జస్ట్‌ రూ. 2లు వసూలు చేసినందుకు ఎంత పనైపాయె! | UP Restaurant Charged Rs 2 Extra For Water Bottle Ends Rs 1 Lakh Fine | Sakshi
Sakshi News home page

చూడటానికి చిన్న కేసు..! కానీ భారీ మూల్యం తోపాటు పవర్‌ఫుల్‌ సందేశం..

Oct 15 2026 3:42 PM | Updated on Oct 15 2026 3:58 PM

UP Restaurant Charged Rs 2 Extra For Water Bottle Ends Rs 1 Lakh Fine

నీటి బాటిల్‌పై కేవలం రూ. 2లు అదనంగా వసూలు చేయడంతో ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో ఒక రెస్టారెంట్‌ భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. ఈ కేసు వినియోగదారుల హక్కుల ప్రాముఖ్యత తోపాటు, వ్యాపార సంస్థలకు గట్టి సందేశం ఇచ్చినట్లయ్యింది. 

అసలేం జరిగిందంటే..ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో హత్రాస్‌లో మార్చి 11, 2026న జరిగింది. అలీగఢ్‌కు చెందిన అంకుర్ అగర్వాల్ అనే వ్యక్తి భోజనం కోసం హత్రాస్‌లోని 'బీబీసీఎన్ రాయల్ రెస్టారెంట్ అండ్ పార్టీ హాల్' (BBCN Royal Restaurant and Party Hall)కు వెళ్లారు. అక్కడ ఆయన ఒక నీళ్ల బాటిల్‌ను ఆర్డర్ చేశారు. ఆ బాటిల్‌పై ముద్రించిన గరిష్ట విక్రయ ధర (MRP) రూ. 18 కాగా, రెస్టారెంట్ యాజమాన్యం ఆయన నుంచి రూ. 20 వసూలు చేసింది. 

కేవలం రూ. 2 తేడానే అయినప్పటికీ, అంకుర్ అగర్వాల్ ఆ రెస్టారెంట్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ నేపథ్యంలోనే అగర్వాల్ అలీగఢ్‌లోని జిల్లా వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ సమయంలో, ఆయన రెస్టారెంట్ బిల్లును, నీళ్ల బాటిల్ ఫోటోను సాక్ష్యంగా సమర్పించారు. ఆ బిల్లులో, బాటిల్ ధర (ఎంఆర్‌పి) రూ. 18 అని ముద్రించి ఉన్నప్పటికీ, రెస్టారెంట్ దాని కోసం రూ. 20లు వసూలు చేసినట్లు స్పష్టంగా కనిపించింది.

రెస్టారెంట్ యాజమాన్యానికి తమ వాదనను వినిపించే అవకాశం కల్పించినప్పటికీ, వారి తరఫున ఎవరూ హాజరు కాలేదు. దీంతో, కమిషన్ ఫిర్యాదారుడు సమర్పించిన సాక్ష్యాధారాలను ఆధారం చేసుకుని రెస్టారెంట్ వాదన వినకుండానే తన తీర్పును వెలువరించింది. వినియోగదారుల కమిషన్ సదరు రెస్టారెంట్‌కి రూ. లక్ష జరిమానా విధించడం తోపాటు ఫిర్యాదుదారునికి పరిహారంగా రూ. 1000/- ఆయనకు న్యాయపరమైన ఖర్చుల కింద రూ. 5వేలు చెల్లించాలని ఆదేశించింది. అలాగే ఈ ఆదేశాన్ని పాటించడానికి రెస్టారెంట్‌కు 45 రోజుల గడువు కూడా ఇచ్చింది. ఒకవేళ అలా చేయడంలో విఫలమైతే తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొంది. 

కేవలం రూ. 2లు అదనంగా వసూలు చేసినందుకు లక్ష రూపాయాలు మూల్యం చెల్లించుకోవడంతో ఈ కేసు అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేగాదు వినియోగదారుల హక్కులను ఉయోగించుకునే ప్రాముఖ్యతను చాటిచెప్పడమే కాకుండా వ్యాపార సంస్థలకు ఆచితూచి అడుగువేసేలా బలమైన సందేశాన్ని ఇచ్చింది కూడా. 

ముఖ్యంగా ఎంఆర్‌పి కంటే ఎక్కువ వసూలు చేయవద్దని వ్యాపార సంస్థలకు గట్టి హెచ్చరికగా నిలిచింది ఈ కేసు. అలాగే ఈ కేసు ప్రజలు తమ వద్ద అధిక ధర వసూలు చేశారని భావిస్తే, సంబంధిత అధికారులను సంప్రదించవచ్చని నొక్కి చెప్పింది. చూడటానికి చిన్న కేసు కానీ అందరికీ కనువిప్పు కలిగించేలా గట్టి సందేశం అందించింది కదూ..!.

ఇదీ చదవండి: ఒకప్పుడు 20 రోటీలు, 20 ఆమ్లెట్లు..కానీ సడెన్‌గా ఓమాడ్‌ డైట్‌!: యోగ్‌రాజ్‌ సింగ్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement