన్‌ కూడా తీసుకోవాలనుకుంటున్నాను. ఏదైనా సమస్య తలెత్తే అవకాశం ఉందా? సూచించగలరు. 
– సౌజన్య, సూర్యాపేట

బహుశా మీరు చెప్పేది సూరజ్‌ ల్యాంప్‌ – ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఠిట. స్టేట్‌ ఆఫ్‌ హర్యానా కేసు అనుకుంటాను. రిజిస్టర్‌ చేయని జీ.పీ.ఏ. ద్వారా ఆస్తులు కొన్న ఒక కంపెనీ సుప్రీం కోర్టును ఆశ్రయించగా సదరు కొనుగోలు చెల్లదని  అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు రిజిస్టర్‌ చేసిన జీ.పీ.ఏ. ద్వారా అమ్మబడే ఆస్తులకు వర్తించదు. జీ.పీ.ఏ. ద్వారా స్థిరాస్తులు కొనాలి అంటే అది కేవలం రిజిస్టర్‌ చేసిన జీ.పీ.ఏ. అయి ఉండాలి. 

అలా కానీ పక్షంలో కొనుగోలు చెల్లదు. సూరజ్‌ ల్యాంప్‌ కేసు తీర్పు వచ్చి ఒక దశాబ్దం పైనే అయింది కానీ చాలామందిలో ఇంకా ఆ తీర్పుపై మొదట్లో కలిగిన అపోహలు పోయినట్లు లేవు. మీరు కొనాలి అనుకునే ఆస్తి యజమాని తాను నివసించే దేశంలో ఒక జీ.పీ.ఏ. పత్రాన్ని నోటరీ చేపించి భారతదేశంలో తన భార్యకు పంపాలి. 

ఆ జీ.పీ.ఏ.ను ఇక్కడ రిజిస్టర్‌ ఆఫీసులో తగిన రుసుము చెల్లించి వాలిడేషన్‌ చేయించవలసి ఉంటుంది. అలా వాలిడేషన్‌ చేయించిన తరువాత మాత్రమే జి.పి.ఎ. ద్వారా అమ్మకాలు చేయవచ్చు. ఈ ప్రక్రియను అవలంబిస్తూ మీరు ఆస్తి కొన్నట్లయితే దాదాపుగా ఎటువంటి సమస్యా లేనట్టే. ఎలాగో బ్యాంకు లోన్‌కి వెళ్తాను అంటున్నారు కాబట్టి, బ్యాంక్‌ ప్యానెల్‌ అడ్వకేట్లు అన్ని పత్రాలను పరిశీలిస్తారు. 

అయినప్పటికీ మీరు కొనాలి అనుకుంటున్న ఆస్తి పత్రాలను అనుభవజ్ఞులైన న్యాయవాది/న్యాయ నిపుణులకి చూపించి కొనుక్కోవడం మంచిది. డబ్బులు చెల్లించడానికి ముందు అడ్వాన్స్‌ ఇవ్వడం వంటివి చేస్తే సరైన రీతిలో అగ్రిమెంట్లు రాసుకుని డబ్బులు చెల్లించడం మంచిది.  

శ్రీకాంత్‌ చింతల, హైకోర్టు న్యాయవాది
(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.com కు మెయిల్‌ చేయవచ్చు. ) 

ఇదీ చదవండి: క్షమించి..ఓడించడమే దీర్ఘాయువు..! బ్రయాన్‌ షాకింగ్‌ వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement